లాభసాటి సేద్యం యువతకు ఉపాధి | The objective of the BJP 'Meet the Press' in the incident revealed | Sakshi
Sakshi News home page

లాభసాటి సేద్యం యువతకు ఉపాధి

Apr 16 2014 12:51 AM | Updated on Mar 29 2019 9:24 PM

లాభసాటి సేద్యం  యువతకు ఉపాధి - Sakshi

లాభసాటి సేద్యం యువతకు ఉపాధి

‘నవ తెలంగాణలో రెండు సవాళ్లున్నాయి. ఒకటి.. వలసలు నిరోధించేలా యువతకు భారీగా ఉపాధికల్పన, రెండవది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం.

 తెలంగాణ బీజేపీ లక్ష్యం  ‘మీట్ ది ప్రెస్’లో కిషన్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్: ‘నవ తెలంగాణలో రెండు సవాళ్లున్నాయి. ఒకటి.. వలసలు నిరోధించేలా యువతకు భారీగా ఉపాధికల్పన, రెండవది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం. ఈ రెండూ నెరవేరాలంటే నరేంద్ర మోడీ ప్రధాని కావాల్సిందే. అలాగే రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ కూటమి విజయం సాధించాలి’ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల యూనియన్  నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు.
 
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మునుగుతున్న నావలాంటిదని, అందులో ఎక్కి నష్టపోయేందుకు ప్రజలు సిద్ధం కావద్దన్నారు. మోడీ హవాతో అది మరికొద్దిరోజుల్లో పూర్తిగా కుదేలవుతుందన్నారు. టీఆర్‌ఎస్ బలం ఎండమావిలాంటిదే అయినందున దాన్ని నమ్మొద్దని ఓటర్లకు సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించాలని, కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో అలాంటి ప్రగతి కావాలంటే బీజేపీకే అధికారం కట్టబెట్టాలని కోరారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉన్నందున, వచ్చే ఎన్నికల్లో 300కుపైగా సీట్లు సాధించి కేంద్రంలో నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ మొదటినుంచీ మోసపూరితంగానే వ్యవహరిస్తోందని విమర్శించారు. విడివిడిగా ఉన్న రెండు రాష్ట్రాలను కలసి ఆంధ్రప్రదేశ్‌గా చేసిన పాపం కాంగ్రెస్‌దేనని, ఇప్పుడు 60 ఏళ్ల తెలంగాణ కల సాకారంలో తాత్సారం చేసి వేయిమంది ఆత్మహత్యలకు కారణమైందన్నారు. ముందునుంచి తెలంగాణ ప్రగతిని కాంక్షిస్తున్న బీజేపీ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉండగా, ఆ క్రెడిట్‌ను సొంతం చేసుకునేందుకు ‘అవసరం’ కొద్దీ కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందన్నారు. బిల్లు పెట్టే సమయంలో బీజేపీ పూర్తి అనుకూలంగా ఉండగా, తమపై బురదజల్లే ఉద్దేశంతో బీజేపీ వెనకడుగు వేస్తోందని దుష్ర్పచారం చేసిందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం, అవినీతి కాంగ్రెస్‌ను ఓడించాలన్న లక్ష్యంతోనే  టీడీపీతో పొత్తుపెట్టుకున్నామని ఆయన చెప్పారు.

 ముఖ్యాంశాలు...

బీజేపీ అధికారంలోకి వస్తే... విస్తీర్ణంలో పెద్దగా ఉన్న జిల్లాలను రెండుగా మారుస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.
నదీజలాల సమస్యకు పరిష్కారంగా  వాజ్‌పేయి ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధానాన్ని కొనసాగిస్తాం.
మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిఏటా 13 లక్షల కుటుంబాలు వలసపోతున్నాయి.
వాటిని నిరోధించేందుకు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచే చర్యలు తీసుకుంటాం.
చేతి వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేలా ప్రణాళిక రూపొందిస్తాం.
గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు.
తెలంగాణను ఐదేళ్లలో కరెంటు కోతలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతాం.
ప్రతి మండలంలో సౌర విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.
రాజధాని నుండి ప్రతి జిల్లా కేంద్రానికి రెండు గంటల్లో చేరుకునేలా ఎక్స్‌ప్రెస్ రహదారులు.
హైదరాబాద్ సంస్థానం విలీనం నుంచి ఇటీవలి వరకు, తెలంగాణలో అసువులు బాసిన వీరుల త్యాగాలను ప్రతిబింబించేలా వరంగల్‌లో అద్భుత స్మారక కేంద్రాన్ని నిర్మిస్తాం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement