నడయాడిన దైవం

Devotional Storys of Chandrashekarendra Saraswati  - Sakshi

పండుగ పర్వం

శ్రీ శంకర భగవత్పాద పరంపరాగత మూలామ్నాయ కంచి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతిగా 13 సంవత్సరాల పసిప్రాయంలో బాధ్యతలను స్వీకరించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు నూరేళ్ల తమ జీవితకాలంలో దాదాపు 85 సంవత్సరాల పాటు పీఠబాధ్యతలను, ఇటు ధర్మబోధనలను ఏకకాలంలో సమర్థంగా నిర్వహిస్తూ ఆ పీఠానికి పరమాచార్యునిగా పేరొందారు. రేపు ఈ నడిచేదైవం ఆరాధన.  ఈ సందర్భంగా...

ఎంతోమంది వీరి దర్శనం లభిస్తే చాలు, జన్మధన్యమైందని భావించేవారు. దేశ, విదేశీ రాజకీయ, చారిత్రక, మత ప్రముఖులు స్వామివారిని సందర్శించి, వారితో చర్చించి తమ అభిప్రాయాలను పంచుకునేవారు. స్వామివారు తమదైన శైలిలో చెప్పిన సమాధానంతో వారంతా సంతృప్తికరమైన భావనతో తిరిగి వెళ్ళేవారు. ప్రాచీన తాళపత్రాలను సేకరించి వాటిని పరిష్కరించి ప్రచురించే దిశగా ప్రయత్నాలు కొనసాగించారు. మరోవైపు జైళ్ళలో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను సన్మార్గంలోకి తెచ్చేందుకు కృషి కొనసాగించారు. ఆసుపత్రులలో వైద్యులకు భోజనాలకు ఏర్పాట్లు చేయించారు. ఇలా పలుమార్గాలలో వీరి సమాజసేవ కొనసాగింది.

మహాస్వామి వారి మహితోక్తులు
►మనసు ఈశ్వరునికి స్థానం. కానీ మనం దాన్ని చెత్తతో నింపేస్తున్నాం. దాన్ని మనమే శుభ్ర పరచుకుని, ఈశ్వరుని ప్రతిష్ఠించుకుని, శాంతితో ఉండాలి. అందుకోసం మనం ప్రతిరోజూ కనీసం ఐదునిమిషాలు ధ్యానానికి కేటాయించి, ప్రళయం సంభవించినా దాన్ని చేయగలిగిన సంకల్పం కలిగి ఉండాలి
►సేవ అనేది కేవలం మానవ సమాజానికే పరిమితం చేయకుండా, జంతుజాలానికి కూడా చేయాలి. పూర్వపు రోజుల్లో పశువుల కోసం ప్రత్యేకంగా చెరువులు తవ్వించేవారు. చాలా చోట్ల గరుకు స్తంభాలు వేయించేవారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఒక్క ఆవుకైనా చేతినిండా సరనిపడే గడ్డి పెట్టాలి. దీన్నే గోగ్రాసం అంటారు. గ్రాసం అంటే నోటినిండా అని అర్థం. గ్రాస్‌ అనే ఆంగ్ల పదం నదీని నుండే వచ్చింది
►మన వ్యక్తిగత అవసరాలకోసం డబ్బును ఖర్చుచేయడమంటే ముఖానికి మసిపూసుకున్నట్లే
►కనీస అవసరాలకై ఎదురుచూసే ఎంతోమంది అభాగ్యులకు సేవచేయడం కూడా పరమేశ్వరారాధనే అవుతుంది. దానివల్ల ఆత్మతృప్తి కలుగుతుంది
►ఇతరుల బాగుకోసం చేసే పనిలో కలిగే బాధైనా చివరకు ఆనందాన్నే మిగులుస్తుంది.

అరటి ఆకులు – ప్లాస్టిక్‌ పొట్లాలు
కంచి మహాస్వామి వారు 1960లో తిరుచ్చి నేషనల్‌ కాలేజ్‌ హైస్కూలులో మకాం చేస్తున్నారని తెలిసి వారి దర్శనం కోసం రోజూ వేలసంఖ్యలో భక్తులు వస్తున్నారు. వచ్చినవారందరికీ  రుచికరమయిన భోజనం పెడుతున్నారు. ఉదయం పదకొండు గంటలకు మొదలయ్యే ఈ అన్నదానం సాయంత్రం నాలుగ్గంటల వరకూ జరిగేది. ఏర్పాట్లు చేసే బృంద సభ్యులు ఈ భక్తుల తాకిడిని నియంత్రించడానికి, భోజనాలు అయ్యాక వారిని పంపడానికి చాలా తంటాలు పడుతున్నారు. వారి సమస్యను స్వామివారికి చెప్పి, భోజనానికి వచ్చే భక్తులకు పంక్తి భోజనం కాకుండా ఆహార పొట్లాలను ఇచ్చే విషయమై స్వామివారికి తెలిపారు.
పరమాచార్య ఆ కమిటీ సభ్యులను ముందర కూర్చోబెట్టుకుని రెండు ప్రశ్నలను అడిగారు.

మొదటిది: ఆహార పొట్లాంలోని పదార్థాన్ని తిన్న తరువాత ఆ అరటి ఆకులను వారు ఎక్కడ పడవేస్తారు? రెండవది: దాహాన్ని తీర్చుకోవడానికి నీళ్ళకోసం వారు ఎక్కడకు వెళతారు? ఈ ప్రశ్నలకు ఎవ్వరూ సమాధానం ఇవ్వలేకపోవడంతో స్వామివారే చెప్పారు.  ‘‘నేను ఎన్నో ప్రాంతాలకు వెళ్లినప్పుడు, భోజనం తరువాత ఆ అరటి ఆకులను ఒక తొట్టెలో పడవేస్తారు. నేను చూశాను– ఆ ఆకులలో మిగిలిపోయిన పదార్థాలను నారికురవలు సేకరిస్తారు. ఆ ఆకులకు అంటుకున్న ఆహార పదార్థాలను ఆవులు తింటాయి. మీరు గమనించండి, ఆకులు వేసి భోజనం పెట్టడం వల్ల ఎందరో ఇతరుల ఆకలి కూడా తీరుతోంది’’. ‘‘ఆహార పొట్లాలను తయారు చెయ్యాలన్న మీ ఆలోచనను విరమించుకొని, అందరికీ అరటి ఆకులు వేసి భోజనం పెట్టండి. ఇంతమంది ప్రజలు ఆహారం స్వీకరించడాన్ని చూడటం, దానికోసం ఖర్చు పెట్టుకోవడం కూడా మీకు పుణ్యం. నాకు ఆనందం కూడా’’ అన్న సమారాధనలు చెయ్యడం చూశాము కానీ, దాని గొప్పదనాన్ని ఇటువంటి మహాత్ములు చెప్పిన తరువాతనే అర్థం చేసుకున్నాము.
– రా. వేంకటసామి  ‘శక్తి వికటన్‌’ నుంచి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top