ఆరోగ్య వర్ధిని | Basil plants in Japan house | Sakshi
Sakshi News home page

ఆరోగ్య వర్ధిని

Jan 16 2018 11:03 PM | Updated on Jan 16 2018 11:03 PM

Basil plants in Japan house - Sakshi

ఈ మధ్య జపాన్‌లోని ప్రతి ఇంటిలోనూ తులసిమొక్కలు పెంచుతున్నారట. ఎందుకంటే జపనీయులు తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతున్నారు. ఇంతకీ ఏమిటా ప్రాధాన్యత అంటారా? అదేంటో చూద్దాం... తులసి లక్ష్మీ స్వరూపం. తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. 

మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.

సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్‌–డై–ఆక్సయిడ్‌ పీల్చుకుని, ఆక్సిజ న్‌ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్‌–డై–ఆక్సైడ్‌ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటలపాటు ఆక్సిజ న్‌ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని  పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు. తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. 

తులసికున్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి. తులసిలో ఉన్న ఔషధగుణాల వల్ల గొంతులోని కఫం కరిగిపోతుంది.

తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది. ఎందుకంటే, తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోధక శక్తి పెరిగిందట.

ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు. తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్‌ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్‌ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు.

అంతకంతకూ పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.

నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్‌ వ్యాప్తిని తగ్గిస్తాయని ఈ మధ్యే ధృవీకరించారు.

మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్మ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement