నన్ను వెళ్లనివ్వండి

Brothers Relationship Story - Sakshi

చెట్టు నీడ

ఆ అన్నదమ్ములిద్దరి ఉమ్మడి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయల్లా వర్ధిల్లుతోంది. వ్యాపారంలో వచ్చే లాభాలను పంచుకుని సంతోషంగా ఉండేవారు. ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమాభిమానాలతో ముందుకు సాగేవారు. ఉన్నట్టుండి వ్యాపారం కుంటుపడింది. అప్పటిదాకా లాభాలబాట పట్టిన వ్యాపారం నష్టాల కూపంలోకి వెళ్లిపోయింది. ఇద్దరినీ ఆర్థిక ఇబ్బందులు కుంగదీశాయి, చిరాకు, నిరాశ, ఒత్తిడి పెరిగాయి. అప్పులు, నష్టాలు వారిద్దరి మధ్య దూరాలు పెంచాయి. నష్టాలను పంచుకొనే క్రమంలో అపార్థాలు పెరిగాయి. భాగస్వామ్యాన్ని తెగదెంపులు చేసుకున్నారు. ఇద్దరి బంగళాలు పక్కపక్కనే ఉన్నా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శతృత్వం పెరిగింది. వ్యాపారంలో అ ఆ లు నేర్పిన తననే మోసం చేస్తాడా అని ఇద్దరి ఇళ్ల మధ్య ఎలాంటి రాకపోకలు ఉండకూడదనే ఉద్దేశంతో రగిలిపోతూ హుటాహుటిన పెద్ద క్రేన్‌ తో కాలువను తవ్వించి అందులో నీటిని నింపాడు అన్న. దీన్ని గమనించిన తమ్ముడు కోపంతో రగిలిపోయాడు.

అన్న ఇంటిని చూడటానికి కూడా వీలులేదని భావించాడు. వెంటనే తన ఇంటి పక్కన తన అన్న ఇల్లు కనపడకుండా చెక్కతో గోడ నిర్మించాలని, రాత్రికి రాత్రే గోడ లేపాలని కార్పెంటర్‌కు పని పురమాయించాడు. రాత్రంతా ఆ వ్యక్తి కష్టపడి పని చేయనారంభించాడు. తెల్లారింది. తమ్ముడు నిద్రలేచి గోడను చూద్దామని కిటికీ దగ్గరకెళ్లి చూశాడు. అక్కడ గోడ జాడ లేదు. రాత్రంతా చెక్క గోడ నిర్మించే శబ్దం మాత్రం వినిపించింది కానీ ఇక్కడ ఎలాంటి గోడా లేదే అని ఆశ్చర్యపోయాడు. వెంటనే అసహనంతో ఊగిపోయాడు. ఇంటి బయటికొచ్చి చూస్తే కార్పెంటర్‌ తన సామానును సర్దుకుంటున్నాడు. గోడ కట్టలేదని కార్పెంటర్‌ ను తీవ్రంగా మందలిస్తుండగా.. అతను కనుసైగలతో అటు చూడమని చెప్పాడు. తలతిప్పి చూడగా అన్న తవ్విన కాలువపై చెక్క వంతెన వెలిసింది! ఆశ్చర్యంతో వంతెనపై అడుగులు వేశాడు. అంతలోనే అవతలివైపు అన్న. ఇద్దరిలో ప్రేమోద్వేగాలు ఉప్పొంగాయి. ఇద్దరూ ముందుకు కదిలారు. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కన్నీటి పొరలు తుడుచుకుంటుండగా కార్పెంటర్‌ వెళుతూ కనిపించాడు. వెంటనే హుటాహుటిన అతన్ని అడ్డుకుని ఇద్దరూ ‘‘నువ్వు మా దగ్గరే పనిచేయి’’ అని ప్రాధేయపడ్డారు. ‘‘ఇలాంటి వంతెనలు ఇంకా ఎన్నో కట్టాల్సి ఉంది.. నన్ను వెళ్లనివ్వండి’’ అని అక్కడి నుంచి నిష్ర్కమించాడు. మనం వంతెనలు కడుతున్నామో, అడ్డుగోడలను నిర్మిస్తున్నామో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. బంధాలను బలపర్చాలే కానీ విచ్ఛిన్నం చేయకూడదు.– ముహమ్మద్‌ ముజాహిద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top