జోగిపేట పీఠం మాదే | congress gave b-form to every nominated candidates | Sakshi
Sakshi News home page

జోగిపేట పీఠం మాదే

Mar 19 2014 11:47 PM | Updated on Sep 2 2017 4:55 AM

జోగిపేట పీఠం మాదే

జోగిపేట పీఠం మాదే

జోగిపేట పీఠంపై ఆశావహులంతా కన్నేశారు. ఈ సారి చైర్‌పర్సన్ అయ్యే ఛాన్స్ బీసీ మహిళకు దక్కడంతో పోటీ తీవ్రమైంది.

జోగిపేట, న్యూస్‌లైన్: జోగిపేట పీఠంపై ఆశావహులంతా కన్నేశారు. ఈ సారి చైర్‌పర్సన్ అయ్యే ఛాన్స్ బీసీ మహిళకు దక్కడంతో పోటీ తీవ్రమైంది. అత్యధిక వార్డుల్లో విజయం సాధించి చైర్‌పర్సన్ గిరీ కొట్టేదామని ప్లాన్‌లో ఉన్న కాంగ్రెస్‌లో ఈ పోటీ మరీ తీవ్రంగా ఉంది. దీంతో ఆ పార్టీ నేతలు చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. కాకపోతే చైర్‌పర్సన్ పోస్టు ఆశిస్తూ నామినేషన్ వేసిన అందరికీ బీ-ఫారం ఇచ్చేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులంతా పీఠం తమదంటే తమదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు.  

 నాలుగు స్తంభాలాట
 కాంగ్రెస్ తరఫున చైర్‌పర్సన్‌గిరీని ఆశిస్తున్న వారిలో మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎస్. సురేందర్‌గౌడ్ ఉన్నారు. అందువల్లే ఆయన తన భార్య కవితను 18వ వార్డు నుంచి బరిలో నిలిపారు. ఇక ఇదేఆశతో మాజీ ఎంపీపీ హెచ్ రమాగౌడ్ కూడా తన భార్య ప్రవీణను 16 వార్డు నుంచి పోటీలో ఉంచారు. వీరిద్దరిలాగే జోగిపేట పీఠంపై కన్నేసిన డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నారాయణగౌడ్ కూడా తన భార్య శోభారాణిని 10వ వార్డులో ఉంచి అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఇదేకోవలోనే మాజీ సర్పంచ్ డాకూరి జోగినాథ్ కూడా తన భార్య స్వర్ణలతో 1వ వార్డు నుంచి పోటీ చేయించారు. మరోవైపు ఇంతవరకూ చైర్‌పర్సన్ అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్, ఆశావహులందరికీ టికెట్లను ఖరారు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

 అభ్యర్థులు మాత్రం  ఎవరికి వారు తమ వార్డుల్లో తనను గెలిపిస్తే చైర్మన్ అవుతామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లోనూ గందరగోళం నెలకొంది. ఇంతకీ చైర్‌పర్సన్ ఎవరవుతారంటూ వాకబు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం మెజార్టీ స్థానాలు కొల్లగొట్టి పీఠం కైవసం చేసుకోవడం, లేదా విజేతలను దారికితెచ్చుకుని అవసరమైతే చైర్‌పర్సన్‌గిరీ అయినా ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా చైర్‌పర్సన్ పదవి ఆశిస్తున్న నలుగురిలో ముగ్గురు గౌడ సామాజిక వర్గం కాగా, మరొకరు ముదిరాజ్ సామాజికవర్గానికి చెందినవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement