
ఆమే కీలకం
జిల్లాలో మొత్తం ఓటర్లు 24,89,228మంది.
అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్న మహిళలు...రాజకీయరంగంలో ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పుణ్యమాని సగం స్థానాలను దక్కించుకోగలుగుతున్నా, చట్టసభల విషయానికొస్తే 50 శాతం రిజర్వేషన్లు అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా మహిళలకు దక్కుతున్న రాజకీయ అవకాశాలు తక్కువే. 1952 నుంచి 2009 దాకా జరిగిన సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే కేవలం ఆరుగురు మహిళలు మాత్రమే రాష్ట్ర శాసనసభలో అడుగిడగలిగారు.
నల్లగొండ, న్యూస్‌లైన్ : జిల్లాలో మొత్తం ఓటర్లు 24,89,228మంది. అయితే పురుషులు, మహిళలకు మధ్య ఓటర్ల వ్యత్యాసం కేవలం 10,104 మాత్రమే. స్త్రీ, పురుష జనాభా నిష్పత్తిలో తేడా వల్ల మహిళా ఓటర్లు తక్కువగా ఉంటున్నారు. మహిళలు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్ష బలపడి సంఘటితంగా ఉద్యమించి పిడికిలి బిగిస్తే ఎన్నికల స్వరూపాన్ని పూర్తిగా మార్చగలిగే శక్తి వారికి ఉంది. 50శాతం కోటాను చట్టసభల్లో కూడా అమలు చేయాలని మహిళలు ఉద్యమిస్త్తే రాజకీయ పార్టీలు మెట్టు దిగిరాక తప్పదు.
తొమ్మిది చోట్ల...
జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. అత్యధికంగా నల్లగొండలో 16,224, మిర్యాలగూడలో 11,656 మంది ఓటర్లు పెరిగారు. ఆ తర్వాత స్థానంలో నాగార్జునసాగర్‌లో 10,896, కోదాడలో 9,563 మంది పెరిగారు. పురుషులకు మించి మహిళా ఓటర్లు అత్యధికంగా నాగార్జునసాగర్‌లో 329, మిర్యాలగూడలో 29 , హుజూర్‌నగర్‌లో 951, కోదాడలో 1831, సూర్యాపేటలో 1073 మంది ఉన్నారు. అయితే మహిళ ఓటర్లు గతంతో పోలిస్తే ఈ ఏడాది స్వల్పంగానే పెరిగారు.
స్థానికంలో సగం..
స్థానిక పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మహిళలకు కేటాయించారు. రాజకీయాల్లో మహిళలకు 50 శాతం స్థానాలు అనే సూత్రాన్ని కచ్చితంగా అమలు చేశారు.
జిల్లాలో ప్రస్తుతం జరగుతున్న ఎన్నికల్లో మహిళల స్థానాలను పరిశీలిస్తే... రెండు నగర పంచాయతీలు మినహా ఐదు మున్సిపాలిటీల చైర్మన్‌ల పదవులు మహిళలకు రిజర్వు చేశారు. అదేవిధంగా జెడ్పీటీసీ 59 స్థానాల్లో మహిళలకు 30 సీట్లు రిజర్వు చేశారు. ఎంపీటీసీ 835 స్థానాలకు గాను మహిళలకు 435 సీట్లు కేటాయించారు. గతేడాది జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా మహిళలకు అగ్రస్థానమే ఇచ్చారు.
చట్టసభల్లో మహిళల ప్రస్థానం..
జిల్లా నుంచి చట్టసభలకు వెళ్లిన మహిళలు చాలా తక్కువనే చెప్పాలి. శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని ఢంకా బజాయించి చెప్తున్న ఏ ఒక్క పార్టీ కూడా వారికి సరియైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఉద్యమాలే ఊపిరిగా బతికిన నాటి తరం మహిళలు మాత్రమే చట్టసభల్లో అడుగుపెట్టగలిగారు. ఆ తర్వాత మృతి చెందిన ప్రముఖ నాయకుల సతీమణులు ఎమ్మెల్యేలు, మంత్రులుగా రాణించారు. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా మహిళ లకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వలేదు.
1952 నుంచి 2009 సార్వత్రిక ఎన్నికల వరకు జిల్లా నుంచి ఆరుగురు మహిళలు చట్టసభల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా కొందరికి మాత్రమే అదృష్టం దక్కింది. వారిలో 1952-1962 వరకు ఆలేరు నుంచి ఆరుట్ల కమలాదేవి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1972లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి మూసపేట కమలమ్మ, 1978-83 వరకు తుంగతుర్తి నుంచి మల్లు స్వరాజ్యం, 1985లో నల్లగొండకు జరిగిన ఉప ఎన్నికల్లో గడ్డం రుద్రమదేవి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2000-2009 వరకు భువనగిరి నియో జకవర్గం నుంచి ఉమామాధవరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు జిల్లా నుంచి తొలి మహిళా మంత్రిగా పనిచేశారు. 2002 ఉప ఎన్నికల్లో దేవరకొండ నుంచి భారతీ రాగ్యానాయక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
జెడ్పీ పీఠంపై తొలి మహిళ..
జిల్లా పరిషత్ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి 2001 వరకూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని ఏలారు. 2001లో తొలి సారిగా జెడ్పీ చైర్మన్ స్థానాన్ని బీసీ మహిళలకు రిజర్వు చేయడంతో మహిళలకు అవకాశం దొరికినట్లయైంది. ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీగా గెలిచిన వేమవరపు ప్రసన్న రత్నాకర్ చైర్‌పర్సన్ పీఠాన్ని అధిష్టించారు. ఆమె మరణానంతరం కీతా లక్ష్మమ్మ చైర్‌పర్సన్ అయ్యారు.