ఈసారి జరుగుతున్న లోక్సభ ఎన్నికలు అత్యంత ఖరీదైనవి. వీటికి కేవలం ప్రభుత్వ వ్యయమే ఏకంగా రూ. 3426 కోట్లుగా తేలింది.
ఈసారి జరుగుతున్న లోక్సభ ఎన్నికలు అత్యంత ఖరీదైనవి. వీటికి కేవలం ప్రభుత్వ వ్యయమే ఏకంగా రూ. 3426 కోట్లుగా తేలింది. ఇంతకుముందు 2009లో జరిగిన ఎన్నికల వ్యయం కంటే ఇది 131 శాతం ఎక్కువ. ఐదేళ్ల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికలకు అప్పట్లో రూ. 1483 కోట్లు ఖర్చుకాగా, అదే చాలా ఎక్కువని అనుకున్నారు. తొమ్మిది దశలుగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం దాదాపు 30వేల కోట్లు ఖర్చయినట్లు భావించగా, అందులో ప్రభుత్వ వ్యయం పది శాతం మాత్రమే. 1952లో ఒక్కో ఓటరుకు సగటున 60 పైసల వరకు ఖర్చు కాగా, 2009లో అది 12 రూపాయలకు చేరుకుంది. 1952లో మొత్తం వ్యయం రూ. 10.45 కోట్లు మాత్రమే. 2009 నాటికి అది రూ. 1483 కోట్లకు చేరుకుంది.
పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు పలు చర్యలు తీసుకోవడం, ఎన్నికల నిర్వహణకు అయ్యే వ్యయం కూడా భారీగా పెరిగిపోవడం వల్లే ఈసారి మూడువేల కోట్లను దాటి ఖర్చయినట్లు ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఈసారి అనేక పార్టీలు రాజకీయాల్లోకి కొత్తగా రావడం, పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య కూడా పెరగడం కూడా ఎన్నికల వ్యయం ఎక్కువ కావడానికి కారణంగా తేలింది. ఓటరు స్లిప్పులను ఇంతకుముందు రాజకీయ పార్టీలు పంచేవి. ఈసారి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేసి వాళ్లతోనే స్లిప్పులు పంపిణీ చేయించింది. దీనికి కూడా ఖర్చు ఎక్కువే అయ్యింది.