సర్కారీ కొలువులకు పెరిగిన క్రేజ్‌

Government Jobs Are The Most Secure Option In India Say Recruitment Expert - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు తగ్గడం, ఉద్యోగ భద్రతపై ఆందోళనల నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ డిమాండ్‌ నెలకొంది. సర్కారీ కొలువులకు ఎన్నడూ లేనంతగా ప్రొఫెషనల్స్‌ సైతం పోటీ పడుతున్నారని రిక్రూట్‌మెంట్‌ సంస్థ వెల్లడించిన క్వార్ట్జ్‌ నివేదిక తెలిపింది. 2016లో నోట్ల రద్దుతో పాటు గత ఏడాది జులైలో జీఎస్‌టీ ప్రవేశపెట్టడంతో ఈ రెండేళ్లలో వ్యాపారాలు దెబ్బతిని ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ప్రైవేట్‌ ఉద్యోగాలు తగ్గుముఖం పట్టాయి. దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ రంగాల్లో ఒకటైన ఐటీ సేవల పరిశ్రమ సైతం ఈ రెండేళ్లలో భారీ కుదుపులకు లోనైంది. 

ప్రభుత్వ ఉద్యోగాలే భద్రం..
ప్రైవేట్‌ రంగంలో అభద్రత నెలకొన్న క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలే సుస్థిరమైనవన్న ఆలోచన యువతలో కలుగుతున్నదని రిక్రూట్‌మెంట్‌ సంస్థ హెడ్‌హంటర్స్‌ వ్యవస్థాపకులు క్రిష్‌ లక్ష్మీకాంత్‌ అన్నారు. రైల్వేలు లేదా ఇతర ప్రభుత్వ సంస్థల్లో ప్యూన్‌ ఉద్యోగానికి సైతం నెలకు రూ 25,000 వేతనం లభిస్తోందని, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు సైతం అతను టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి పెద్ద కంపెనీల్లో చేరితే మినహా ఇంత వేతనం లభించడం లేదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన వేతనంతో పాటు పిల్లల విద్య, గృహవసతి వంటి పలు సౌకర్యాలు ఉంటాయన్నారు.ప్రైవేట్‌ రంగంలో ఇంక్రిమెంట్లు ఒకింత అధికమగా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలకు లేఆఫ్‌ల బెడద ఉండదన్నారు.

నోటిఫికేషన్ల జోరు..
కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల పెద్ద ఎత్తున నియామకాలకు దిగడంతో పలు పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో రైల్వేలు 90,000 ఉద్యోగాలకు జారీ చేసిన ప్రకటనకు స్పందిస్తూ 2.3 కోట్ల దరఖాస్తులు వెల్లువెత్తాయి. టెక్నీషియన్లు, లోకోమోటివ్‌ డ్రైవర్‌ల వంటి పోస్టులకు 5 లక్షల మంది పైగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. రైల్వేల్లో క్లర్కులు, స్టేషన్‌ మాస్టర్‌, టీసీ, కమర్షియల్‌ అప్రెంటీస్‌, ట్రాక్‌మెన్‌, హెల్పర్‌, గన్‌మెన్‌, ప్యూన్‌ వంటి పోస్టులకు ప్రకటన వెలువడింది.

ఇక తమిళనాడులో క్లరికల్‌ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టులకు 992 మం‍ది పీహెచ్‌డీ అభ్యర్థులు, 23,000 మంది ఎంఫిల్‌ చదివిన వారు, 2.5 లక్షల మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 8 లక్షల మంది గ్రాడ్యుయేట్లు పోటీపడ్డారు. కాగా మహారాష్ట్రలో ఈ నెల వెలువడిన పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు డాక్టర్లు, ఎంబీఏలు, న్యాయవాదుల నుంచి దరఖాస్తులు రావడం గమనార్హం. ఇక ఈ ఏడాది జనవరిలో మధ్యప్రదేశ్‌లో ప్యూన్‌ పోస్టుల నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్‌లో అత్యధిక విద్యార్హతలు కలిగిన వారు పెద్దసంఖ్యలో పోటీపడ్డారు. సర్కారీ పోస్టులకు పెద్దఎత్తున పోటీ నెలకొనడం ప్రైవేట్‌ రంగం కుదేలైన తీరుకు అద్దం పడుతున్నది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top