
గుండెజబ్బులు వచ్చిన వారు తరువాతి కాలంలో గుండె పనిచేయకపోవడం వల్ల మరణించే అవకాశాలను గణనీయంగా తగ్గించేందుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది. ఇదేంటో తెలుసుకోవాలంటే ముందుగా గుండెపోటు తరువాత శరీరంలో జరిగే పరిణామాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గుండెపోటు వచ్చిన తరువాత రక్తనాళాలు పూడుకుపోయిన చోట గుండె కణజాలం దెబ్బతింటుంది. ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు గుండె తన ఆకారాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది కాస్తా చాలా సందర్భాల్లో గుండెలోని ఒక వాల్వ్ పనిచేయకుండా పోయేందుకు కారణమవుతుంది.
ఈ సమస్యలను అధిగమించేందుకు ఎంఐటీ, హార్వర్డ్, రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (ఐర్లాండ్), కొన్ని ఇతర సంస్థలు కలిసి థెరిపీ పేరుతో ఓ పరికరాన్ని అభివృద్ధి చేశాయి. శస్త్రచికిత్స ద్వారా దీన్ని గుండెపైభాగంలో అతికిస్తే.. ఆ తరువాత దాని ద్వారా మందులను నేరుగా కణజాలం దెబ్బతిన్న ప్రాంతానికి అందివ్వవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఎల్లెన్ రోష్ తెలిపారు. పోటు కారణంగా గుండె దెబ్బతిన్నప్పటికీ ఈ పరికరం ద్వారా పరిస్థితి మరింత చేజారకుండా చూడవచ్చునని చెప్పారు. ఈ పని కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతుల వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని.. థెరపీ ద్వారా వీటిని అధిగమించవచ్చునని వివరించారు.