నిన్నటితరం నటుడు బిశ్వజీత్ త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు సరికొత్త నిర్వచన ఇచ్చారు.
న్యూఢిల్లీ: నిన్నటితరం నటుడు బిశ్వజీత్ త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు సరికొత్త నిర్వచన ఇచ్చారు. ఎన్నికలంటే టీ20 మ్యాచ్‌లాంటివని, ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమన్నారు. తన సినీజీవితంలో ఎన్నో మ్యూజికల్ హిట్‌లు ఇచ్చి, ప్రేక్షకులను అలరించిన బిశ్వజీత్ త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ నుంచి దక్షిణ ఢిల్లీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
హేమాహేమీలు బరిలో ఉన్న నియోజకవర్గంలో తన గెలుపుపై ఆయన స్పందిస్తూ... టీ20 మ్యాచ్‌లాంటి ఈ ఎన్నికల్లో ఎవరైనా గెలవొచ్చునని జోస్యం చెప్పారు. క్రికెట్ మ్యాచ్‌లో ఏదీ అసాధ్యం ఎలా కాదో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు. ఆశా పరేఖ్, వహీదా రెహ్మాన్ వంటి పేరున్న నటీమణులతో నటించి, బాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న బిశ్వజీత్ తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోరికమేరకు రాజకీయాల్లోకి వచ్చారు.
దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్, బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న ఆ పార్టీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖీ, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆశిష్ కేతన్‌లాంటి దిగ్గజాలను ఢీకొంటున్నారు. వీరితో పోటీ పడడంపై ఆయన మాట్లాడుతూ... ‘బరిలో ఉన్నవారిలో ఎవరి చరిత్ర ఏమిటి? ఎవరు బలవంతులు? అనే విషయాలను తాను విశ్వసించనని, టీ20 మ్యాచ్‌లో ఒక్కోసారి ధావన్ మ్యాచ్‌ను ముగించవచ్చు లేదంటే ధోనీ ముగించవచ్చు.
ఆ రోజు ఎవరిదో వారే విజేతలు. ఈ ఎన్నికలు అంతే.. మిగతావారిలాగే నేనూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ప్రచారం కోసం రోజు నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటున్నాను. ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. గెలుపుపై ప్రత్యర్థులకు ఎంత ధీమా ఉందో నాకూ అంతే ఉందన్నారు.