
నరసరావుపేటలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బషీర్
ప్రైవేట్ స్కూల్‌కు వెళ్లేందుకు దారి లేకుండా అడ్డంగా గోడకట్టిన టీడీపీ నేతలు
స్కూల్‌ను వదిలేసి వెళ్లిపోవాలని బెదిరింపులు
భయంతో ఆత్మహత్యకు ప్రయత్నించిన స్కూల్ నిర్వాహకుడు
పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం
నరసరావుపేట రూరల్: ‘స్కూల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోండి. ఆ భవనం మాకు ఇచ్చేయండి.’ అంటూ టీడీపీ నాయకులు ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వాహకుడిని బెదిరించారు. ఏకంగా పాఠశాలలోకి వెళ్లేందుకు దారి లేకుండా అడ్డంగా గోడ కట్టేశారు. విజయవంతంగా నడుస్తున్న స్కూలు మూత పడుతోందని నిర్వాహకుడు తట్టుకోలేకపోయాడు. ఇక తనకు మరో దారి లేదని, చావే శరణ్యమని భావించిన ఆ ప్రైవేట్ స్కూల్ నిర్వాహకుడు షేక్ బషీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగింది.
బాధితుడి భార్య హేమలత తెలిపిన వివరాల ప్రకారం... నరసరావుపేటకు చెందిన షేక్ బషీర్ సెక్రటరీగా, మరికొందరు సభ్యులుగా పూజిత ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల ఏర్పాటుకు పట్టణంలోని లింగంగుంట్ల బ్యాంక్ కాలనీలో టీడీపీ నాయకుడు శాఖమూరి రామ్మూర్తికి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. పది సంవత్సరాలు లీజు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత రూ.80 లక్షలతో భవనాలు నిర్మించి 2020లో రెయిన్‌బో స్కూల్‌ను ప్రారంభించారు. బషీర్, ఆయన భార్య హేమలత ఆధ్వర్యంలో ఐదేళ్లుగా స్కూల్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక కష్టాలు మొదలు...
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెయిన్‌బో స్కూల్ నిర్వాహకులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది నెలల నుంచి పాఠశాలను ఖాళీ చేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ‘నా భర్త బషీర్‌ను, నన్ను ఇటీవల టీడీపీ ఆఫీసుకు పిలిపించారు. పాఠశాలను ఖాళీ చేసి భవనాలు వారికి అప్పగించి వెళ్లిపోవాలని టీడీపీ నాయకులు వాసిరెడ్డి రవి, శాఖమూరి రామ్మూర్తితోపాటు మరికొందరు బెదిరించారు. లేకపోతే అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని బెదిరించారు. మేం లీజు అగ్రిమెంట్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది.
కోర్టు ఆదేశాలను సైతం టీడీపీ నేతలు పట్టించుకోకుండా శనివారం రాత్రి పాఠశాలలోకి వెళ్లేందుకు దారి లేకుండా అడ్డంగా గోడ కట్టేశారు. దీనిపై నరసరావుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా పట్టించుకోలేదు. ఇక టీడీపీ నాయకులతో పోరాడే శక్తి లేదంటూ నా భర్త బషీర్ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించారు.’ అని హేమలత ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే బషీర్‌ను ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు. టీడీపీ నాయకుల కుట్రల వల్ల 300మంది విద్యార్థులు, సిబ్బంది రోడ్డునపడే పరిస్థితి వచ్చిందని హేమలత కన్నీటిపర్యంతమయ్యారు.
టీడీపీ నేతల వేధింపులపై ఆమె ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ కె.శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.