నామమాత్రంగా మిగిలిన వామపక్షాలు | left parties fall down in General elections | Sakshi
Sakshi News home page

నామమాత్రంగా మిగిలిన వామపక్షాలు

May 18 2014 4:30 AM | Updated on Aug 29 2018 8:56 PM

నామమాత్రంగా మిగిలిన వామపక్షాలు - Sakshi

నామమాత్రంగా మిగిలిన వామపక్షాలు

వామపక్షాలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో నామమాత్రంగా మిగిలాయి. ఇదివరకు ఎన్నడూ లేనంత దారుణంగా చతికిలపడ్డాయి. వామపక్షాలకు 15వ లోక్‌సభలో 24 స్థానాలు ఉండగా, 16వ లోక్‌సభ ఎన్నికల్లో పట్టుమని పది స్థానాలకే పరిమితమయ్యాయి.

బెంగాల్‌లో కోలుకోలేని రీతిలో కుదేలు   
 దారుణంగా పడిపోయిన ఓట్ల శాతం

 
 న్యూఢిల్లీ: వామపక్షాలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో నామమాత్రంగా మిగిలాయి. ఇదివరకు ఎన్నడూ లేనంత దారుణంగా చతికిలపడ్డాయి. వామపక్షాలకు 15వ లోక్‌సభలో 24 స్థానాలు ఉండగా, 16వ లోక్‌సభ ఎన్నికల్లో పట్టుమని పది స్థానాలకే పరిమితమయ్యాయి. వామపక్ష కూటమిలోని అన్ని పార్టీలకూ గత ఎన్నికలతో పోలిస్తే, ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం గణనీయంగా క్షీణించింది. గత 2009 ఎన్నికల్లో సీపీఎంకు 5.33 శాతం ఓట్లు లభించగా, ఈసారి 3.2 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. సీపీఐ ఓట్ల శాతం 1.43 శాతం నుంచి 0.8 శాతానికి పడిపోగా, ఆరెస్పీ 0.3 శాతం ఓట్లకు, ఫార్వర్డ్ బ్లాక్ 0.2 శాతం ఓట్లకు పరిమితయ్యాయి. ఈ ఎన్నికల్లో సీపీఎం తొమ్మిది స్థానాలను దక్కించుకోగా, సీపీఐకి ఒక్కటే దక్కింది.
 
 కేరళ నుంచి ఆరు, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌ల నుంచి రెండేసి స్థానాలు ఈసారి వామపక్షాలకు లభించాయి. వామపక్షాలకు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న పశ్చిమబెంగాల్‌లో ఈసారి అవి అధికార తృణమూల్ కాంగ్రెస్ తాకిడికి కోలుకోలేని రీతిలో కుదేలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌ను 34 ఏళ్లు పరిపాలించిన వామపక్ష కూటమికి ఇది దారుణ పరాభవం. బెంగాల్‌లోని ఓట్లనే లెక్కలోకి తీసుకుంటే, సీపీఎంకు 22.7 శాతం, సీపీఐకి 2.3 శాతం, ఆరెస్పీకి 2.4 శాతం, ఫార్వర్డ్ బ్లాక్‌కు 2.1 శాతం ఓట్లు లభించాయి. మొత్తంగా వామపక్ష కూటమికి రాష్ట్రంలో 29.5 శాతం ఓట్లు లభించాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచే 15 స్థానాలను గెలుచుకున్న వామపక్షాలకు ఈసారి రెండు మాత్రమే దక్కాయి.
 
 త్రిపుర మాత్రమే పదిలం
 మరోవైపు కేరళలో ఎల్డీఎఫ్ నుంచి వెలుపలకు వచ్చిన ఆరెస్పీ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో చేరి ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఆరెస్పీ అభ్యర్థి చేతిలో సీపీఎం మాజీ ఎంపీ ఎంఏ బేబీ మట్టికరిచారు. త్రిపురలో వచ్చిన ఫలితాలు మాత్రమే సీపీఎంకు కొంత ఊరట. రాష్ట్రంలోని రెండు లోక్‌సభ స్థానాలనూ సీపీఎం 5 లక్షలు, 4.8 లక్షల పైచిలుకు ఆధిక్యతతో ఆ పార్టీ తిరిగి కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement