నీదీ నాదీ ఒకే డైరీ

Every Mother Hides Childrens Memories - Sakshi

అమ్మ దాచుకునే డైరీ కూతురు.కూతురు రాసుకునే డైరీ అమ్మ.కూతురిలో అమ్మ నిక్షిప్తమై ఉంటుంది.అమ్మలో కూతురు వ్యక్తం అవుతుంది.ఊళ్లూ, ఉద్యోగాలు తల్లీకూతుళ్లను వేరు చేయవచ్చు. వాళ్లిద్దరి డైరీ ఒకటే. కలిసి సెల్ఫీ దిగినా కనిపించే బంధం ఒక్కటే.

‘‘కదలకుండా నిలబడు అమ్మడూ... కొంచెం ఓపికపట్టు..’’కూతురికి చీర కడుతూ బతిమాలుతోంది అమ్మ. తన అక్క కూతురి పెళ్లిలో తన కూతురిని కూడా పెళ్లి కూతురిలా ముస్తాబు చేస్తోంది ఆ తల్లి. అది ఆమె ముచ్చట. ఆ అమ్మాయికి 20 ఏళ్లు. ‘‘ముంబైలో ఎంబీఏ చేస్తోంది. తర్వాత ఉద్యోగం. అటు తర్వాత పెళ్లి. ఇక నా దగ్గర ఉండేదెప్పుడు. నా ముచ్చట తీరెదెప్పుడు. అందుకే ఇప్పుడు ఇదిగో ఇలా రెడీ చేసి కళ్లల్లో నింపుకుందామనుకుంటున్నా’’ చెప్పింది ఆ అమ్మ.. ‘‘మీ అమ్మాయే పెళ్లికూతురిలా కనబడుతుందే’’ అని అడిగిన వారికి సమాధానమిస్తూ! రెడీ చేశాక.. ముప్పైసార్లు చూసుకుంది బిడ్డను. దిష్టి తగలకుండా మెటికలు విరిచింది. కలిసి సెల్ఫీ తీసుకుంది.. అక్కడున్న వాళ్లకూ సెల్‌ఫోన్‌ ఇచ్చింది.. తామిద్దరినీ కలిపి ఫోటో తీసిపెట్టమని!వాళ్లకు కాస్త దూరంగా.. ఇదంతా గమనిస్తున్న సమీరకు ఒక్కసారిగా అమ్మ గుర్తొచ్చింది. ఇంటర్‌ నుంచి పేరెంట్స్‌కి దూరంగా హాస్టల్స్‌లో ఉండి చదువుకుంది. ఉద్యోగం వచ్చాకైతే దేశాలూ తిరిగింది. సింగపూర్‌ నుంచి బెంగుళూరుకు వస్తున్నప్పుడు అనుకుంది.. ‘‘ఇండియాకు వచ్చేస్తున్నా కాబట్టి.. మంత్లీ వన్స్‌ అయినా అమ్మావాళ్ల దగ్గరకు వెళ్లొచ్చు’’ అని.

కాని వచ్చాక  సొంతూరు తప్ప అన్ని సిటీస్‌ తిరిగింది  ఆఫీస్‌ పని మీద. ఆ ప్రయాణాలు  విసుగొచ్చి.. హైదరాబాద్‌లోనే ఉండడానికి  చిన్న కంపెనీలో ఆఫర్‌ను యాక్సెప్ట్‌ చేసింది. హైదరాబాద్‌కు వస్తే  డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మానాన్నల దగ్గరకు ప్రతి వీకెండ్‌కీ వెళ్లి వాళ్లతో క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేయొచ్చు అని. అదీ  సాధ్యం కాదని తేలిపోయింది వచ్చిన యేడాదిలోనే. చిన్న కంపెనీ కాబట్టి దాని గ్రోత్‌ కోసమూ కష్టపడాల్సి వస్తోంది. ఎన్ని అనుకుంది. శుక్రవారం రాత్రికే వెళ్లిపోయి.. శని, ఆదివారాలు కంప్లీట్‌గా అమ్మా, నాన్న, నానమ్మ, తమ్ముడితో ఉండాలని, అమ్మ నడుం నొప్పికి ఫిజియో థెరపీ చేయించాలనీ! అమ్మెప్పుడూ తమ కోసం ఆత్రపడ్డమే కాని తన గురించి ఆలోచించదు. పాదాలన్నీ పగిలి.. కాళ్లు కిందపెట్టలేకపోయింది లాస్ట్‌ టైమ్‌ తను వెళ్లినప్పుడు. ఈసారి అమ్మను మంచి పార్లర్‌కు తీసుకెళ్లి పెడీక్యూర్, మానీ క్యూర్‌ చేయించాలనుకుంది. అమ్మ అస్సలు కేర్‌ తీసుకోదు.

తన చిన్నప్పుడు అమ్మ జడ ఎంత పెద్దగా ఉండేది? అమ్మ వీపునానుకుని కూర్చోని ఆమె జడను తన ముందుకువేసుకొని.. ఆ పెద్ద జడ తనకే ఉన్నట్టు ఎంత పోజ్‌ కొట్టేది? మొన్నీ మధ్య కూడా  అలా అమ్మ జడను ముందు వేసుకొని సెల్ఫీ దిగి.. డీపీ పెట్టుకుంది. అంత థిక్‌ హెయిర్‌ అంతా ఊడిపోయి.. సన్నగా తయారైంది. అయినా తోకలా జడే అల్లుకుంటోంది. ఎన్నోసార్లు చెప్పింది.. ‘అమ్మా కట్‌ చేసుకో’ అని. వినదు. హైదరాబాద్‌ వచ్చాక వేసుకున్న ప్లాన్‌లో ముందు అమ్మ జుట్టును భుజాలకు కాస్త కింది వరకు యూ షేప్‌లో కట్‌ చేయించాలని,  క్లచ్‌తో పోనీ వేసుకునేలా అలవాటు చేయిద్దామనీ అనుకుంది. థైరాయిడ్‌ టెస్ట్‌ చేయించాలనేది ఎప్పటికప్పుడు వాయిదా పడ్తూనే ఉంది. మామోగ్రామ్, పాప్‌స్మియర్‌ చేయించి కూడా అయిదేళ్లవుతోంది. మళ్లీ ఆ ఊసేలేదు. న్యూస్‌ పేపర్‌లో  హెల్త్‌కాలమ్స్‌ చదివినప్పుడు ఈసారి కచ్చితంగా అనుకుంటుంది. మళ్లీ వర్క్‌ ప్రెజర్‌లో పడి మరిచిపోతుంది.

కిందటిసారే తనూ తమ్ముడూ అనుకున్నారు.. అమ్మ వాళ్ల చిన్నప్పటి ఫ్రెండ్స్‌ కాంటాక్ట్స్‌ తీసుకొని వాళ్ల పిల్లలతో మాట్లాడి.. గెట్‌ టు గెదర్‌ అరెంజ్‌ చేసి పేరెంట్స్‌కి సర్‌ప్రయిజ్‌ ఇవ్వాలని. అసలు అన్నిటికంటే ముందు అమ్మానాన్నకు నచ్చిన ప్లేస్‌కి ప్లెజెంట్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేయాలని. ఒక్కటంటే ఒక్కటీ కాలేదు. ‘‘ఇక్కడికి వచ్చినప్పుడల్లా.. ఆ పాత నైటీలేసుకొని ఉండే బదులు.. మంచి చుడీదారో... చీరో కట్టుకోవచ్చు కద నానీ’’ అని పాపం ఎన్నిసార్లు అడిగిందో అమ్మ. నాన్నకూ ఉంటుందేమో.. బయటపడలేదెప్పుడూ. ఎన్ని డ్రెస్సులు కొని పంపేది అమ్మ! తనకు తెలిసినంత వరకు అవేవీ అమ్మ ముందు వేసుకోలేదు. ఫొటోల్లో.. ఇప్పుడు ఎఫ్బీ.. డీపీల్లో చూడ్డమే. అమ్మకు ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేయడం కూడా రాదు.

పెండింగ్‌ ప్లాన్స్‌లో అదీ ఒకటి.. ఎప్బీ ఎకౌంట్‌ ఓపెన్‌ చేయించడం.ఈ తలపులు, ఆలోచనలు సమీర కళ్లల్లో నీటిని తెప్పించాయి. వెంటనే పక్కకు వెళ్లి అమ్మకు ఫోన్‌ చేసింది. నాన్న లిఫ్ట్‌ చేశారు. ‘‘అమ్మకు నడుంనొప్పిరా.. బాలేదు. పడుకుంది’’ చెప్పారు బాధగా. ఇక అక్కడ ఉండాలనిపించలేదు ఆ అమ్మాయికి. తన ఫ్రెండ్‌ అయిన వధువుకి బై చెప్పి బయటపడింది.. ఊరెళ్లడానికి!చాలామంది  అమ్మాయిలకు ఈ వెలితి ఉంది. చదువు, ఉద్యోగ రీత్యా వేరే ఊళ్లు, రాష్ట్రాలు, దేశాలు.. తర్వాత అత్తారింటికి వెళ్లినా అనుక్షణం బిడ్డ క్షేమం గురించే తపిస్తుంటారు తల్లులు. జడ కుచ్చులు, క్లిప్పులు దగ్గర్నుంచి తన చేతి వంట దాకా అన్నిటినీ  దగ్గరుండి కొనిపించాలని, తినిపించాలనీ తాపత్రయ పడ్తుంటారు.

సప్తసముద్రాల ఆవలిక్కూడా కొరియర్‌ చేసేస్తుంటారు. పిల్లలు అక్కడ వాటితో ఫోటోలు దిగి పంపిస్తే చూసుకొని ఆనంద పడ్తుంటారు. ‘‘అమ్మా ఫలానా వాళ్ల మదర్‌ ఫలానా పికిల్‌ ఎంత బాగా చేసిందో’’ అని బిడ్డ అన్యాపదేశంగా ఆదేశించిన మాటతో యూట్యూబ్‌లో చూసి, నేర్చుకుని మరీ  పెట్టి పంపించే తల్లులూ ఉన్నారు. ఆ అమ్మల రుణం ఏ రకంగానూ తీర్చుకోవట్లేదని సమీరలా బాధపడే కూతుళ్లు ఎంతో మంది. ‘‘వర్క్‌ బిజీ, బాధ్యతలు.. పాపం మా చిట్టితల్లులను ఊపిరి సలపనివ్వవు’’ అంటూ తల్లులే సర్దుకుపోతుంటారు.
– సరస్వతి రమ

ఫేషియల్‌ చేయించాలని..!
మాది నల్గొండ. జాబ్‌ వల్ల ఎక్కడెక్కడో ఉన్నప్పుడు చాలా ఫీలయ్యేదాన్ని పేరెంట్స్‌తో గడపలేకపోతున్నా అని. హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్‌ అవగానే.. హమ్మయ్య... ఎవ్రీ వీకెండ్‌ ఊరెళ్లిపోయి.. అమ్మావాళ్లతో స్పెండ్‌ చేయొచ్చు అని సంబరపడ్డ. ఎవ్రీ వీకెండ్‌ కాకపోయినా.. ఇదివరకన్నా ఫ్రీక్వెంట్‌గానే వెళ్తూ ఉన్నా. కాని.. నేనుకున్నట్టు  టైమ్‌ స్పెండ్‌ చేయలేకపోతున్నా.. చాలా సార్లు అనుకుంటా ఉన్న రెండు రోజులైనా అమ్మకు హెల్ప్‌ చేయాలని. కాని బద్దకంగా పడుకునే ఉంటా. అమ్మను గుడికి తీసుకెళ్లాలని, పార్లర్‌లో  ఫేషియల్‌ చేయించాలని చాలా అనుకుంటా. ఒక్కటి కూడా కాదు. పై నుంచి వాళ్లే నా గురించి కేర్‌ తీసుకుంటూంటారు. బట్‌  లాస్ట్‌టైమ్‌ నుంచి కొంచెం స్ట్రిక్ట్‌గానే ఫాలో అవుతున్నా. కంటిన్యూ చేస్తా కూడా.

– ఎస్‌. రీతూ రావు, హైదరాబాద్‌

వైటమిన్‌ టాబ్లెట్స్‌ తప్ప..!
‘‘ఇల్లినాయీ (షికాగో)లో ఉంటా. ఇక్కడికొచ్చి దాదాపు అయిదేళ్లవుతోంది. ఎమ్మెస్‌ కోసం వచ్చా. ప్రెజెంట్‌ జాబ్‌ చేస్తున్నా. అమ్మ నా కోసం ఎంత చేస్తుందో! అక్కడ ఏది బాగా అనిపిస్తే అది నాకు పంపుతుంది. వద్దమ్మా.. అన్నా వినదు. అమ్మా, నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గరుండి అంతా తిప్పాలనుకున్నా. ప్చ్‌... అప్పుడే నేను ప్రాజెక్ట్‌ మారడం.. జాబ్‌ టెన్షన్‌తో ఏమీ చూపించలేకపోయా. ఏమీ చేయలేకపోయా. ఇక్కడ దొరికే వైటమిన్‌ టాబ్లెట్స్‌ మాత్రం పంపిస్తుంటా. నాన్న సబ్‌ వే ఫూడ్‌ ఇష్టపడ్డారిక్కడ.. అదీ సంతృప్తిగా ఇప్పించలేకపోయానే అని బాధేస్తూంటుంది. ఈసారి నేను ఇండియాకు వెళ్లినా.. వాళ్లు నా దగ్గరకి వచ్చినా..  వాళ్లతోనే›ఉంటా. మా పేరెంట్స్‌కి షిరిడీ సాయిబాబా అంటే నమ్మకం. అక్కడికి తీసుకెళ్తా. ఇంకా చాలా ఉన్నాయి ప్లెజెంట్‌ సర్‌ప్రైజెస్‌ (నవ్వుతూ). 

– మౌనికా కొడాలి, అమెరికా

అమ్మ యంగ్‌గా కనిపించాలి
మాది నిజామాబాద్‌. నేను హైదరాబాద్‌లో జాబ్‌ చేస్తాను. మా అమ్మ టైలర్‌. నాన్న ప్రైవేట్‌ ఎంప్లాయ్‌. నా డ్రెస్సెస్‌ అన్నీ అమ్మనే  డిజైన్‌ చేసి కుడుతుంది. కాని అవేవీ ఆమె దగ్గర వేసుకోలేదు. అమ్మ కంప్లయింట్‌ కూడా అదే. ఇంటి దగ్గర వేసుకుంటే చూసి ముచ్చట పడతా కదా అని. నాకేమో రిలాక్స్‌డ్‌గా ఉండాలనిపిస్తుంది.  మెషీన్‌ తొక్కీతొక్కీ రాత్రయిందంటే  ఆమె కాళ్లు లాగుతుంటాయ్‌. అంతకుముందు పట్టించుకునేదాన్ని కాదు. ఇప్పుడు మాత్రం కాళ్లు నొక్కుతా. పాదాలు మస్సాజ్‌ చేస్తా. మా అమ్మ యంగ్‌గా కనిపించాలనుకుంటా. అందుకే ఆమెను డిజైన్‌ బ్లౌజెస్‌ వేసుకొమ్మని వెంటపడుతుంటా. సల్వార్, కమీజ్‌ వేసుకొమ్మని కూడా ఇన్‌సిస్ట్‌ చేస్తా... మెషీన్‌ తొక్కేటప్పుడూ కన్వీనియెంట్‌గా ఉంటుందని. 

– లంకె శిరీష, ఐటీ ఎంప్లాయి, 
హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top