31న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారోత్సవం చేస్తారని ప్రచారం
గతంలో గోవాలో కోడ్ ఉండగా మంత్రిని నియమించేందుకు నాటి సీఎం ప్రయత్నం
నేరుగా రంగంలో దిగిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్
నాటి సీఎం మనోహర్ పారికర్‌కు ఫోన్ చేసి ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేయాలని సూచన
తనకు రాజ్యాంగబద్ధంగా లభించిన అధికారాన్ని అడ్డుకోలేరని బదులిచ్చిన నాటి సీఎం
ఈసీ నచ్చజెప్పడంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గిన నాటి సీఎం
ఇటీవల ఓ స్మారకోపన్యాసంలో వెల్లడించిన మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఓ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతుండగా, రాష్ట్ర మంత్రిగా ఎవరినైనా నియమించవచ్చా?. ఆ అసెంబ్లీ స్థానం పరిధిలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కాదా?. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ముఖ్యమంత్రి సిఫారసుల మేరకు గవర్నర్ కొత్త మంత్రిని నియమించవచ్చా?. ఈ సందేహాలకు కేంద్ర ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 11న ఉప ఎన్నికలు జరగనుండగా, ఈ నెల 31న మాజీ క్రికెటర్ ముహమ్మద్ అజారుద్దీన్‌తో రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వచ్చే డిసెంబర్ ఏడో తేదీతో రెండేళ్లు పూర్తికానుండగా, ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించలేదు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం పరిధిలో గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో అజారుద్దీన్‌ను మంత్రిగా ప్రభుత్వం నియమించనుండటం ఆసక్తికరంగా మారింది.
నాడు సీఎంకు నేరుగా ఈసీ ఫోన్..
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మంత్రివర్గంలో కొత్త మంత్రిని నియమించవచ్చా? గతంలో ఇలాంటి ఘటనలెక్కడైన జరిగాయా? అప్పుడు ఎన్నికల సంఘం ఏం చేసింది? అనే సందేహాలను కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ అశోక్ లావాసా ఇటీవల హైదరాబాద్‌లో ఇచ్చిన ఓ ఉపన్యాసంలో నివృత్తి చేశారు. మంతన్ ఆధ్వర్యంలో గత సెప్టెంబర్ 13న నగరంలోని విద్యా అరణ్య పాఠశాలలో నిర్వహించిన సంస్థ సహా వ్యవస్థాపకుడు ‘అజయ్ గాంధీ’ స్మారక ఉపన్యాసంలో ఈ మేరకు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
గతంలో గోవాలోని ఓ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతుండగా, ఆ స్థానం పరిధిలో గణనీయ సంఖ్యలో ఉన్న సామాజికవర్గానికి సంబంధించిన ఓ వ్యక్తిని రాష్ట్రమంత్రిగా నియమించాలని అప్పటి సీఎం మనోహర్ పారికర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నేరుగా మనోహర్ పారికర్‌కు ఫోన్ చేసి ఉప ఎన్నికలు ముగిసే వరకు కొత్త మంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కోరారని అశోక్ లావాసా వెల్లడించారు. మంత్రుల నియాయకం విషయంలో రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలను సైతం వాడుకోలేనా? అని మనోహర్ పారికర్ బదులిచ్చారని గుర్తు చేసుకున్నారు.
ఎన్నికలు జరుగుతున్న సమయంలో కొత్త మంత్రితో ప్రమాణస్వీకారం చేయిస్తే ఆ సామాజికవర్గ ఓటర్లను ప్రభావితం చేసినట్టు అవుతుందని ప్రధాన కమిషనర్ నచ్చజెప్పడంతో అప‍్పట్లో మనోహర్ పారికర్ వెనక్కుతగ్గి ప్రమాణస్వీకారోత్సవాన్ని వాయిదా వేసుకున్నారని అశోక్ లావాసా తెలిపారు. రాష్ట్రంలో కొత్త మంత్రిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వస్తున్న వార్తలపై సీఈఓ కార్యాలయం స్పందనను ‘సాక్షి’ కోరగా, దీనిపై తమకు ఏమైన ఫిర్యాదులు వస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని బదులిచ్చారు. ఈసీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
-ముహమ్మద్ ఫసియుద్దీన్.


