సౌర కుటుంబంలో ఇంకో బుల్లి గ్రహం..

Another small planet in the Solar System - Sakshi

సౌర కుటుంబం గురించి మనకంతా తెలుసు అనుకుంటున్నాం గానీ.. దీంట్లో ప్లూటోకు ఆవల ఇంకో బుల్లి గ్రహం ఉన్నట్లు తాజా అధ్యయనం చెబుతోంది. 2015టీజీ387 అని పిలుస్తున్న ఈ డ్వార్ఫ్‌ ప్లానెట్‌ (మరుగుజ్జు గ్రహం) వ్యాసం కేవలం 300 కిలోమీటర్లు మాత్రమే. అంటే మన జాబిల్లి కంటే పదిరెట్లు చిన్నదన్నమాట. అయితే ఈ బుల్లిగ్రహం సూర్యుడి చుట్టూ తిరిగేందుకు పట్టే సమయం మాత్రం ఏకంగా 40 వేల ఏళ్లు! సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో ఇది గరిష్టంగా 2300 అస్ట్రనామికల్‌ యూనిట్స్‌ దూరం (భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం ఒక అస్ట్రనామికల్‌ యూనిట్‌) వెళుతుందని దీన్ని గుర్తించిన శాస్త్రవేత్తల్లో ఒకరైన డేవిడ్‌ థోలెన్‌ తెలిపారు.

సౌరకుటుంబం అంచుల్లో ఇలాంటి మరుగుజ్జు గ్రహాలు ఇంకా బోలెడన్ని ఉండే అవకాశముందని, వాటి సైజు, తిరిగే దూరాలను పరిగణలోకి తీసుకుంటే చాలావాటిని గుర్తించడం దాదాపు అసాధ్యమని డేవిడ్‌ వివరించారు. మూడేళ్ల క్రితం ఈ మరుగుజ్జు గ్రహం దాదాపు 65 అస్ట్రనామికల్‌ యూనిట్స్‌ సమీపానికి రావడం వల్ల గుర్తించడం వీలైందని అంచనా. ఈ గ్రహ కక్ష్యను కంప్యూటర్ల ద్వారా కృత్రిమంగా సృష్టించినప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు చాలాకాలంగా అంచనా వేస్తున్న ప్లానెట్‌ ‘ఎక్స్‌’ ఇదే కావచ్చునన్న  అంచనా కలుగుతుందని డేవిడ్‌ వివరించారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top