నెహ్రూ చూపిన భారత్‌

Bharat Ek Khoj TV Serial Special Story - Sakshi

భారత్‌ ఏక్‌ ఖోజ్‌

గ్రేట్‌ ఇండియన్‌  సీరియల్స్‌–22

చరిత్ర తెలియనివాడు వర్తమానాన్ని గ్రహించలేడు, భవిష్యత్‌ను దర్శించలేడు. భారతదేశం వేల ఏళ్లుగా ఘన వారసత్వాన్ని, సంస్కృతిని, నాగరకతల సంగమాన్ని, భిన్న జీవన గతులను కలిగి ఉంది. వీటిని అర్థం చేసుకోకపోతే ఈ దేశం, ఈ దేశ ప్రజలు, మన పొరుగువారు, వారి ఆలోచనలు ఏవీ అర్థం కావు. నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్‌ ఇండియా గ్రంథం ద్వారా దేశాన్ని ఎలా చూడాలో కళ్లకు కట్టారు. భారత్‌ ఏక్‌ ఖోజ్‌ సీరియల్‌ ఆ గ్రంథానికి ఉత్తమ దృశ్యరూపాన్ని ఇచ్చింది.

నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలంటే నీ కుటుంబ చరిత్రను తెలుసుకోవాలి. అర్థం చేసుకోవాలి. నిన్ను నువ్వు సరికొత్తగా నిర్మించుకోవాలంటే దేశ చరిత్రను సమగ్రంగా ఔపోసన పట్టాలి. ఐదు వేల ఏళ్ల భారతదేశ చరిత్రను తెలుసుకోవాలంటే మాత్రం ‘భారత్‌ ఏక్‌ ఖోజ్‌’ సీరియల్‌ను చూడాలి. 1988లో దూరదర్శన్‌లో ఏడాదిపాటు ప్రసారమైన ఈ సీరియల్‌ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంది. దేశ స్వాతంత్య్రం నాటి పరిస్థితుల నుంచి వెనక్కి వెళ్లి ఐదు వేల ఏళ్ల క్రితం నాటి ముచ్చట్లన్నీ మొత్తం 53 ఎపిసోడ్లలో ప్రతి భారతీయుడి కళ్లకు కట్టింది ఈ సీరియల్‌.

మన దేశంలో వివిధ కాలాలలో చారిత్రక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో వచ్చిన మార్పులు సామాన్యమైనవి కావు. నాగరికతవైపు పరుగులు తీసే క్రమంలో వచ్చే పెనుమార్పుల గురించి ఒక్కమాటలో చెప్పలేం. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని భిన్నసంస్కృతులు, భిన్న మతాలు, బహుళజాతి సంఘాలు, నాగరికతలో వచ్చిన ఎన్నో మార్పులు మన దేశంలో ఉన్నాయి. వాటన్నింటినీ ఈ సీరియల్‌లో వీక్షించారు నాటి ప్రేక్షకులు. కొన్నిసార్లు సాంకేతికపరమైన డాక్యుమెంటరీ, మరికొన్నిసార్లు పూర్తిడ్రామా.. ఈ ఎపిసోడ్స్‌లో ప్రేక్షకులను అబ్బురపరిచాయి. రామాయణ్, మహాభారత్‌ల తర్వాత మళ్లీ అంతటి ఖ్యాతిని తన ఖాతాలో వేసుకుంది భారత్‌ ఏక్‌ఖోజ్‌ సీరియల్‌తో దూరదర్శన్‌.

నెహ్రూ చెప్పిన కథ
‘భారత్‌ ఏక్‌ ఖోజ్‌ సీరియల్‌’ పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పుస్తకం ‘ది డిస్కవరీ ఆఫ ఇండియా’ ఆధారంగా రూపొందించబడింది. ఈ ఎపిసోడ్స్‌ను నటుడు రోషన్‌ సేత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పాత్ర పోషించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ కథ చెబుతున్నట్టుగా ఎపిసోడ్స్‌ రన్‌ అవుతుంటాయి. ఈ సీరియల్‌ దర్శక, నిర్మాత శ్యామ్‌ బెనగల్‌ చేసిన అద్భుతమైన ఆలోచనకు ప్రతిరూపం భారత్‌ ఏక్‌ఖోజ్‌. ప్రతి ఆదివారం ఉదయం 11గంటలకు ఏడాది పాటు ప్రసారమైంది. 1947 నుంచి ఐదువేల ఏళ్ల వెనక్కి ప్రయాణించి మన మూలాల్ని మనకు పరిచయం చేస్తుంది ఈ సీరియల్‌. దర్శకనిర్మాత శ్యామ్‌బెనగల్‌ ఈ సీరియల్‌ని తీర్చిదిద్దితే, దీనిలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు ఓమ్‌పురి. 

తరతరాలు కదిలి
ఈ సీరియల్‌ భారతీయ చరిత్రను అద్భుతంగా విశ్లేషించింది. భారతీయ సంస్కృతి, మూఢనమ్మకాలు, పురాణాలు, కావ్యాలు, నాటకాలు, సంగీతం, సినీ సాంకేతిక పరిజ్ఞానం.. ఇలా దశలవారీగా జరిగిన పురోగతిని పరిచయం చేసింది భారత్‌ ఏక్‌ ఖోజ్‌. మరో ఇరవై సంవత్సరాల తర్వాత కూడ సీరియల్‌ ప్రస్తావన వస్తే భారత్‌ ఏక్‌ ఖోజ్‌ సీరియల్‌ ద్వారా మొత్తం తరాలన్నీ కదిలివచ్చాయని, ఇది చారిత్రక దృక్పథాన్ని మెరుగుపరచడమే గాక, మన అద్భుతమైన గతం గురించి లోతైన అవగాహన కలిగి ఉండేలా ప్రేక్షకుడిని ప్రేరేపించిందని తెలుస్తుంది.

ఎలక్షన్‌ క్యాంపెయిన్‌
నెహ్రూ చదువు నిమిత్తం పాశ్చాత్యదేశాలకు వెళ్లడం, అక్కడి స్నేహపూరితమైన వాతావరణం ఈ సీరియల్‌లో చూస్తాం. అలాగే 1936–37లలో జరిగిన ఎలక్షన్‌ క్యాంపెయిన్‌కి ఈ సీరియల్‌లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నెహ్రూ భారతదేశం అంతటా విస్తృతంగా పర్యటించారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలలోనూ తన పర్యటన కొనసాగించారు. దీనిలో భాగంగా ఆయన ఒక గొప్ప ఆవిష్కరణకు పునాది వేసుకున్నారు. ఈ పర్యటన వల్ల ఆయనకు దేశంపై ప్రేమ పెరగడం ప్రారంభించింది. 1944లో అహ్మద్‌నగర్‌ ఫోర్ట్‌ జైలులో ఉన్నప్పుడు ఏకాంతంగా కొన్ని నెలల పాటు కూర్చుని, భారతదేశపు సరికొత్త ఆవిష్కరణపై సొంత ప్రయాణాన్ని నమోదు చేసుకున్నారు నెహ్రూ. ఆ ఘట్టాన్ని ఇందులో చూడచ్చు.

శ్యామ్‌బెనగల్‌
ఇండియన్‌ గ్రేట్‌ డైరెక్టర్, స్క్రీన్‌రైటర్‌ శ్యామ్‌ గురించి చెప్పాలంటే సినిమానే ఆయన, ఆయనే సినిమా. ఎన్నో అవార్డులు ఆయన సినిమాకు సాహో అన్నాయి. ‘కులం–మతం ఈ రోజుల్లోనూ ఉన్నాయి. అయితే ఇవి భారతీయులుగా ఉండకుండా నిరోధించలేవు. ఈ సీరియల్‌ ద్వారా వాటివల్ల వచ్చే కారణాలను మాత్రమే విశ్లేషించాం’ అని తెలిపారు. 1986లో ఈ సీరియల్‌ స్క్రిప్ట్‌ మొత్తం సిద్ధం చేసుకున్నాం. 1988లో నవంబర్‌ 14న నెహ్రూ పుట్టిన రోజున ఫస్ట్‌ ఎపిసోడ్‌ ప్రసారమవ్వాలన్నది ప్లాన్‌. ఎపిసోడ్‌ నిడివి ఒకటి 60 నిమిషాలు వస్తే మరికొన్ని 80, 90 నిమిషాలు కూడా వచ్చాయి. కానీ మాకున్న సమయం అరగంట మాత్రమే. అందుకే చాలా కుదించాల్సి వచ్చింది’ అని తెలిపారు ఈ సీరియల్‌ గురించిన ఓ ప్రస్తావనలో శ్యామ్‌బెనగల్‌.

రోషన్‌ సేత్‌
ఇండియన్‌ యాక్టర్‌. భారత్‌ ఏక్‌ ఖోజ్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ పాత్ర పోషించారు. తనే కథ చెబుతున్నట్టు చరిత్రలోకి సేత్‌తో కలిసి మనమూ ప్రయాణిస్తాం. ఈ షోని ఆసక్తికరంగా మన అటెన్షన్‌ను తనవైపు తిప్పుకునేలా చేయడంలో కృతకృత్యమయ్యాయి రోషన్‌సేత్‌ ఆహార్యం, మాటలు.

ఓమ్‌పురి
ఇండియన్‌ యాక్టర్‌గా దేశమంతటా ఓమ్‌ సుపరిచితమే. అమెరికా, బ్రిటన్, పాకిస్థాన్‌లో తన నటనా పటిమను ప్రదర్శించారు ఓమ్‌పురి. పద్మశ్రీ అవార్డు గ్రహీత. వెండితెర, బుల్లితెర మీద ఓ వెలుగు వెలిగిన నటుడు.

ఈ సీరియల్‌లో..
భారత్‌మాతాకి జై, ది బిగినింగ్స్, ది వేదిక్‌ పీపుల్‌ అండ్‌ ది రిగ్వేద, క్యాస్ట్‌ ఫార్మేషన్, మహాభారత్, రామాయణ, రిపబ్లిక్స్‌ అండ్‌ కింగ్‌డమ్స్, చాణక్య అండ్‌ చంద్రగుప్త, అశోక, కాళిదాస, అక్బర్, ఔరంగజేబు, టిప్పుసుల్తాన్, 1857 నాటి పరిస్థితులు, మహాత్మా ఫూలే, వివేకానంద, గాంధీ, దేశవిభజన, డూ ఆర్‌ డై... వంటి 53 ఎపిసోడ్లలో నాటి చారిత్రక ఘట్టాలను బుల్లితెరపై వీక్షించి పరవశులయ్యారు ప్రేక్షకులు.– ఎన్‌.ఆర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top