మతి’పోతోంది

Alzheimers increasing - Sakshi

బిజీ జీవితం.. మానసిక ఆందోళన.. పని ఒత్తిళ్లు.. మతిమరుపునకు దారితీస్తున్నాయి. ఇంతకు ముందు 60 ఏళ్లు దాటిన వారిలో కనిపించే అల్జీమర్స్‌ (మతిమరుపు) ఇప్పుడు 30 ఏళ్ల వయస్సు వారిలో కూడా కనిపిస్తుండటం ఆందోళన పరుస్తోంది. మెదుడులోని కణాలు క్షీణించడం వలన జ్ఞాపక శక్తి తగ్గడంతో ప్రారంభమై.. తమ కుటుంబ సభ్యులను గుర్తించ లేక పోవడం, ఇంటి నుంచి బయటకు వెళితే తిరిగి ఇంటికి చేరుకోలేక పోవడం, మరింత ముదిరి శరీరంపై దుస్తులు కూడా వేసుకోలేక పోవడం వంటివి అల్జీమర్స్‌ వ్యాధి లక్షణాలు. తొలిదశలో గుర్తిస్తే వ్యాధి తీవ్రత పెరగకుండా చూడవచ్చునని  నిపుణులు చెబుతున్నారు.

అల్జీమర్‌ వ్యాధి సాధారణంగా 60 నుంచి 65 ఏళ్ల వయస్సు వారిలో బయట పడుతుంది. వ్యాధి సోకిన వారిలో 80 శాతం మంది అదే వయస్సు వారు కాగా, నవ్యాంధ్ర రాజధాని నగరాల్లో  20 శాతం మంది వయస్సు 50 ఏళ్లుపై బడిన వారు ఉంటున్నట్లు  గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధి సోకిన తర్వాత  నివారించడం సాధ్యపడని విషయం. అయితే మందుల ద్వారా వ్యాధి తీవ్రత పెరగకుండా చూడవచ్చునని వైద్యులు చెబుతున్నారు. మందులు, చికిత్స అందుబాటులోకి వచ్చినప్పటికీ వ్యాధి సోకిన వారిలో 10 శాతం మంది కూడా తొలిదశలో చికిత్స పొందడం లేదు. వ్యాధి తీవ్రత పెరిగి, మానసిక స్థితి సరిగ్గా లేని సమయంలో చికిత్స కోసం వైద్యులను ఆశ్రయిస్తున్నారు. అయితే అప్పుడు ఎన్ని మందులు వాడినా అంతగా ఫలితం ఉండట్లేదు.  

వ్యాధి నిర్ధారణ ఇలా.. 
వ్యాధి సోకిన తర్వాత వివిధ దశలో కనిపించే లక్షణాలను బట్టి గుర్తించవ్చు. ఎంఆర్‌ఐ స్కానింగ్, పెట్‌ స్కాన్‌ వంటి వాటి ద్వారా వ్యాధిని నిర్థారించవచ్చు. జ్ఞాపకశక్తి తగ్గడం ప్రధాన లక్షణంగా గుర్తించాలి. గంట కిందట జరిగిన ఘటనలను మర్చిపోవడం, చివరికి భోజనం చేయడం కూడా మర్చిపోతుండటం వంటి లక్షణాలను గుర్తించి వ్యాధిని నిర్ధారణ చేయోచ్చు. 

అల్జీమర్స్‌ లక్షణాలు 
మొదటి దశ: మైల్డ్‌ డిమెన్షియా దశలో జ్ఞాపక శక్తి చాలా స్వల్పంగా తగ్గుతుంది. వ్యక్తిగత శ్రద్ధ, సామాజిక అంశాలలో పెద్దగా మార్పు ఉండదు. అయితే చుట్టుపక్కల జరిగే సంఘటనల పట్ల ఎలాంటి ఆసక్తి ఉండదు. సహనం తగ్గిపోయి, తొందరగా కోపం రావడం, చేసే పనిపట్ల ఆసక్తి తగ్గడం జరుగుతుంది. ఈ దశలో వ్యాధిగ్రస్తునితో పాటు ఇతరులకు పెద్దగా ఇబ్బంది ఉండదు. 
రెండో దశ: దీనిని మోడరేట్‌  డిమెన్షియా అంటారు. ఈ దశలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అధికమవుతుంది. ఒక దశలో తాము ఎక్కడ ఉన్నది గుర్తించలేని స్థితి ఉంటుంది. ఉదయం.. సాయంత్రం అంటే ఏమిటో అర్థం కాకుండా ఉంటారు. దూరపు బంధువులనే కాకుండా దగ్గర బంధువులను గుర్తించలేని స్థితి ప్రారంభమవుతుంది. దుస్తులు వేసుకున్నదీ, లేనిదీ గమనించలేని స్థితిలో ఉంటారు. 
మూడోదశ: ఈ దశ చాలా ప్రమాదకరమైనది. వ్యక్తిగత శుభ్రత ఉండదు. తమపని తాము చేసుకోలేని స్థితి ఉంటుంది. ప్రతి పనికి ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఈ దశ«లో రకరకాల బ్రాంతులకు గురవుతారు. ఎవరో తనపై కుట్రపన్నుతున్నారని, తమ ఆస్తులు పూర్తిగా పోయి, కుటుంబ సభ్యులు వీధిన పడ్డారనే తరహా ఆలోచనలతో ఇబ్బందికి గురవుతారు. తనపేరు, ఊరు చెప్పలేని స్థితికి చేరుకుంటారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top