క్వీన్‌ కారుణ్యం

 British Queen Will Stop Wearing Genuine Leather Clothing - Sakshi

క్వీన్‌ ఎలిజబెత్‌ 2 ఇకనుంచి ‘ఫర్‌’ దుస్తులు ధరించబోవడం లేదని బ్రిటన్‌ రాజప్రాసాదం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై జంతు హక్కుల పరిరక్షణ సంస్థ ‘పెటా’.. ‘రాణిగారి నిర్ణయానికి ఛీర్స్‌ చెబుతున్నాం’ అని ట్వీట్‌ చేసింది.

బ్రిటిష్‌ రాణి.. క్వీన్‌ ఎలిజబెత్‌ – 2.. ఫర్‌ని త్యజిస్తున్నారు! జంతువుల చర్మాన్ని వలిచి ఆ వెంట్రుకలతో చేసే ఫర్‌ దుస్తులను ధరించరాదనే నియమం పెట్టుకున్నారట క్వీన్‌. బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ అధికారి వెల్లడించిన తాజా సమాచారం ఇది.  క్వీన్‌ ఎలిజబెత్‌ డ్రెస్‌ మేకర్‌ ఏంజెలా కెల్లీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘‘రాణిగారు పాల్గొనే వేడుకల్లో ఆమె గొప్పదనానికి ప్రతీకగా గానీ, చలికాలంలో వెచ్చదనం కోసం కానీ ఆమె ఫర్‌ దుస్తులు ధరించి కనిపించినా సరే... అవి జంతువుల ఫర్‌తో చేసినవి కాబోవు. కృత్రిమ ఫర్‌తో చేసినవే అయి ఉంటాయి’’ అని కూడా చెప్పారు ఏంజెలా కెల్లీ. క్వీన్‌ ఎలిజబెత్‌ తీసుకున్న ఈ కరుణ పూరిత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పెటా ( పీపుల్‌ ఫర్‌ ద ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌) యాక్టివిస్టులు తమవంతుగా రాణికి మద్దతు ప్రకటించారు.

రాణిగారు తను ధరించే దుస్తుల విషయంలో అనేక నియమాలు పాటిస్తారు. అయితే వస్త్రధారణ విషయంలో ఏనాడూ సంప్రదాయం తప్పని రాణిగారు.. జీవితంలో ఒకే  ఒకసారి మాత్రం ప్యాంట్‌ ధరించారు. అది కూడా విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు! 1970లో రాణిగారు కెనడా టూర్‌ వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలియగానే ఒక ఔత్సాహిక కుర్ర టైలరు రాణిగారి కోసమని మ్యాటీ–సిల్క్‌ ట్రౌజర్‌ సూట్‌ని ప్రత్యేకంగా కుట్టి తెచ్చాడు. అదీగాక.. కెనడా వెళుతూ రాణిగారు ఈ మాత్రం మోడర్న్‌గా లేకుంటే ఎలా అని ఆస్థానంలోని వారందరినీ ఆ టైలర్‌ ఒప్పించాడు.

ముఖ్యంగా రాణిగారిని మెప్పించాడు. అతడి ఆరాటాన్ని కాదనలేక రాణిగారు టూర్‌లో ఆ ప్యాంట్‌ వేసుకుని టూర్‌ నుంచి వచ్చీ రాగానే తీసి పక్కన పెట్టేశారు. మళ్లీ దానిని వేసుకోనే లేదు. ఆ సంగతలా ఉంచితే, రాణి గారు వేసుకునే దుస్తులకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఆ దుస్తులది కాదు. ఆ దుస్తులపైకి ఆమె పట్టుకునే గొడుగుది! ఏ రంగు డ్రెస్‌ వేసుకుంటే ఆ రంగు గొడుగును చేత పట్టుకుంటారు క్వీన్‌ ఎలిజబెత్‌. ఇక బయటికి వచ్చినప్పుడు ఆమె తన చేతికి తగిలించుకునే బ్యాగు కూడా ప్రత్యేకమైనదే.

‘లానర్‌’బ్రాండ్‌ బ్యాగు అది. ఒక్కో బ్యాగు వెల కనీసం వెయ్యి డాలర్ల నుంచి మొదలవుతుంది. రాణి గారి అంతస్తుతో పోలిస్తే 70 వేల రూపాయలు (వెయ్యి డాలర్లు) తక్కువే కానీ, అది ప్రారంభ ధర మాత్రమే. అలాంటి బ్యాగులు రాణిగారి చేతి పట్టున 200 వరకు ఉన్నాయి! ఈ బ్యాగులు, బూట్లు, షూజ్, వాచీలను అలా ఉంచితే.. రాణి గారు వేసుకునే దుస్తుల్లో తొంభై శాతం లేత నీలం, లేదా ముదురు నీలం రంగుల్లో ఉండేవే. నీలం తర్వాత లేత ఆకుపచ్చ, ఆ తర్వాత ఎరువు రంగులను క్వీన్‌ ఎలిజబెత్‌ ఇష్టపడతారట. రంగు ఏదైనా ఇక ముందు రాణిగారు ధరించే దుస్తులు ఫర్‌తో చేసినవి మాత్రం అయి ఉండవు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు 

Read also in:
Back to Top