తెలుగు సినీ పరిశ్రమకు మాత్రమే కాదు... భారత చలన చిత్ర పరిశ్రమకే దిగ్గజమనదగ్గ అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూశారు.
తెలుగు సినీ పరిశ్రమకు మాత్రమే కాదు... భారత చలన చిత్ర పరిశ్రమకే దిగ్గజమనదగ్గ అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూశారు. నిజజీవితం లోనూ, వెండితెరపైనా ఆయనది పరిపూర్ణమైన జీవితం. నిండైన వ్యక్తిత్వం. ఒక మనిషి ఎలా జీవించాలో చెప్పడానికి, ఒక కళాకారుడు ఎలా ప్రవర్తిల్లాలో తెలుసుకోవడానికి ఆయన ఏ తరానికైనా పనికొచ్చే పెద్ద విశ్వవిద్యాలయం. అందులో నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత లభిస్తుంది. భవిష్యత్తు తరాలకు కూడా అది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. కృష్ణాజిల్లాలో కేవలం యాభై గడపలే ఉన్న పల్లెటూరు వెంకటరాఘవాపురంలో పుట్టి, నాలుగో తరగతితోనే చదువు ఆపేసిన ఒక అర్భకుడు అసామాన్యుడిగా ఎదిగి 74 ఏళ్లపాటు తెలుగు చలన చిత్ర రంగంలో దేదీప్యమానంగా వెలగడమంటే మాటలుకాదు. తన కుటుంబంలో అంతకుముందెవరూ కళాకారులు లేరు. తెలిసీతెలియని వయసులో రంగస్థలంపై చిన్న పాత్రను పోషించి ఇంటికొచ్చినప్పుడు తల్లి ఆయన ముఖకవళికల్లో సంతోషాన్ని పసిగట్టి ఆ రంగంలోనే ప్రోత్సహించాలని సంకల్పించకపోతే తెలుగు సినీ కళామ తల్లికి ఇంతటి శిఖరాయమానమైన మనీషి లభించే వాడుకాదు. తన నటనతో ఆయన ఏడెనిమిది తరాలను అలరించారు. సమ్మోహన పరిచారు. రొమాంటిక్ హీరోగా, కుటుంబ కథా చిత్రాల నాయకుడిగా తెలుగు ప్రేక్షకులను కలలప్రపంచంలో తేలియాడేలా చేశారు.
భిన్న రంగాల్లో ఆయన ఒదిగిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. నటుడిగానేకాక వ్యాపారవేత్తగా, నిర్మాతగా కూడా ఆయన సూపర్ హిట్. హైదరాబాద్‌లో చలనచిత్ర పరిశ్రమను నెలకొల్పడమనే అంశం ఊహకు కూడా అందనిరోజుల్లో అన్నపూర్ణా స్టూడియో నిర్మించడం ద్వారా దానికి అంకురార్పణచేశారు. వందల మందికి ఉపాధి కల్పించారు. సమాజ శ్రేయస్సును కాంక్షించి ‘సుడిగుండాలు’, ‘మరో ప్రపంచం’ వంటి ప్రబో ధాత్మక చిత్రాల నిర్మాణానికి పూనుకున్నారు. తనలో వెల్లువెత్తే భావాలకు అక్షరరూపం ఇచ్చి ‘అఆలు’ (అక్కినేని ఆలోచనలు) పేరిట కవితా సంకలనాన్ని వెలువరించారు. తాను చదువుకోలేదన్న బాధ ఏమూలో ఉన్నందువల్ల కావొచ్చు... పుట్టిన ఊరికి సమీపంలో ఉన్న గుడివాడ పట్టణంలో కళాశాల నెలకొల్పడానికి నడుంకట్టారు. తెలుగు తెరపై తిరుగులేని తారగా ఎదిగి, కోట్లు గడించాక చేసిన పనికాదు ఇది. తన సంపాదన ఇంకా అంతంతమాత్రంగానే ఉన్నకాలంలో పెద్ద మనసుతో ఆలోచించి చేసిన మహత్కార్యం. ‘ప్రతిదీ సులభ సాధ్యమ్ము కాదు లెమ్ము... నరుడు నరుడగుట దుష్కరము సుమ్ము’ అని గాలిబ్ అన్నట్టు ఇదంతా అలవోకగా, అయాచితంగా ఆయనకు లభించలేదు. కఠోర శ్రమ, స్వీయ క్రమశిక్షణ, పట్టుదలవంటి లక్షణాలుంటే తప్ప ఇది సాధ్యమయ్యే విషయం కూడా కాదు. తాము పనిచేస్తున్న రంగంలో తప్ప ఇతరేతర రంగాల గురించి, అందులో జరుగుతున్న పరిణామాల గురించి అసలే ఏమీ తెలియని, పట్టని వ్యక్తులుండే పరిశ్రమలో అక్కినేని విషయ పరిజ్ఞానం అపారమైనది. ప్రతి అంశాన్నీ నిశితంగా, లోతుగా తెలుసుకోవాలనే పట్టుదలే ఆయనకు అన్నిటినీ నేర్పింది. ఆ పరిజ్ఞానమే ఆయనను ఒక నటుడికుండే పరిమితులను అధిగమించేలా చేసింది.
జీవితాన్ని గురించి, మృత్యువు గురించి ఆయనకు విస్పష్టమైన అభిప్రాయాలుండేవి. చానెళ్లలో వచ్చి కూర్చుని తన అభిమానులడిగే ప్రశ్నలకుగానీ, చర్చ నిర్వహించేవారు అడిగే ప్రశ్నలకుగానీ ఆయన చెప్పే జవాబులు అందరినీ చకితుల్ని చేసేవి. ఆయనలోని తాత్వికుడిని పట్టి చూపేవి. స్వస్వరూప జ్ఞానం ఆ జవాబుల్లో స్పష్టంగా కనబడేది. ‘మీ అభిమానం అలా మాట్లాడిస్తున్నది తప్ప...నా గురించి నాకు తెలుసు’ అని వినమ్రంగా మాట్లాడేవారు. సున్నితంగా తోసిపుచ్చేవారు. నాస్తికుడిగా జీవితాన్ని ప్రారంభించి చివరివరకూ తన విశ్వాసాలను అలాగే ఉంచుకున్నారు అక్కినేని. అలాగని తన సంతానానికి దైవభక్తి వంటివి ఉంటే వాటిని నియంత్రించే పనికి పూనుకోలేదు. తన అభిప్రాయాలను రుద్దడానికి ప్రయత్నించలేదు. ఆ రకంగా చూస్తే ఆయన అత్యంత ప్రజాస్వామిక వాది. ఆ నాస్తికభావాలు వెండితెరపై పాత్ర పోషణలో ఏనాడూ ఆయనకు ఆటంకం కాలేదు. విప్రనారాయణ, భక్తతుకారం, మహాకవి క్షేత్రయ్యవంటి పాత్రల్లో ఆయన జీవించారు. ఈ క్రమంలో ఆయనకు అనేకానేక అవార్డులు లభించాయి. నటసమ్రాట్‌గా, ఎవర్‌గ్రీన్‌గా జనం నీరాజనాలుపట్టారు. కనక వర్షం కురిపించే కమర్షి యల్ చిత్రాల కథానాయకుడిగా వెలిగిపోయినా అక్కినేని మనసు మాత్రం ఉండవలసిన చోటే ఉండేది. అందుకే తన చిత్రాల్లో తనకు బాగా నచ్చిన వాటి గురించి అడిగితే ‘బాటసారి’, ‘విప్ర నారాయణ’, కాళి దాసు’ వంటి చిత్రాలను ప్రస్తావించేవారు. ఇవి భారీ వసూళ్లు చేయక పోయినా సీరియస్ ప్రేక్షకుల, విమర్శకుల మన్ననలనూ, ప్రశంసలనూ అందుకున్న చిత్రాలు.
వయసు శరీరానికే తప్ప మనసుకు కాదని అక్కినేని అంటుండే వారు. చివరి వరకూ తనలోని కుతూహలాన్నీ, విషయాసక్తినీ ఆయన పోగొట్టు కోలేదు. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆచరించదగ్గ, అనుసరించ దగ్గ లక్షణాలివి. శూన్యంలో ప్రయాణం ప్రారంభించి, స్వయంశక్తితో ఒక్కో మెట్టే ఎక్కి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన అక్కినేని ఏ దశలోనూ తప్పటడుగులు పడనీయలేదు. కుటుంబంపట్లా, సమాజం పట్లా తన బాధ్యతను మరవలేదు. అంతటి అరుదైన, అపురూపమైన వ్యక్తిత్వం మన మధ్యనుంచి కనుమరుగుకావడం యావత్తు తెలుగు జాతికి బాధాకరమైన విషయం. మహోన్నత వ్యక్తులు కనుమరుగయ్యాక కూడా స్ఫూర్తినిస్తూనే ఉంటారు. మార్గదర్శకులుగా నిలుస్తారు. అందు వల్లే అక్కినేని లాంటి వ్యక్తికి మరణం లేదు.