డయాబెటిస్‌ కారణంగా వరికి బదులు గోధుమలు తింటున్నారా?

Eating Wheat Lowers Bad Cholesterol In The Blood - Sakshi

డయాబెటిస్‌

ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఒకరో ఇద్దరో డయాబెటిస్‌ పేషెంట్స్‌ తప్పక ఉంటున్నారు. వీళ్లలో చాలామంది తమ రాత్రి భోజనంలో వరి అన్నం తినే బదులు గోధుమ రొట్టెలను తింటుండటం చాలా ఇళ్లలో చూస్తున్నాం.ఒక పిండి పదార్ధాన్ని (కార్బోహైడ్రేట్స్‌ను) తీసుకున్నప్పుడు అందులోంచి వెలువడే చక్కెర, దాని వల్ల శరీరానికి సమకూరే శక్తిని గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ అనే కొలతలో చెబుతారు. నిజానికి వరి అన్నం, గోధుమ రొట్టె... ఈ రెండింటి గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ ఒక్కటే. అంటే వరిలోనూ, గోధుమలోనూ ఉండే కార్బోహైడ్రేట్ల నుంచి వెలువడే చక్కెరపాళ్లు దాదాపుగా ఒకటే.

అంటే నిజానికి ఏది తిన్నా పర్లేదన్నమాట.కానీ ఇక్కడో తిరకాసు ఉంది. మనం అన్నం తినే సమయంలో కూర చాలా రుచిగా ఉంటే మనకు తెలియకుండానే నాలుగు ముద్దలు ఎక్కువ తినేస్తాం. కానీ రొట్టెలు తింటున్నామనుకోండి. ఎన్ని తింటున్నామంటూ మనకో కొలత తెలుస్తుంది. అందుకే మనం తినే ఆహారం పరిమితి మించదు. దాంతో రక్తంలో గ్లూకోజ్‌ పెరగదు. అంతేగానీ... రాత్రివేళ పరిమితిగా అన్నం తిన్నా, లేక రొట్టె తిన్నా ఒక్కటే.మళ్లీ ఇక్కడ ఒక మెలిక ఉంది... పైన చెప్పిన ప్రకారం గోధుమలు తినడం వల్ల డయాబెటిస్‌ వారికి ఏలాంటి అదనపు ప్రయోజనమూ చేకూరదని చెప్పడం కూడా పూర్తిగా సరికాదు. ఎందుకంటే... అరకప్పు తెల్లగోధుమలో 1.3 గ్రాముల పీచు ఉంటుంది.

అదే అరకప్పు పొట్టుతీయని గోధుమలో 6.4 గ్రాముల పీచు ఉంటుంది. అందువల్ల డయాబెటిస్‌ ఉన్నవారు పొట్టుతీయని గోధుమ తింటే... రక్తంలోకి గ్లూకోజ్‌ ఇంకిపోవడం అన్నది చాలా చాలా నెమ్మదిగా జరుగుతుంది. అంటే పొట్టు తీయని గోధుమ వల్ల రెండు రకాల ప్రయోజనాలన్నమాట. మొదటిది రక్తంలోకి గ్లూకోజ్‌ నెమ్మదిగా విడుదల కావడం, రెండోది జీర్ణక్రియ సక్రమంగా జరగడంతో పాటు మలబద్ధకం నివారితం కావడం. ఈ రెండు కారణాలను పరిగణనలోకి తీసుకుంటే వరితో పోలిస్తే గోధుమ ఒకింత మంచిదనే చెప్పుకోవచ్చు.

గోధుమలో వివిధ అంశాల తీరుతెన్నులివి...
►ఒక కప్పు గోధుమల్లో 
►క్యాలరీలు... 407
►కొవ్వులు 2.24 గ్రా.
►కార్బోహైడ్రేట్లు 87.08 గ్రా.
►ప్రోటీన్లు 16.44 గ్రా.

గోధుమలో పోషకాలివి : ఇక గోధుమలలో మంచి చెప్పుకున్నట్లుగా కార్బోహైడ్రేట్లతో  (పిండిపదార్థాలతో) పాటు ప్రోటీన్లు, పీచుపదార్థాలు, ఐరన్, విటమిన్‌ బి కాంప్లెక్స్,  మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్‌ వంటి పోషకాలు ఉన్నాయి. ఒక ఇందులో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మనం చాలా సందర్భాల్లో గోధుమ మీద పైపొరను తొలగించి వాడుతుంటారు. దాన్నే వైట్‌ వీట్‌గా పేర్కొంటారు. అదే పొట్టు తొలగించని గోధుమను హోల్‌వీట్‌ అంటారు. హోల్‌వీట్‌లోనే పీచు పదార్థాలు ఎక్కువ అని గుర్తుంచుకోవాలి.

ఆరోగ్యపరమైన ప్రయోజనాలివి : పొట్టు తీయని గోధుమల్లో పీచు (డయటరీ ఫైబర్‌) ఎక్కువ కాబట్టి జీర్ణప్రక్రియ సాఫీగా జరుగుతుంది. దీనికి తోడు పొట్టు తీయని గోధుమలతో రొట్టెలు తినేవారిలో విరేచనం సాఫీగా జరిగి మలబద్ధకం నివారితమవుతుంది. పీచు తీయని గోధుమ వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. దాంతో గుండెజబ్బులు నివారితమవుతాయి. దాంతో స్థూలకాయం కూడా తగ్గుతుంది. ఈ విషయం కొలరాడో స్టేట్‌ యూనివర్సిటీ అధ్యయనాల్లో అధికారికంగా నిరూపితమైంది. ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఒక పూట గోధుమలు తినడం మంచిదే. అలాగని గోధుమలు ఇష్టం లేనివారు వరి అన్నమే తినదలచుకుంటే మాత్రం కూర రుచిగా ఉన్నా లేకున్నా తమ రాత్రి భోజనం పరిమితికి మించకుండా చూసుకోవాలనే జాగ్రత్త తీసుకోవాల్సిందే.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top