బీజేపీ-టీడీపీ పొత్తులో ఇప్పటికీ సమన్వయం లేదని మంగళవారం మోడీ సభలు తేల్చి చెప్పాయి. సభల నిర్వహణలో బీజేపీ నేతలకు ఎక్కడా తెలుగు తమ్ముళ్ల నుంచి సహకారం లభించలేదు.
జనాన్ని తరలించని టీడీపీ నేతలు.. కమలనాథుల ఆగ్రహం
సాక్షి, హైదారబాద్: బీజేపీ-టీడీపీ పొత్తులో ఇప్పటికీ సమన్వయం లేదని మంగళవారం మోడీ సభలు తేల్చి చెప్పాయి. సభల నిర్వహణలో బీజేపీ నేతలకు ఎక్కడా తెలుగు తమ్ముళ్ల నుంచి సహకారం లభించలేదు. వేదికలపై తమ అభ్యర్థులను కూర్చోపెట్టడం వరకే టీడీపీ పరిమితమైంది. దీంతో కమలనాథులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ముఖ్యంగా ఎన్డీఏ సభగా పేర్కొన్న హైదరాబాద్ సభ టీడీపీ నిర్వాకంతో జనం లేక వెలవెలపోయిందని, అనుకున్నస్థాయిలో జయప్రదం చేయలేకపోయామని బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ సభలకు టీడీపీ అతిథిలా వచ్చింది తప్పితే, పొత్తు కుదుర్చుకున్న పార్టీలా సభలను జయప్రదం చేయడానికి ప్రయత్నించలేదని వ్యాఖ్యానిస్తున్నారు. సభకు ప్రజలు రాకపోవడంపై మోడీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ తీరుపై బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.