యునెస్కోపై కంటగింపు!

unesco concerned by recent incidents that undermine middle east peace process

ఆంకోర్‌వాట్‌లోని అప్సరసలు... బిహార్‌లోని క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంనాటి నలందా విశ్వవిద్యాలయ ఆనవాళ్లు... సిరియాలోని అలెప్పో పాత బస్తీలో మధ్య యుగాలనాటి మసీదులు... ఆస్ట్రేలియా సాగర తీర ప్రాంతాల్లో 2,300 కిలోమీటర్లమేర విస్తరించి, అత్యంత అరుదైన సముద్ర సంపదకు కేంద్రంగా నిలిచిన 900 మహా పగడాల దిబ్బలు–వీటన్నిటినీ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి పట్టించుకుంటున్నదెవరు? మాతృభాషలకు ఆసరాగా నిలబడకపోతే అవి కనుమరు గవుతాయని... వలస జీవులను ప్రభుత్వాలన్నీ రాచి రంపాన పెడుతున్నాయని... ప్రపంచ దేశాలన్నిటా పేద పిల్లలకు నాసి రకం విద్యే దిక్కవుతున్నదని ఆందోళన చెంది ఆ పరిస్థితులను సరిచేసేందుకు అక్కడి ప్రభుత్వాలతో పనిచేస్తున్నదెవరు? వీటన్నిటికీ ఒకటే జవాబు–యునెస్కో.

ఇవి మాత్రమే కాదు... కేరళ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని మారుమూల పల్లెల్లో అట్టడుగు వర్గాలవారిలో విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్న సంస్థలకు ఆసరాగా నిలబడటం కూడా యునెస్కో చేస్తున్న పనే. ఇరాక్‌లోని యూప్రటీస్‌ నదీ తీరంలో నిర్మితమైన నాలు గువేల ఏళ్ల నాటి చరిత్రాత్మక బాబిలాన్‌ నగరంలో అపురూపమైన పురావస్తు సంప దను ఛిద్రం చేస్తున్న అమెరికా ఆగడాలను ప్రశ్నించింది కూడా యునెస్కోనే. బెంగళూరు నగరంలో జర్నలిస్టు గౌరీలంకేష్‌ను కొందరు ఉన్మాదులు మాటుగాసి కాల్చిచంపిన తీరును ఖండించిన అంతర్జాతీయ సంస్థ అది. భూగోళమం తటా ఇలా అలుపెరుగని కృషి చేస్తున్న ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) నుంచి తాము వైదొలగబోతున్నట్టు గురువారం అమెరికా ప్రకటించింది.

అమెరికా అహంకార ధోరణులను యునెస్కో సవాలు చేయడం లేదు. అఫ్ఘానిస్తాన్‌లోనో, సిరియాలోనో, ఇరాక్‌లోనో మొత్తంగా అమెరికా ఆగడాలను అదేమీ నిలదీయడం లేదు. అలాంటిచోట్ల దాని కార్యకలాపాల మూలంగా పురావస్తు సంపద నాశనమైనప్పుడు ప్రశ్నిస్తోంది. కేవలం విద్య, సంస్కృతి, పురావస్తు సంపద పరిరక్షణ వగైరా రంగాల్లో పనిచేయడం, ప్రభుత్వాలకు సలహాలనివ్వడం, పునరుద్ధరణ కార్యక్రమాలకు పూనుకోవడంవంటి పనుల్లో నిమగ్నమై ఉన్న ఒక సంస్థపై అగ్రరాజ్యంగా చలామణి అవుతున్న దేశానికి మరెందుకింత ఆగ్రహం కలి గినట్టు? అమెరికా తాజా ప్రకటన డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న తలతిక్క నిర్ణ యాల పరంపరలో భాగమని అనుకోవడం సరికాదు. ఈ తాజా ప్రకటన నిజానికి లాంఛనప్రాయమైనది. ఎన్నో ఏళ్లుగా వేరు కాపురం ఉంటున్న దంపతులు విడి పోతున్నట్టు చేసిన ప్రకటనలాంటిదే అది. ఎందుకంటే ఆరేళ్లక్రితం యునెస్కో పాల స్తీనాను సభ్య దేశంగా చేర్చుకున్ననాటినుంచీ అమెరికా రగిలిపోతోంది. తాను వద్దన్న పని చేసిందన్న దుగ్ధతో ఆ సంస్థకు ఇవ్వాల్సిన నిధుల్లో 2011లోనే గణనీ యంగా కోత పెట్టింది.
ఇప్పుడు ఏకంగా ఆ సంస్థ నుంచే వైదొలగాలని నిర్ణయిం చింది. తన చిరకాల మిత్రదేశం ఇజ్రాయెల్‌ ప్రయోజనాలకు పాలస్తీనాకిచ్చిన సభ్యత్వం అడ్డంకి అవుతుందన్నదే అమెరికా ఆగ్రహానికి మూలం. ఇజ్రాయెల్‌ దుండ గాలకు వత్తాసు పలుకుతూ, భద్రతా మండలిలో దానిపై చర్యలు తీసుకో కుండా అడ్డుకుంటూ వస్తున్న అమెరికా యునెస్కోలో సైతం దాని ప్రయోజనాలను పరిరక్షిం చడానికి పూనుకుంది. అంతక్రితం యునెస్కో వార్షిక బడ్జెట్‌లో 22 శాతం (సుమారు రూ. 517 కోట్లు) వాటాను చెల్లించే అమెరికా... ఆ తర్వాత దానికి భారీగా కోత పెట్టింది. ఆ మొత్తాన్ని కూడా సక్రమంగా చెల్లించకుండా నాటకాలు ఆడటం మొద లుపెట్టింది. చాలాసార్లు హెచ్చరించాక 2013లో యునెస్కో అమెరికా కున్న ఓటింగ్‌ హక్కును సస్పెండ్‌ చేసింది. యునెస్కో ఆ నిర్ణయం తీసుకున్నప్పుడే అమెరికా పాక్షి కంగా తన సభ్యత్వాన్ని కోల్పోయినట్టయింది. ఆనాటినుంచీ దానిది పరిశీలక పాత్రే! ఈ పరిణామాలన్నీ జరిగినప్పుడు అమెరికాలో బరాక్‌ ఒబామా ప్రభుత్వమే ఉన్నదని గుర్తుంచుకుంటే ఇజ్రాయెల్‌తో ఆ దేశానికున్న అనుబంధం ఎలాంటిదో అర్ధమవు తుంది. అది వ్యక్తులకూ, పార్టీలకూ అతీతమైనది. వచ్చే ఏడాది డిసెంబర్‌ 31 తర్వాత సభ్యేతర పరిశీలక దేశంగా ఉంటామని అమెరికా చెబుతున్నదిగానీ యునెస్కో నాలు గేళ్లక్రితమే దాన్ని ఆ స్థాయికి తగ్గించిందని మరిచిపోకూడదు. 

యునెస్కో భద్రతామండలి వంటి అధికారాలున్న సంస్థ కాదు. దేశాలు సాగించే దుండగాలను ఖండిస్తూ భద్రతామండలి తీర్మానించిందంటే అలాంటి దేశం దారికి రావాల్సిందే. కానీ యునెస్కో కార్యక్షేత్రం వేరు. అక్కడ జరిగే చర్చలు వేరు. అవి కేవలం సైద్ధాంతికమైనవి. అక్కడ చేసే తీర్మానాలు ప్రతీకాత్మకమైనవి. నిరసన చెప్పడానికే అవి పరిమితం. భద్రతామండలిలో తన మిత్ర దేశం ఇజ్రా యెల్‌ తీరును ఖండించే తీర్మానాలకు మోకాలొడ్డి దాన్ని కాపాడుతున్న అమెరికా... యునెస్కోలో వ్యక్తమయ్యే పరిమిత నిరసనను కూడా సహించలేకపోతోంది. 2011లో పాలస్తీనాను చేర్చుకునే తీర్మానానికి 173 దేశాలు అనుకూలంగా ఓటే శాయి. కేవలం 14 దేశాలు మాత్రమే వ్యతిరేకించాయి. ఇప్పుడు పాలస్తీనాలోని హెబ్రాన్‌ను వారసత్వ నగరంగా యునెస్కో ప్రకటించడం ఆ రెండు దేశాలకూ మరింత కంటగింపయింది.

అమెరికా యునెస్కో నుంచి వైదొలగుతానని ప్రకటించడం వల్ల దాని మిత్ర దేశాలు మరికొన్ని ఆ బాట పట్టొచ్చు. లేదా ఇంతవరకూ అమెరికా చేసినట్టే తమ వాటా నిధుల చెల్లింపులో జాప్యం చేయొచ్చు. కానీ ఇలాంటి చర్యల వల్ల యునెస్కో ఇబ్బందుల్లో పడితే ప్రపంచం నలుమూలలా సాగుతున్న ఎన్నో అపురూపమైన, విలువైన కార్యక్రమాలు నిలిచిపోతాయి. అందువల్ల మొత్తంగా నష్టపోయేది మానవాళే. ఐక్యరాజ్యసమితి వ్యవస్థ ఏర్పాటులోనే ఎన్నో లోపాలున్నాయి. వీట న్నిటినీ దశాబ్దాలుగా అమెరికా తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. సంస్థ మౌలిక ఉద్దేశాలను, ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. దానికి కొనసాగింపే యునెస్కో నుంచి వైదొలుగుతున్నామన్న ప్రకటన. అమెరికా వైఖరిని ప్రపంచ ప్రజానీకం నిర సించి, యునెస్కోను ప్రాణప్రదంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top