మేలైన కాంతి

Before bathing you should write coconut oil or sesame oil - Sakshi

చలికాలంలో చర్మం పొడిబారి, కళ తప్పి కనిపిస్తుంది. మృతకణాలు పెరుగుతాయి కాబట్టి వీటిని సరిగా శుభ్రం చేయకపోతే రంగు కాస్త తగ్గినట్టు కనిపిస్తారు. ఈ సమస్యకు పరిష్కారంగా..ఉదయం స్నానం చేయడానికి ముందు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె మేనికి రాసుకోవాలి. మృదువుగా మర్దనా చేసి అరగంటసేపు ఆగాలి. తర్వాత మరీ వేడిగా అలాగని చల్లగా కాకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. స్నానానికి సబ్బు ఉపయోగించేవారు క్రీమీగా ఉండేవాటిని చలికాలానికి ప్రత్యేకం అనేవాటిని ఎంచుకోవాలి. లేదంటే సొంతంగా తయారుచేసుకున్న సున్నిపిండిని వాడాలి.బాదంపప్పుల నూనె, అవిసెగింజల నూనె వంటివి మేనిపైకే కాదు లోపల కూడా కావాలి. అందుకని శరీరానికి మేలు చేసే బాదంపప్పులు, అవిసెగింజలు.. రోజూ కొన్ని తినాలి.ఈ కాలం ఉసిరికాయలు లభిస్తాయి. వీటిలో విటమిన్‌–సి సమృద్ధిగా లభిస్తుంది.

ఏదో విధంగా రోజూ ఒక ఉసిరికాయ అయినా తినాలి. పొడిరూపంలోనూ ఉసిరిని తయారుచేసి, నిల్వచేసుకొని, కషాయం చేసుకొని సేవించవచ్చు. దీనివల్ల చర్మంలోపలి మలినాలు కూడా శుద్ధమవుతాయి.పెదవులపై చర్మం పొడిబారడం, పగుళ్లు బారి నలుపుగా అవడం వంటివి ఈ కాలంలో సహజంగా జరుగుతుంటాయి. రాత్రి పడుకునేముందు నెయ్యిని పెదవులపై రాసి, మృదువుగా మర్దన చేయాలి. పగలు కూడా రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పొడిబారం సమస్య రాదు.చలికి చాలా మంది మంచినీళ్లు తాగడం బాగా తగ్గిస్తారు. దీని వల్ల కూడా చర్మం పొడిబారడం, ముడతలు పడటం జరుగుతుంటుంది. రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగేలా శ్రద్ధ పెట్టాలి. ఈ జాగ్రత్తలు చర్మకాంతినే కాదు ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయి.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top