అక్కడ గెలిస్తే మంత్రి పదవి బోనస్..

అక్కడ గెలిస్తే  మంత్రి పదవి బోనస్.. - Sakshi


 రాజకీయాల్లో ఒక్కొక్క చోట.. ఒక్కో రకం సెంటిమెంట్లు రాజ్యమేలుతుంటాయి. నరసరావుపేట నియోజకవర్గంలో ఒక సెంటిమెంట్ బహుళ ప్రచారంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఖాయం అనేది ఆ సెంటిమెంటు. గతంలో చాలాసార్లు ఆ విధంగా జరిగింది. ఈసారి అందరూ కొత్తవారే పోటీచేస్తున్న నేపథ్యంలో తొలిసారి గెలవగానే ఈ సెంటిమెంట్ ప్రకారం మంత్రి కూడా అయ్యే అదృష్టం ఉందని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.

 

 ఆ నియోజకవర్గంలో గెలిచిన వారిలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు వెంటనే మంత్రులైన ఘనత ఉంది. రాజకీయ ఉద్దండుల కోటగా పేరొందిన నరసరావుపేట నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత ఇది. అక్కడి నుంచి గెలిచిన వారిలో కాసు బ్రహ్మానందరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య కేబినెట్‌లలో మంత్రిగా పనిచేశారు. అనంతరం ఏడున్నరేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఇంకో విశేషమేమిటంటే నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి ఎంపీలుగా గెలిచిన ముగ్గురు దానికి ముందో, తర్వాతో ముఖ్యమంత్రులుగా కూడా చేసిన చరిత్ర ఉంది. కాసు బ్రహ్మానందరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కొణిజేటి రోశయ్య ఆ కోవలోకి వస్తారు.1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత తొలిసారి 1983లో జరిగిన ఎన్నికలలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవిని అలంకరించారు. అంతేకాదు గుంటూరు జిల్లాలో మొట్టమొదటి సారి రాష్ట్ర హోం మంత్రి పదవి పొందిన వ్యక్తిగా కోడెల రికార్డుల్లోకి ఎక్కారు. అక్కడి నుంచి వరుసగా మరో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కేబినెట్‌లలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు.కోడెలకు ప్రత్యర్ధిగా ఉన్న కాసు వెంకటకృష్ణారెడ్డి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లలో మంత్రిగా కొనసాగారు. అయితే  మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు రాజకీయాలకు కొత్తవారు కావడం విశేషం. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఖాయమనే సెంటిమెంట్ ప్రకారం ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి అయినట్టేనని నియోజకవర్గ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ అదృష్టజాతకుడెవరో వేచి చూడాలి.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top