ఓ స్త్రీ కథ

Bollywood film industry is the largest in the country - Sakshi

శాంతి

ఇంట, బయట, ఆఫీసుల్లో, కార్ఖానాల్లో..గుడిలో, బడిలో, మడిలో..అంతటా ఆమే.అవని అంతా ఆమే.ఆమె లేనిది ఏమీ లేదు.ఆమె ఉన్న చోట లేనిదంటూ ఏదీ లేదు. ఈ ఆలోచన దూరదర్శన్‌ ఛానెల్‌ని 90ల కాలంలో అమాంతం ఆకాశమంత ఎత్తు పెంచేసింది. ఏక్‌ ఔరత్‌ కి కహాని అంటూ చిన్నతెర ఓ స్త్రీ కథను చెప్పడం మొదలుపెట్టింది.అది ‘శాంతి’గా అందరి మదిని తట్టి లేపింది.

ఇలా మొదలు...
దేశంలో అతి పెద్దదైన బాలీవుడ్‌ సినిమా నిర్మాణ సంస్థకు చెందిన ఇద్దరు స్నేహితులతో ‘శాంతి’ కథ ప్రారంభమవుతుంది. ఈ ఇద్దరు స్నేహితుల పేర్లు కామేష్‌ మహదేవన్, రాజేష్‌ సింగ్‌. ఒకరు రచయిత, ఇంకొకరు దర్శకనిర్మాత. ఈ ఇద్దరూ అత్యంత విలాసవంతమైన శాంతి మాన్షన్‌లో నివసిస్తుంటారు. 

శాంతి ఓ జర్నలిస్ట్‌
ప్రతీ ఒక్కరి వెనకాల ఓ గతం ఉంటుంది. ఆ గతాన్ని తెలుసుకొని, ఆ రహస్యాలను తన రచనల ద్వారా బయట ప్రపంచానికి తెలియజేస్తుంటుంది జర్నలిస్ట్‌ శాంతి. సంపన్నుల ఇళ్లలో పనిచేసే సర్వెంట్స్‌ సమస్యల మీద కామేష్, రాజ్‌లు ఓ సినిమా తీసి, మంచి పేరు సంపాదిస్తారు. సెలబ్రిటీలైన వీరిద్దరి బయోగ్రఫీలు రాయాలని అనుకుంటుంది శాంతి. ఓ రోజు కామేష్, రాజ్‌లను కలిసి మంచి సినిమా తీశారని అభినందిస్తుంది. ఈ క్రమంలో వీరిద్దరి కుటుంబాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయం కామేష్, రాజ్‌లకు తెలియదు. 

గత కాలపు నీడల జాడలు
కామేష్‌ పెద్ద కొడుకు రమేష్‌ బుద్ధిమాంద్యుడని, చిన్న కొడుకు సోమేష్‌ తన స్క్రిప్ట్‌ని చివరికి తండ్రి కూడా తిరస్కరించడంతో తీవ్ర మనోవేదనకు లోనై కుంగిపోయి ఉన్నాడని తెలుసుకుంటుంది. కామేష్‌ భార్య ఆయేషా గతంలో ఓ సినీ నిర్మాత కూతురు. ఆ నిర్మాత కెరీర్‌ను ఈ ఇద్దరు స్నేహితులు కలిసి నాశనం చేశారనే విషయం స్పష్టం అవుతుంది. తన దత్తత కూతురు నిధి భర్త కామేష్‌ అక్రమసంతామని చెబుతుంది ఆయేషా. కామేష్‌ కుటుంబం తర్వాత రాజ్‌ సింగ్‌ కుటుంబ సభ్యులను కలుసుకుంటుంది. రాజ్‌సింగ్‌ భార్య మనశ్శాంతి కోసం సాధువులను కలుసుకోవడానికి తరచూ ఆశ్రమాలను సందర్శిస్తూ ఉంటుంది. ఆమెను కలుసుకున్న శాంతికి ఎన్నో నిగూఢమైన విషయాలు తెలుస్తాయి. తన కొడుకు నిహాల్, అమెరికన్‌ ఫ్రెండ్‌ మైఖేల్‌కి తనకు పుట్టిన సంతానం అని శాంతి ముందు బయట పెడుతుంది రాజ్‌సింగ్‌ భార్య.

కూతురు మాయ తల్లి దూరం అవడంతో డిప్రెషన్‌ బారిన పడుతుంది. స్త్రీలోలుడు అయిన పెద్ద కొడుకు రోహణ్‌ మోడల్‌ సశ ను పెళ్లి చేసుకోమని వేధిస్తూ ఉంటాడు. అత్యంత విలాసవంతమైన శాంతి మాన్షన్‌లో ఉన్న వీరందరి గత జీవితాలను తెలుసుకునే క్రమంలో తన పుట్టుకకు కారణం ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోతుంది శాంతి. ఒకప్పుడు శాంతి మాన్షన్‌ నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేసేది శాంతి తల్లి. ఆ మాన్షన్‌లోనే ఈ సినీ నిర్మాత, రచయిత కామేష్, రాజ్‌లు ఆమెపై లైంగిక దాడి చేస్తారు. గర్భవతి అయిన ఆమె ఒంటరిగా కూతుర్ని కని, పెంచి పెద్ద చేస్తుంది. పురుషాధిక్య సమాజంలో ఒంటరిగా ఒక తల్లి ఏ విధంగా జీవించిందో ఆమె పాత్ర స్పష్టం చేస్తుంది. సామాజిక, రాజMీ య శక్తులుగా ఎదిగిన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె తన కూతురు పెంపకంలో స్ఫూర్తిగా నిలుస్తుంది.

స్త్రీ ఆధారిత సీరియల్స్‌కు చుక్కాని
పాతికేళ్ల క్రితం సామాజిక సమస్యలను కళ్లకు కట్టిన తొలి డెయిలీ సీరియల్‌ శాంతి. 780 ఎపిసోడ్స్‌తో సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమైన శాంతి ఆ తర్వాత వచ్చిన స్త్రీ ఆధారిత సీరియల్స్‌కి స్ఫూర్తిగా నిలిచింది. అక్కణ్ణుంచే స్త్రీని శక్తిమంతురాలిగా, ప్రధాన పాత్రధారిణిగా చూపించడం మొదలుపెట్టింది చిన్నతెర. అలా ఆ తర్వాత వరసగా దూరదర్శన్‌లో వచ్చిన సీరియల్స్‌లో ‘రజని’ ఒకటి. ఓ మధ్యతరగతి గృహిణి సమాజంలోని అసమానతలను తొలగించడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటం ఈ సీరియల్‌లో చూస్తాం. అటు తర్వాత ఐపీఎస్‌ ఆఫీసర్‌ పాత్రను కళ్లకు కట్టిన ‘ఉడాన్‌’ సీరియల్‌కి దర్శకత్వ ప్రతిభను అందించింది కవితా చౌదరి భట్టాచార్య.

ఈ సీరియల్‌లో లింగవివక్ష, మహిళా సాధికారిత.. వంటి పాయింట్స్‌ను బేసిక్‌గా తీసుకున్నారు. ఇది మొట్టమొదటి మహిళా ఓరియెంటెడ్‌ టీవీ షోగా దూరదర్శన్‌ హిస్టరీలో చేరింది. ఒక మహిళా పోలీస్‌ అధికారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉడాన్‌ సీరియల్‌ని తీశారు. మహిళ ఎదగడానికి ఎలాంటి అడ్డంకులు లేవని, వారి కలలకు, ఆకాంక్షలకు అకాశమే హద్దు అని ఓ మహిళ ఈ సీరియల్‌ని డైరెక్ట్‌ చేసి చూపించారు. ఆ తర్వాత నేవీ అధికారిణిని పరిచయం చేస్తూ వచ్చిన ‘ఆరోహణ్‌’ సీరియల్‌ కూడా అదే బాటలో నడిచింది. ‘ఔరత్‌’ సీరియల్‌ ద్వారా కుటుంబంలో మహిళకు విద్య, సాధికారతతోపాటు పెళ్లి చేసుకోవడానికి వరుడిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మహిళకు ఇచ్చి తీరాలని లాయర్‌ పాత్ర ద్వారా చూపించారు. ఇలా మహిళా అభ్యున్నతి కోసం పాటు పడే స్త్రీ ఆధారిత కథలు రావడం శాంతి సీరియల్‌ నుంచే మొదలయ్యాయి.
– ఎన్‌.ఆర్‌.

చాలామందికి ఆమె శాంతిగానే పరిచయం. మందిరాబేడి అనగానే శాంతి పేరు కూడా స్ఫురణకు వస్తుంది. ప్రేక్షకుల మదిలో అంతగా నిలిచిపోయేలా దర్శకుడు ఆది పోచా శాంతి పాత్రను మలచిన తీరు అమోఘం. 1994లో వచ్చిన శాంతి సీరియల్‌ ద్వారా మందిరాబేడి దేశంలోని ప్రతి కుటుంబంలో ఒక సభ్యురాలైంది. ఇండియన్‌ టెలివిజన్‌లో ఒక జర్నలిస్టు పాత్రను పరిచయం చేసిన మొట్టమొదటి సీరియల్‌ శాంతి. అప్పటికే అడ్వరై్టజింగ్‌ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నారు మందిరాబేడి. ఆ క్రమంలో దర్శకుడు ఆది పోచా దృష్టిలో పడ్డారు ఆమె. ట్రౌజర్, టీ షర్ట్‌–జీన్స్, సల్వార్, కమీజ్‌లతో మందిరాబేడికి ఆడిషన్‌ టెస్ట్‌ చేశారు.

ఓ ఇంటర్వ్యూలో మందిరాబేడి మాట్లాడుతూ – ‘శాంతి సీరియల్‌ తర్వాత నా వ్యక్తిత్వంలో చాలా మార్పులు వచ్చాయి. శాంతిలో ఏదో చిన్న పాత్ర ఇస్తారు అనుకున్నాను. కానీ, నేనే ‘శాంతి’ అన్నారు డైరెక్టర్‌. నమ్మలేకపోయా. నాకు ఈ ఫీల్డ్‌లో విధమైన బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. నటనలో ఎన్నో ఏళ్లు ఎంతో కష్టపడితే గాని ఇలాంటి పాత్రలు రావు. అలాంటిది శాంతి పాత్ర నన్ను వరించింది. శాంతి చాలా ౖస్రాంగ్‌ ఉమెన్‌. ఎన్నో సమస్యలను సాల్వ్‌ చేస్తుంది. శాంతి నన్ను శక్తిమంతురాలిని చేసింది’ అన్నారామె.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top