ఇద్దరు ముగ్గురయ్యారు

Article On Abburi Ramakrishna Rao In Sakshi Sahityam

సాహిత్య మరమరాలు  

అబ్బూరి రామకృష్ణారావు వాళ్ల నాన్న లక్ష్మీనారాయణ శాస్త్రి. సంస్కృత పండితుడు. తండ్రి లాగే తానూ గొప్పవాడినవ్వాలని ఆయన ఆశయం. మైసూరు సంస్కృత పాఠశాలలో చదవడానికి చేరాడు. అది 1915–16 కాలం. ఆ సమయంలో కట్టమంచి రామలింగారెడ్డి మైసూర్‌ స్టేట్‌ విద్యాధికారి. ఆ పాఠశాలలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. వాళ్లిద్దరూ కలిసి సాయంత్రాలు సాహిత్య కబుర్లు చెప్పుకునేవారు.ఒకరోజు కట్టమంచి, ‘ఏమోయ్‌ శర్మ, ఆంధ్రభారతి పత్రిక చూశావా? ఎవరో కవి ‘మల్లికాంబ’ అని చక్కటి కావ్యం రాస్తున్నాడు. మూడు విడతలుగా వచ్చింది’ అన్నాడు. ఈ ఆంధ్రభారతి– భారతి, ఆంధ్రపత్రిక కన్నా ముందు వచ్చిన పత్రిక.

‘నాకెందుకు తెలీదండి. ఆ రాస్తున్న కుర్రాడు మన దగ్గరే చదువుతున్నాడు, మీరు చూస్తానంటే పిలుస్తాను’ అన్నాడు అనంతకృష్ణ శర్మ. కట్టమంచి లాంటి కఠిన విమర్శకుడి, రాళ్లపల్లి లాంటి సంప్రదాయ పండితుడి మెప్పు పొందిన అబ్బూరికి అప్పుడు పదిహేను – పదహారు సంవత్సరాలే. ఇక తర్వాతి సాయంత్రాలు ముగ్గురు కలిసి మాట్లాడుకోవడం మొదలయింది.తర్వాతి కాలంలో– కట్టమంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ అయ్యాక అబ్బూరికి తగిన విద్యార్హత లేకపోయినా లైబ్రేరియన్‌ ఉద్యోగం ఇప్పించాడు. విశాఖపట్నంలో సాహిత్య వాతావరణం పెరగడానికి అది దోహదం చేసింది. అబ్బూరిని శ్రీశ్రీలాంటివాళ్లు  మేస్టారు అనేవారు. 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top