లూపస్‌ / ఎస్‌ఎల్‌ఈ కంచె చేను మేస్తే

Auto immune disease lupus - Sakshi

లూపస్‌ (ఎస్‌ఎల్‌ఈ) అనేది దీర్ఘకాలం వేధించే ముఖ్యమైన ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. సాధారణంగా మన శరీరంలోని రోగ నిరోధక కణాలు మన అవయవాలను కాపాడుతుంటాయి. అయితే ‘కంచే చేను మేసినట్లు’గా, ఈ వ్యాధి ఉన్నవారిలో రోగనిరోధక కణాలు సొంత అవయవాల మీద దాడి చేస్తాయి. దాంతో శరీరంలోని అనేక భాగాలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీని పట్ల సరైన అవగాహన లేకపోవడంతో తొలిదశలోనే గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. దాంతో వ్యాధి ముదిరి ప్రాణాంతకం అవుతోంది.

ఎందుకు, ఎలా వస్తుంది...
జన్యులోపాల వల్ల ఈ వ్యాధి రావచ్చు.
కొన్ని విటమిన్‌ లోపాల వల్ల రావచ్చు
అంటువ్యాధుల వల్ల
కొన్ని రకాలైన మందుల వల్ల (అయితే మందులు ఆపేసిన కొంత కాలానికి జబ్బు లక్షణాలు తగ్గుతాయి).

ఎవరిలో వస్తుంది...
లూపస్‌ ఏ వయసువారికైనా వస్తుంది. పురుషులతో పోలిస్తే, మహిళల్లో ఇది ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా 25 – 45 ఏళ్ల మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలు, పురుషులు ఈ వ్యాధి బారిన పడ్డప్పుడు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గర్భిణుల్లో ఈ వ్యాధిని వెంటనే గుర్తించకపోతే గర్భస్రావాలు జరుగుతాయి.

ప్రారంభ దశలోనే గుర్తించకపోతే... మూల్యం చెల్లించక తప్పదు...
తొలిదశలోనే లూపస్‌ను గుర్తించడం కష్టమైన పని.  ఈ దశలో గుర్తించకపోతే జబ్బు ముదిరి ప్రాణాంతకంగా మారుతుంది. తొలి దశలోనే గుర్తిస్తే దీన్ని చాలా త్వరగా, సమర్థంగా నియంత్రించవచ్చు. అంతేకాదు, తొలిదశలోనే ఉన్నప్పుడు ఈ వ్యాధి మందులకు తేలిగ్గా లొంగుతుంది. అందుకే ప్రతి ఒక్కరిలో అప్రమత్తత అవసరం.

వ్యాధి లక్షణాలు : వ్యాధి లక్షణాలు నిర్దిష్టంగా ఉండవు. అలాగే అందరిలోనూ ఒకేలా ఉండవు. ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, విపరీతమైన అలసట, ఒళ్లునొప్పులు, జ్వరం ఈ వ్యాధిలో కనిపిస్తాయి
ఈ వ్యాధితో బాధపడేవారు సూర్యకాంతికి సున్నితంగా ఉంటారు. ఎండలోకి వెళ్లినప్పుడు బుగ్గల మీద ఎర్రటి మచ్చలు (బటర్‌ ఫ్లై రాష్‌) రావడం, ఒళ్లంతా మంట, దురద రావడం జరుగుతుంది.
కీళ్లనొప్పులు, వాపులు వస్తాయి
తరచూ నోటిలో పూత వస్తుంది
అధికంగా జుట్టురాలడం, చల్లటి వాతావరణంలో వేళ్లు రంగులు మారడం వంటివి కూడా జరుగుతాయి.
జబ్బు తీవ్రత పెరుగుతున్న కొద్దీ రక్తహీనత రావడం; తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌ తగ్గడం
ఎముకలు బలహీనమై తేలిగ్గా విరిగిపోవడం జరుగుతాయి.
వ్యాధి నిర్ధారణ జరిగిన రెండు లేదా మూడేళ్లలో మూత్రపిండాలపై దీని ప్రభావం పడుతుంది. ఒళ్లంతా వాపు రావడం, బీపీ పెరగడం, మూత్రంలో ప్రోటీన్‌ ఎక్కువగా పోవడం జరుగుతాయి.
ఈ జబ్బు వల్ల ఊపిరితిత్తులు ప్రభావితం అయినప్పుడు దగ్గు, ఆయాసం,  ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం లాంటివి జరుగుతాయి.
గుండెపై ప్రభావం వల్ల ఛాతీనొప్పి, గుండె చుట్టూ నీరు చేరి గుండెను నొక్కేయడం, చిన్నవయసులోనే గుండెపోటు రావడం జరుగుతాయి.
నాడీవ్యవస్థ ప్రభావితం అయినప్పుడు విపరీతమైన తలనొప్పి, వాంతులు, చూపుపోవడం, ఫిట్స్‌ రావడం, జ్ఞాపకశక్తి తగ్గడం, యుక్తవయసులో పక్షవాతం రావడం, మెదడులో రక్తపు గడ్డలు ఏర్పడటం వంటివి జరుగుతాయి.
దీని ప్రభావం కాలేయం, ప్లీహం (స్పీ›్లన్‌) పై కూడా ఉంటుంది.
దీర్ఘకాలికంగా మానని పుండ్లు, నొప్పితో కూడిన ఎర్రని మచ్చలు, రక్తనాళాలు మూసుకుపోవడం వంటివి రక్తనాళాలపై లూపస్‌ ప్రభావం పడినప్పుడు జరుగుతాయి.
ఈ జబ్బుతో బాధపడే వారిలో క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

గర్భిణుల్లో లూపస్‌...
లూపస్‌ వల్ల గర్భిణుల్లో జరిగే హాని ఎక్కువ. గర్భస్రావాలు కావచ్చు. నెలలు నిండకముందే ప్రసవం, తక్కువ బరువున్న శిశువు జన్మించడం, గర్భవతిగా ఉన్నప్పుడు బీపీ చాలా ఎక్కువగా పెరిగి, ఫిట్స్‌ రావడం వంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. గర్భం దాల్చి ఉన్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రుమటాలజిస్టులతో వివరంగా సంప్రదించాల్సి ఉంటుంది. అలాగే గర్భవతిగా ఉన్న సమయంలో మందులు ప్రభావం శిశువు మీద పడకుండా రుమటాలజిస్టులు సూచించిన మందులు వాడాలి.

లూపస్‌ నిర్ధారణ ఎలా?
లూపస్‌ను గుర్తించడం రుమటాలజిస్టులకు ఒక సవాల్‌ వంటిది. వీరు రోగిని క్షుణ్ణంగా పరీక్షించి, వ్యాధి నిర్ధారణ కోసం ఏఎన్‌ఏ వంటి కొన్ని రక్త పరీక్షలు చేస్తారు. జబ్బు తీవ్రతను తెలుసుకోడానికి యాంటీ డీఎస్‌డీఎన్‌ఏ వంటి మరికొన్ని రక్తపరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే లూపస్‌ ప్రభావం ఏ అవయవం మీద పడుతుందో కూడా తెలుసుకోడానికి, మరి కొన్ని పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంటుంది.

లూపస్‌ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
 రుమటాలజిస్టులను సంప్రదించి వ్యాధి తీవ్రతను బట్టి, వారు సూచించిన మందులు వాడాలి.
 వైద్యులను సంప్రదించకుండా హఠాత్తుగా మందులు మానేయకూడదు. దీనివల్ల వ్యాధి తీవ్రత పెరిగి తీరని నష్టం జరుగుతుంది.
 ఈ రోగులు సూర్యకిరణాల పట్ల సున్నితంగా ఉంటారు.కాబట్టి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో సూర్యరశ్మి ఒంటికి తగలకుండా జాగ్రత్త పడాలి. సన్‌స్క్రీన్, గొడుగు కాటన్‌ దుస్తులు ఉపయోగించడం వల్ల చర్మంపై సూర్యకాంతి ప్రభావం తగ్గించవచ్చు.
 వీరు ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఎముకలు బలపడతాయి. దాంతో అవి అంత తేలిగ్గా విరగవు.
 ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, మంచి నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా వంటి ప్రక్రియలతో ఒత్తిడి తగ్గించుకోవడం వంటి మంచి జీవనశైలిని అలవరచుకోవాలి.

చికిత్స: వ్యాధిగ్రస్తులకు చికిత్స అనేది ఒకప్పుడు సవాలుగా ఉండేది. ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన అత్యాధునిక మార్పుల వల్ల ఈ జబ్బుకు చికిత్స లభ్యమవుతోంది.
 తొలిదశలో స్టెరాయిడ్స్‌ వాడాల్సి ఉంటుంది. కానీ చాలామందికి ఈ మందులపై అవగాహన లేక, వాటివల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అపోహపడి మానేస్తారు. నిజానికి ఈ మందులే ఇలాంటి ఆటోఇమ్యూన్‌ వ్యాధిగ్రస్తుల ప్రాణాలను నిలబెడతాయి. రోగి బరువును, వయసును స్టెరాయిడ్‌ మోతాదును డాక్టర్లు నిర్ణయిస్తారు. వ్యాధి తగ్గుముఖం పట్టిన వెంటనే వైద్యులు మందులు మోతాదును తగ్గిస్తారు. అలాకాకుండా భయం వల్లగానీ. ఇతరుల సలహా వల్ల గానీ వాటిని మధ్యలోనే ఆపేస్తే, వ్యాధి తీవ్రరూపం దాల్చి ప్రాణాపాయ స్థితికి చేరుకోవచ్చు.

ఈ కథనంలో పేర్కొన్న లక్షణాలను గమనించిన వెంటనే అనుభవజ్ఞులైన రుమటాలజిస్టులను కలిసి, చికిత్స విధానాల గురించి చర్చించి, వారి సలహా మేరకు మందులు తీసుకోవడం వల్ల సమస్యలను అధిగమించి ఆరోగ్యంగా జీవించవచ్చు.

ముఖ్యంగా జరగాల్సింది...
ఈ జబ్బు అన్ని అవయవాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి... కొన్ని లక్షణాలను గమనించిన వెంటనే, ఆ అవయవానికి  చికిత్స అందించడం మాత్రమే కాకుండా నిర్దిష్టంగా ఎస్‌ఎల్‌ఈని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది.

– డాక్టర్‌ విజయ ప్రసన్న పరిమి, సీనియర్‌ కన్సల్టెంట్‌ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్‌ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top