రుద్రమడాడీ

దర్శకుడు గుణశేఖర్ పెద్దకుమార్తె నీలిమ, చిన్నకుమార్తె యుక్తముఖి; మధ్యలో 'రుద్రమదేవి' గా అనుష్క


ఫాదర్స్ డే ప్రత్యేకం

తండ్రిగా... ఎంతో ప్రేమిస్తాడు!

నాన్నగా... ‘నాన్నలు’ అని పిల్చుకుంటాడు!

డాడీగా... వాళ్లని డైనమిక్‌గా మలుస్తాడు!

ఫాదర్‌గా... బెస్ట్ ఫ్రెండ్‌లా ఉంటాడు!

ఇంటి పెద్దగా... బాధ్యతను నేర్పిస్తాడు!

అన్నలా... అడిగింది కొనిస్తాడు! డ్

రైవర్‌గా... స్కూల్‌లో దించుతాడు!

ఇన్ని గుణాలున్న శేఖరుడు ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ!


 

రాత్రి 7.30 గంటలు. హైదరాబాద్‌లో చిరుజల్లులు... అప్పటికే చీకటి, రోడ్ల మీద ట్రాఫిక్. కమ్ముకొస్తున్న వాటిని చీల్చుకుంటూ ‘గుణ మీడియా వర్క్స్’ ఆఫీసుకి చేరాం. దేశంలో తొలి చారిత్రక స్టీరియోస్కోపిక్ 3డి ఫిల్మ్ ‘రుద్రమదేవి’ దర్శకుడు గుణశేఖర్ పెద్దమ్మాయి నీలిమ (21) హాలులో ఉంది. చుట్టూ ‘రుద్రమదేవి’ మినియేచర్ సెట్స్, ఆర్ట్ వర్క్స్, చరిత్ర పుస్తకాలు. సెవన్త్ గ్రేడ్ చదువుతున్న చిన్నమ్మాయి యుక్తాముఖి (12) స్కూలులో లేటవడంతో ఇంకా రాలేదు. ముందుగా పెద్దమ్మాయితో, తర్వాత చిన్నమ్మాయితో భేటీ... ‘రుద్రమదేవి’కి సహనిర్మాతలైన ఆ పిల్లలిద్దరూ క్రియేటర్ గుణశేఖర్‌లోని కుటుంబ కోణంపై ఫోకస్ లైట్ వేశారు. చివరలో గుణశేఖర్, ఆయన శ్రీమతి రాగిణి వచ్చి మాతో కలిశారు. నలుగురితో విడివిడిగా మాట్లాడిన ఈ కలివిడి కబుర్లు... వారు మీడియాకిచ్చిన తొలి ‘ఫ్యామిలీ’ గ్రూప్ ఫోటో సాక్షిగా ఇవీ...

 

వెరీ గుడ్ హ్యూమన్‌బీయింగ్!

- నీలిమ (గుణశేఖర్ పెద్దమ్మాయి)


గుణశేఖర్ గారు అందరికీ పెద్ద డెరైక్టర్ కానీ, మాకు మాత్రం లవబుల్ డాడ్! ఇంట్లో ఎప్పుడూ ఆయన ఒక  ఫాదర్ లానే తప్ప, సినిమా మనిషిలా ఉండరు. మా ఇంట్లో సినిమా వాతావరణమూ ఉండదు. మేమెప్పుడూ షూటింగ్‌లకూ, సినిమా ఫంక్షన్లకూ వెళ్ళేదీ లేదు. ‘రుద్రమదేవి’ప్రాజెక్ట్‌కే ఆ ఎక్స్‌పీరియన్స్ ఎదురైంది.

 

పక్కా ఫ్యామిలీ మ్యాన్!

సెట్స్‌లో నాన్న సీరియస్‌గా ఉంటారు. కానీ, చాలామందికి తెలియనిదేమిటంటే, ఆయనకు మంచి సెన్సాఫ్ హ్యూమరుంది. నాన్న ఎంత ఫ్యామిలీ మ్యానంటే... సినిమాకెళ్ళినా, షికారుకెళ్ళినా అమ్మ, నేను, చెల్లెలు - నలుగురం కలిసి వెళ్ళాల్సిందే. ఆయనొక్కరూ వెళ్ళరు. ఇంట్లో హోమ్ థియేటర్‌లో కూడా అందరం కలిసి, సినిమాలు చూడాల్సిందే! నాన్న పార్టీలకు వెళ్ళే రకం కాదు. ఆయన ధ్యాసంతా సినిమా మీదే! షూటింగ్ పని ముగించుకొని ఇంటికి వచ్చేశాక, ఉన్న కాసేపూ మాతోనే గడుపుతారు. వర్క్‌లో ఎంత టెన్షన్ ఉన్నా, మాతో గడిపే టైమ్ ఆయనకు రిలీఫ్. వీలున్నప్పుడల్లా మమ్మల్ని స్కూలు దగ్గర దింపడం, తేవడం ఆయనకు బాగా ఇష్టం.

 

పుస్తకాలు, పేపర్లు చదవమంటారు!

నాకు పెయింటింగంటే ఇష్టం. నా హాబీని నాన్న ఎంకరేజ్ చేస్తుంటారు. అలాగే, ఈ వయసులో ఉండే పిల్లలందరి లానే నాకూ రకరకాల ఇంట్రెస్ట్‌లు. ఒక దాని నుంచి మరో దాని మీదకు ఫోకస్ మారిపోతుంటుంది. అది నాన్న అర్థం చేసుకొని, ప్రతి రంగంలోని పాజిటివ్‌లు, నెగిటివ్‌లు వివరించి చెబుతుంటారు. ఈ మధ్యే బి.ఏ- మాస్ కమ్యూనికేషన్ చదివిన నాకు మంచి జర్నలిస్ట్‌ను కావాలని కోరిక. చరిత్ర, పాతకాలపు వస్తువులంటే నాకిష్టమని, లండన్‌కు పంపి, అక్కడ హయ్యర్ స్టడీస్ చేయిం చాలని నాన్న అనుకుంటున్నారు. ఇక్కడ ‘రుద్రమదేవి’ కోసం ‘గుణ టీవ్‌ు వర్‌‌క్స’ క్రియేటివ్ హెడ్‌గా డిజిటల్ పబ్లిసిటీతో పాటు కాస్ట్యూమ్స్, మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్ - ఇలా చాలా శాఖల్లో పనిచేశా. ఇదంతా ఇంటర్న్‌షిప్‌లా పనికొచ్చింది. నా చదువునూ, ఈ అనుభవాన్నీ కలిపి, భవిష్యత్తులో సినీ మీడియమ్‌లోకి వస్తానేమో చెప్పలేను.  

 

తెలుగు భాషన్నా, చరిత్రన్నా, పుస్తకాలన్నా నాన్నకి ఇష్టం. మా ఇంట్లో పురాణేతిహాసాలు సహా బోలెడన్ని బుక్సున్నాయి. రోజూ బోలెడన్ని పేపర్లు, మ్యాగజైన్స్ ఇంటికి వస్తాయి. మనిషి ఎదగాలంటే పుస్తకాలు చదవాలనీ, తెలుగు బాగా నేర్చుకోవాలనీ చెబుతుంటారు.

 

ఆయన నేర్పిన విలువలు అవి!

డెరైక్టర్‌గా నాన్న గొప్పే కానీ, అంతకు మించి వెరీగుడ్ హ్యూమన్‌బీయింగ్! ఆయన నిస్వార్థం, తోటివాళ్ళ బాగోగుల్ని పట్టించుకోవడం నాకు నచ్చుతాయి. ‘తోటివాళ్ళ పట్ల దయగా ఉండాలి. లేనిదాని కోసం ఆరాటం కన్నా ఉన్నదాని పట్ల తృప్తి ముఖ్యం’ - మా ఇద్దరికీ ఆయన నేర్పిన విలువలు అవి. అందుకే, ఇతరులతో పోల్చుకోం. కంఫర్టబుల్‌గా బతకడానికి ఉందని హ్యాపీగా ఉంటాం.‘రుద్రమదేవి’ కోసం నాన్న 70 కోట్ల డబ్బే కాదు... నాలుగేళ్ళ జీవితం ఇన్వెస్ట్ చేశారు. మా పెదనాన్నైతే ఈ సినిమా ప్రొడక్షన్ చూడడం కోసం వైజాగ్ దగ్గర నుంచి వచ్చి, ఇక్కడే ఉండిపోయారు. ప్రతి సినిమాకుండే కష్టాలే ఈ సినిమాకూ వచ్చాయి. ఇంత పెద్ద సినిమాను పూర్తి చేసి, విజయవంతంగా రిలీజ్ చేయడమే మా ఫస్ట్ సక్సెస్. ఈ సినిమా ఆడియన్స్‌కు నచ్చడమే కాకుండా, డబ్బులు పెట్టినవాళ్ళకు లాభాలూ తెస్తుందనే నమ్మకం మాకుంది. దేవుడి దయ వల్ల మాకు ఉండడానికీ, తినడానికీ ఉంది. ‘రుద్రమదేవి’ లాంటి మరిన్ని మంచి సినిమాలు తీసే సత్తా మా నాన్నకుంది. అంతకన్నా ఇంకేం కావాలి!

 

వాట్ నెక్స్ట్‌అంటారు!

- యుక్తాముఖి (గుణశేఖర్ చిన్నమ్మాయి)


అక్కయ్య మా అమ్మకు బాగా దగ్గరైతే, నేను నాన్నకు చాలా క్లోజ్. నాన్నకీ, నాకూ ఫిజికల్‌గానే కాదు... చాలా విషయాల్లో పోలికలున్నాయి. మేమిద్దరం టెక్ శావీ!


నాన్నకూ, నాకూ గ్యాడ్జెట్ల పిచ్చి!

కొత్త కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏంటో, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడమంటే - మా ఇద్దరికీ చాలా ఇష్టం. ‘మ్యాడ్ సైంటిస్ట్స్’ లాగా ఇద్దరం కలసి వాటి గురించి దాదాపు రిసెర్చ్ చేసినంత పని చేస్తాం. నాకు ‘యాపిల్’ కంపెనీ గ్యాడ్జెట్స్ అంటే పిచ్చి. ‘యాపిల్’ ప్రొడక్ట్స్ ఏవి వచ్చినా, అడగగానే నాన్న కొనిస్తారు. సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ సినిమాలు చూస్తున్నప్పుడు అవి ఎలా తీశారు, వాడిన టెక్నికేంటి, గ్రాఫిక్సెలా చేశారు లాంటి కబుర్లన్నీ నాన్న చెబుతుంటే, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.నాన్న తీసిన ‘రామాయణం’ నాకు చాలా ఇష్టం. గమ్మత్తేమిటంటే, ఇప్పటి దాకా నాన్న సినిమాలేవీ రిలీజ్‌కు ముందు మేమెప్పుడూ చూడలేదు. నాన్నా చూపించలేదు. ప్రివ్యూలు వేయడం, చూపించడం లాంటివి ఆయన ఎప్పుడూ చేయలేదు. అండర్ ప్రొడక్షన్‌లో ఉండగా ‘రుద్రమదేవి’ మాత్రం కొంత చూశాం.ఇంట్లో కామ్..! సెట్‌లో సీరియస్!

అసలు చిన్నప్పుడు స్కూల్‌లో నాన్-డీటైల్డ్ పాఠంగా చదువుకొన్న ‘రుద్రమదేవి’ కథంటే నాన్నకి చాలా ఇష్టం. మాకెప్పుడూ ఆమె జీవితాన్ని కథలు, కథలుగా చెబుతుంటారు. ఆమె కథను దేశమంతటికీ చెప్పాలని ఆయన డ్రీమ్. అందుకోసమే ఇన్నేళ్ళూ కష్టపడ్డారు. ‘రుద్రమదేవి’కి ప్రెజెంటర్‌గా అమ్మ అంతా దగ్గరుండి చూసుకొంది. అలా నాన్న, అమ్మ, అక్క - అంతా సెట్స్‌లోనే ఉంటారు కాబట్టి, నేనూ స్కూలయ్యాక సెట్స్‌కెళ్ళేదాన్ని. ఇంటి దగ్గర చాలా కామ్‌గా ఉండే, నాన్న గారు సెట్స్‌లో డిఫరెంట్‌గా అనిపిస్తారు. పని మీదే ఫోకస్డ్‌గా ఉండడం వల్ల, అది జరగనప్పుడు కోపమూ ఎక్కువే చూపిస్తారు.  

 

ఆయన పాలసీ అదే!

నాన్న సినిమాకు పేరొచ్చి, హిట్టయితే, మేమంతా హ్యాపీ. కంగ్రాచ్యులేట్ చేస్తుంటాం. ఒకవేళ ఎప్పుడైనా చిన్న తేడా వచ్చినా, ఆయన దాని గురించే ఆలోచిస్తూ కూర్చోరు. ‘డోంట్ పుట్ యువర్ ఫోకస్ ఆన్ ది ఫెయిల్యూర్. నెక్స్ట్ ఏం చేయాలన్న దాని మీద ఫోకస్ పెట్టాలి. దేవుడు మనకిచ్చిన దాని గురించి సంతోషపడాలి’ అని నాన్న గారు చెబుతుంటారు. ఆయన ఫాలో అయ్యే పాలసీ అదే!

 ప్రతి డిసెంబర్ 31వ తేదీ రాత్రి మా ఫ్యామిలీ మొత్తం ఇంట్లో డిన్నర్ చేసి, లాంగ్ డ్రైవ్‌కి వెళతాం. న్యూ ఇయర్‌కి సంతోషంగా వెల్‌కమ్ చెబుతాం. పిల్లల మీద ఎలాంటి రిస్ట్రిక్షన్లూ పెట్టకుండా, తగినంత ఫ్రీడమ్ ఇచ్చి, ఫ్రెండ్ లాగా ఉంటారు కాబట్టే ఐ లవ్ మై డాడ్ సోమచ్!

 

కొన్నిసార్లు వాళ్ళే నా ఫాదర్!

- దర్శకుడు గుణశేఖర్


అమ్మానాన్నకు ఎనిమిదిమంది పిల్లల్లో నేను ఏడోవాణ్ణి. నాకు మాత్రం ఇద్దరే పిల్లలు. మా అమ్మాయిలిద్దరి భావాలు, వాడే గ్యాడ్జెట్లు మోడరన్. అదే సమయంలో మన సంస్కృతిని మర్చిపోరు. వాళ్ళ అమ్మతో కలసి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇప్పటికీ మా ఆవిడనీ, నన్నూ ‘అమ్మా, నాన్నా’ అనే పిలుస్తారు. ఎంత ఎదిగినా, మూలాల్ని మర్చిపోని మా పిల్లల్ని చూసి, అందుకే గర్విస్తుంటా.మా పిల్లలు, మేము అంతా హోమ్ బర్డ్స్. దేశదేశాల టూర్‌కు వెళ్ళినా నాలుగు రోజులు కాగానే, మా చిన్నమ్మాయి ఇంటికి వెళదామంటుంది. మా పెద్దమ్మాయైతే, మాకు దూరంగా ఉండడం ఇష్టం లేక డిగ్రీ చదువుకు లండన్‌కు వెళ్ళలేదు. అంత బలమైన కుటుంబబంధం మాది!

పిల్లలకు మార్కులే జీవితం కాదు. మార్కుల కన్నా వాళ్ళ ఐ.క్యూ. ఎలా ఉందనేది ముఖ్యం. నేను అదే చూస్తా. మా పిల్లలిద్దరూ మంచి విమర్శకులు. అలా మా ఇంట్లోనే ఇద్దరు క్వాలిటీ కంట్రోలర్లున్నారు. (నవ్వు...)మా ఆవిడ, పిల్లలే నా బలం. నైతికంగా వాళ్ళ అండ లేనిదే ‘రుద్రమదేవి’ ప్రాజెక్ట్‌ను కలలోనైనా ఊహించలేను. మా పెద్దమ్మాయి నీలిమకి అవగాహన చేసుకొనే వయసు, అభిరుచి ఉన్నాయి. అందుకే, ఈ ప్రాజెక్ట్ ఆలోచనల్ని ఎప్పటికప్పుడు తనతో పంచుకొనేవాణ్ణి.మేమంతా ఏదో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నట్లు ఉండం. అందుకే, ఒక్కోసారి నా పిల్లలే నాకు తండ్రి కూడా అవుతుంటారు. ఈ ‘రుద్రమదేవి’ జర్నీలో నేనెప్పుడైనా కొద్దిగా డల్ అయితే, ‘చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన ఫిల్మ్ తీస్తున్నాం’ అని ఉత్సాహపరిచేవారు. ఏ తండ్రికైనా, క్రియేటర్‌కైనా ఇంట్లో అంతటి సపోర్ట్ ఉంటే, అంతకు మించి ఇంకేం కావాలి! మా ఇద్దరమ్మాయిలతో పాటు నన్ను కూడా అమ్మ లాగా చూసుకొనే రాగిణి నా శ్రీమతి కావడం అదృష్టం! పిల్లల పెంపకంలో నేను 50 శాతమే ఫాదర్‌ని. మిగిలిన 50 శాతం వాళ్ళకు నాన్న మా ఆవిడే!

 

ఆయన నేర్పిన సూత్రం అదే!

- శ్రీమతి రాగిణీ గుణ (గుణశేఖర్ భార్య)

పిల్లలకు తల్లితండ్రులే రోల్‌మోడల్స్! వాళ్ళు మనల్నీ, మన అలవాట్లు, ప్రవర్తననే చూసి పెరుగుతారు. పిల్లల్ని పెంచడమంటే వాళ్ళకు కావాల్సినవి సమకూర్చడమే కాదు. మంచీ చెడు వివరంగా చెప్పడం, వాళ్ళతో గడపడం! ఆ విషయంలో తండ్రిగా ఆయన (గుణశేఖర్)కు పదికి పది మార్కులు వేస్తా. డిసిప్లిన్ నేర్పుతూనే, పిల్లలతో ఫ్రెండ్‌లా కలిసిపోతారు. ఫలానా డిగ్రీ చదవండి, ఫలానా ఉద్యోగం చేయండి అంటూ పిల్లలపై ఒత్తిడి పెట్టడం ఆయనకు కానీ, నాకు కానీ అస్సలు ఇష్టం ఉండదు. ‘మనసుకు నచ్చింది చదవండి, నచ్చిన పని చేయండి. అది టీచర్ ఉద్యోగం కావచ్చు, ఇంటి నిర్వహణ చూసుకొనే గృహిణి కావచ్చు... ఏది చేసినా దానిలో హండ్రెడ్ పర్సెంట్ పెడితే, మానసిక సంతృప్తి, దానితో పాటు విజయం వస్తాయి’ అని చెబుతుంటాం. పిల్లలకు ఆయన నేర్పిన విజయసూత్రం అదే!

- రెంటాల జయదేవ

ఫొటోలు: శివ మల్లాల

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top