అతిగా తలస్నానం చేసినా  జుట్టుకు ముప్పే! 

Despite the threat of off too much hair - Sakshi

తమ జుట్టు చాలా శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో కొందరు రోజుకు రెండుసార్లు కూడా తలస్నానం చేస్తుంటారు. నిజానికి ఇలా అతిగా తలస్నానం చేయడం కేశాలకు నష్టం చేకూర్చి, జుట్టును పలచబారుస్తుంది. దీనికి కారణాలను తెలుసుకుందాం. కేశాలు మొలిచే చోట ఒక సెంటీమీటరులో నాలుగో వంతు భాగం డిర్మస్‌ అనే చర్మపు పొర కింద కూరుకుపోయి ఉంటుంది. ఈ భాగాన్ని ఫాలికిల్‌ అంటారు. అంటే ఈ ఫాలికిల్స్‌ అన్నీ  కేశపు కుదురులో కూరుకుపోయి ఉంటాయన్నమాట. ఆ రోమపు కుదురులోని వెంట్రుక బయటకు వచ్చేచోట స్కాల్ప్‌పై మురికి, బ్యాక్టీరియా చేరుతూ ఉంటాయి. వాటిని తప్పక శుభ్రం చేసుకోవాల్సిందే. అయితే అలా శుభ్రం చేసుకునేందుకు మాటిమాటికీ తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలో ఉండే ప్రొటీన్‌ బాండ్స్‌ వదులైపోతుంటాయి. అంతేగాక జుట్టును శుభ్రపరచడానికి వాడే షాంపూ... ఆ జుట్టులోని తేమను లాగేస్తుంది. అందుకే అతిగా షాంపూ వాడేవారి జుట్టు పీచులా మారిపోయి ఉంటుంది.
 

ఇక కొందరు షాంపూతో తలస్నానం చేయగానే జుట్టును కుప్పలా ముడివేసుకుంటారు. దాంతో జుట్టు కాస్త తడిగా ఉన్నప్పుడు అలా ముడేయడం వల్ల అది చిక్కుపడిపోతుంది. అలా చిక్కుపడ్డదాన్ని దువ్వుతున్నప్పుడు వెంట్రుక మూలంలో నొప్పి కలగడం చాలామందికి అనుభవమే. ఇలా తరచూ స్నానం వల్ల జుట్టులోని ప్రొటీన్‌ బాండ్స్‌ వదులై జుట్టు బలహీనం కావడం, అధికంగా తలస్నానం చేయడం వల్ల షాంపూ ప్రభావంతో జుట్టు పీచులా మారడం, చిక్కుముడులను దువ్వుతున్నప్పుడు జుట్టు కుదుళ్లలో నొప్పి వస్తున్నా అదేపనిగా దువ్వడం వంటి అన్ని చర్యలతో జుట్టు రాలడం చాలా సాధారణం. అందుకే అతిగా చేసే తలస్నానం కూడా జుట్టును నష్టపరుస్తుంది. జుట్టు ఆరోగ్యకరంగా ఉండాలంటే మైల్డ్‌ షాంపూతో కేవలం వారానికి రెండుసార్లు తలస్నానం చేయడం మేలు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top