ఇంటింటి ప్రచారంపై నిషేధం | Election Campaign to close in Telangana today | Sakshi
Sakshi News home page

ఇంటింటి ప్రచారంపై నిషేధం

Apr 28 2014 12:54 AM | Updated on Aug 14 2018 4:32 PM

ఇంటింటి ప్రచారంపై నిషేధం - Sakshi

ఇంటింటి ప్రచారంపై నిషేధం

రాష్ట్రంలో తొలి దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 30వ తేదీన పోలింగ్ జరిగే తెలంగాణ జిల్లాల్లోని 17 లోక్‌సభ, 108 అసెంబ్లీ స్థానాల్లో సోమవారం సాయంత్రం 6 గంటలకల్లా అభ్యర్థులు ప్రచారాన్ని ముగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు.

* ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తాం... సాక్షి ఇంటర్వ్యూలో సీఈఓ భన్వర్‌లాల్
* తెలంగాణలో నేటి సాయంత్రం 6 గంటల నుంచి ప్రచారం బంద్
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలి దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 30వ తేదీన పోలింగ్ జరిగే తెలంగాణ జిల్లాల్లోని 17 లోక్‌సభ, 108 అసెంబ్లీ స్థానాల్లో సోమవారం సాయంత్రం 6 గంటలకల్లా అభ్యర్థులు ప్రచారాన్ని ముగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. నక్సలైట్ ప్రభావిత  మిగతా 11 నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ఎన్నికల ప్రచారం ముగించాలని తెలిపారు. అభ్యర్థుల ఇంటింటి ప్రచారాన్ని నిషేధించినట్లు చెప్పారు.

ఎన్నికలకు 48 గంటల ముందు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎక్కువగా పాల్పడుతున్నందున ఇంటింటి ప్రచారంపై నిషేధం విధించినట్లు ఆయన వివరించారు. ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా ప్రచారం చేస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు నిఘా బృందాలను రెట్టింపు చేస్తున్నామన్నారు. భన్వర్‌లాల్ ఆదివారం సాక్షికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు...

* తెలంగాణ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఓటర్లు కాని వారందరూ సోమవారం సాయంత్రం 6 గంటలకల్లా ఆయా నియోజకవర్గాలను వీడి వెళ్లిపోవాలి. ఓట్లు లేని వారు కల్యాణ మండపాలు, హోటళ్లు, అతిథిగృహాలు, ఇతర చోట్ల మకాం వేసే అవకాశం ఉన్నందున పోలీసులు తనిఖీలు నిర్వహించి బయటకు పంపాలి.

* ఎలక్ట్రానిక్ మీడియా, రేడియోలు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఎటువంటి ఎన్నికల ప్రచారం చేయరాదు. బుధవారం పోలింగ్ పూర్తయ్యేవరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. పత్రికల్లో ప్రచారంపై ఎటువంటి ఆంక్షలు లేవు. అయితే ఆయా ప్రకటనల ప్రచార వ్యయాన్ని అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తారు.

* పోలింగ్‌కు 48 గంటల ముందు ఎటువంటి ఒపీనియన్ పోల్ ప్రసారాలను, వివరాలను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ఇవ్వరాదు. పోలింగ్ రోజు ఎవరూ ఎగ్జిట్ పోల్ కూడా నిర్వహించరాదు.

* సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు మద్యం విక్రయాలపై నిషేధం.
* సెక్యూరిటీ సిబ్బంది ఉన్నవారు ఓటు వేయడానికి మాత్రమే సెక్యూరిటీతో వెళ్లాలి. సెక్యూరిటీతో నియోజకవర్గాల్లో తిరగడం నిషేధం.

* పోలింగ్ కేంద్రాలకు బుధవారం ఉదయం 6.30 గంటలకే సిబ్బంది, రాజకీయ పార్టీల ఏజెంట్లు చేరుకుంటారు. ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థుల ఏజెంట్లు ముందు ఒక్కో ఈవీఎంలో 50 ఓట్లు వేస్తారు. వేసిన ఓట్లు ఆయా అభ్యర్థులకు సక్రమంగా వెళ్లాయా? లేదా? పరిశీలించిన తర్వాత అంతా సవ్యంగా ఉంటే ఆ ఓట్లను ఈవీఎంల నుంచి తొలగించి జీరో చేస్తారు. అప్పుడు ఈవీఎంలను సీల్ చేసి ఉదయం 7 నుంచి పోలింగ్ ప్రారంభిస్తారు.

* రాష్ట్రంలో కొత్త ఈవీఎంలను వినియోగిస్తున్నాం. ప్రతి పది పోలింగ్ కేంద్రాలకు అదనంగా నాలుగు ఈవీఎంలను రిజర్వ్‌లో ఉంచుతున్నాం. తెలంగాణలోని మొత్తం 30,518 పోలింగ్ కేంద్రాలకు గాను 20 వేల పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ చేయనున్నాం. మిగతా పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ ఉంటుంది.

* ఎన్నికల కమిషన్ 90% పోలింగ్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఓటర్లకు ఐదేళ్లకోసారి లభించే బ్రహ్మాస్త్రం ఓటు. దీన్ని ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిడులకు లొంగకుండా, కుల, మతాలకు అతీతంగా.. ఎవరు మంచి చేస్తారనుకుంటే వారికే ఓటు వేయండి.
* పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు విద్యుత్, మంచినీరు, షామియానాల వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం.

ఇక్కడ సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్
నక్సలైట్ ప్రభావిత నియోజకవర్గాలైన సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, చెన్నూరు, మంథని, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, భూపాలపల్లి, ములుగు, భద్రాచలంలలో 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. మిగతా 108 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 17 లోక్‌సభ స్థానాల్లో మొత్తం 265 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,669 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 2,81,66,266 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
 
ఇక్కడ రెండేసి ఈవీఎంలు
8 లోక్‌సభ స్థానాల్లో, అలాగే 31 అసెంబ్లీ స్థానాల్లో 15 కన్నా ఎక్కువమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గాల్లో రెండేసి ఈవీఎంలను వినియోగించనున్నారు. అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 32 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే 75% మంది ఓటర్లకు ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్‌ల పంపిణీ పూర్తరుు్యంది. మిగతా పంపిణీ  సోమవారానికి పూర్తవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement