నిజాయితీ విలువ | devotional information | Sakshi
Sakshi News home page

నిజాయితీ విలువ

Jan 21 2018 12:57 AM | Updated on Jan 21 2018 12:57 AM

devotional information - Sakshi

పూర్వం జీలాన్‌ అనే దేశంలో అబూసాలెహ్‌ జంగీదోస్త్‌ అనే యువ వ్యాపారి ఉండేవాడు. అతను ఎంతో నిజాయితీ పరుడు. దైవభక్తి గలవాడు. ఒకసారి అతను   పనిమీద వేరే ఊరుకు వెళుతుండగా ఆకలి దప్పులతో బాధపడుతూ మార్గమధ్యంలో ఒకవాగు ప్రవహిస్తుంటే, అందులో నీళ్ళు తాగాడు. వాగులో ఒక యాపిల్‌ పండు కొట్టుకొని వస్తోంటే, దాన్ని ఒడిసిపట్టుకొని వెనకా ముందూ ఆలోచించకుండా తినేశాడు.

ఆకలి చల్లారిన తరువాత అతనికో ఆలోచన వచ్చింది. ఎవరిదో పండుజారి వాగులో పడి ఉంటుంది. వాళ్ళ అనుమతి లేకుండా తినేశా గదా..! అన్న అపరాధ భావం ఏర్పడింది. ఇప్పుడేం చేయాలీ..? అని ఆలోచిస్తూ, వాగు వెంట నడవ సాగాడు. కొద్ది దూరం వెళ్ళిన తరువాత వాగొడ్డునే ఒక యాపిల్‌ తోట కనిపించింది. అందులో ఒక చెట్టు శాఖలు వాగువైపు విస్తరించి ఉన్నాయి. తాను తిన్న యాపిల్‌ పండు ఈ తోటదే అని నిర్ధారణకు వచ్చి, వెళ్ళి తోట యజమానిని కలిశాడు. ఆయనపేరు అబ్దుల్లాహ్‌ సౌమీ. అతనికి విషయం వివరించి, తనను క్షమించమని విన్నవించుకున్నాడు.

తోట యజమానికి పండురాలిన సంగతి కానీ, దాన్ని అతడు తిన్న సంగతి కానీ తెలియనే తెలియదు. పైగా ఎందుకు తిన్నావని అడగనే లేదు. ఆ యువకుడి నిజాయితీకి ఎంతో ముచ్చట పడ్డాడు. సంతోషాన్ని బయటికి కనబడనీయకుండా, ‘నిన్ను క్షమించాను కాని ఒక షరతు’ అన్నాడు. యువకుడు భయపడిపోతూ, ‘అయ్యా !సెలవీయండి’. అన్నాడు. ‘నాకో కూతురుంది. ఆమె మూగది, కుంటిది, గుడ్డిది, చెవిటిది. నువ్వామెను పెళ్ళి చేసుకోవాలి.’ అన్నాడు సౌమీ.

తాను నిరపరాధిగా బయట పడాలంటే ఒప్పుకోక తప్పదు కాబట్టి, ‘సరేనండీ’ అన్నాడు. వెంటనే పెళ్ళి ఏర్పాట్లు జరిగి పొయ్యాయి. పెళ్ళీ అయిపోయింది. మొదటి రాత్రి తన  గదిలోకి వెళ్ళిన యువకుడు బంగారు బొమ్మలా ఉన్న అమ్మాయిని చూసి అదిరిపోయాడు.పరుగున మామ దగ్గరకు వెళ్ళాడు. తాను పొరపాటున వేరే గదికి వెళ్ళానని, అక్కడ ఎవరో అందమైన అమ్మాయి ఉందనీ చెప్పాడు. ఆయన నవ్వుతూ, ‘‘నువ్వేమీ పొరబడలేదు. మా అమ్మాయి మూగది, గుడ్డిది, కుంటిది, చెవిటిది అని ఎందుకన్నానంటే, ఆమె నోట ఎప్పుడూ అసత్యం కానీ, పరుష పదజాలం గానీ వెలువడలేదు.

అందుకే మూగది అన్నాను. చెడు దృశ్యాలు చూసి ఎరుగదు. అందుకని గుడ్డిది అన్నాను. చెడుమాటలు వినలేదు కాబట్టి చెవిటిది అన్నాను. అనవసరంగా గడప దాటి ఎరుగదు. అందుకే కుంటిది అన్నాను. అంతే తప్ప అమ్మాయిలో ఎలాంటి దోషమూ,  లోపమూ లేదు. కేవలం నిన్ను పరీక్షించడానికే ఇలా చేశాను.’’ అన్నారు. ఎలాంటి స్థితిలోనూ ఇతరుల సొమ్మును ముట్టకూడదన్న సందేశాన్ని విలువలతో, నిజాయితీతో ఆచరించి ప్రపంచానికి చాటిచెప్పిన ఆ మహనీయుడు అబూసాలెహ్‌ జంగీదోస్త్‌. ఆ దంపతులకు జన్మించిన మహాపురుషుడే షేఖ్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ జీలానీ రహ్మతుల్లాహ్‌ అలైహ్‌.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement