హస్తినలో కొత్త డ్రామా!

TDP And BJP Plays New Drama In Delhi - Sakshi

తెలుగుదేశం ఆధ్వర్యంలో మరోసారి హస్తిన వేదికగా అపవిత్ర రాజకీయ క్రీడ మొదలైంది. విలువల గురించి తరచు లెక్చెర్లిచ్చే బీజేపీ ఇందులో బాహాటంగా భాగస్వామి కావడమే తాజా పరిణామం. గత బడ్జెట్‌ సమావేశాల రెండో దశలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చినా సభలో ప్రశాంతత లేదన్న సాకుతో వాయిదాలతో కాలక్షేపం చేసిన లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఇప్పుడు తెలుగుదేశం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు వెంటనే ఆమోదం తెలపడం... దానిపై శుక్రవారమే చర్చ ఉంటుందని నిర్ణయించడం ఇందుకు తార్కాణం. ఎన్‌డీఏ సర్కారుపై ఈ నాలుగేళ్లలో మొట్టమొదట అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌. దానివల్ల ఒరిగేదేమీ ఉండదని వాదిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు చివరకు గత్యంతరం లేక ఎన్‌డీఏ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానానికి తాము కూడా మద్దతిస్తామని ప్రకటించడం... ఆ మర్నాడే గొంతు సవరించుకుని తామే అవిశ్వాసం పెడతామని చెప్పడం... చివరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నోటీసు ఇచ్చినప్పుడల్లా ఆ పార్టీ కూడా ఇవ్వడం గత బడ్జెట్‌ సమావేశాల్లో దేశ ప్రజలంతా చూశారు.

ఆ నోటీసులపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని విలువైన బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగడానికి దోహదపడాల్సిన ఎన్‌డీఏ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించింది. బడ్జెట్‌ సమావేశాల్లో కేవలం 12 శాతం కాలం మాత్రమే లోక్‌సభ పనిచేసిందని, 2000 సంవత్సరం తర్వాత ఇదే అతి స్వల్పకాలమని గణాంకాలు చెబుతు న్నాయి. అప్పుడు అంత పట్టుదలగా అవిశ్వాస తీర్మానానికి మోకాలడ్డిన సర్కారుకు ఇప్పుడెందుకు ఆ బాధ్యత గుర్తొచ్చిందో బీజేపీ సంజాయిషీ ఇవ్వాలి. అప్పటికీ, ఇప్పటికీ మారిన పరిస్థితులేమిటి? సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ లేకపోవడమే కొత్తగా వచ్చిన మార్పు. గత సమావేశాల సమయంలో అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చే ముందు తాము ప్రత్యేక హోదా కోసం అన్నివిధాలా పోరా డుతామని, ఆఖరికి పదవుల నుంచి వైదొలగి ప్రజల ముందుకెళ్లడానికి కూడా సిద్ధమేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రకటించింది.

చివరకు అవిశ్వాసంపై చర్చ రాకుండా చేయడంతో ముందు చెప్పినట్టే ఆ పార్టీ ఎంపీలు పదవులకు రాజీనామా చేశారు. నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్న స్పీకర్‌ను కలిసి వాటిని ఆమోదింపజేసుకున్నారు. ఈ సందర్భాల్లో ఎక్కడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్‌ లేదా ఇతర మంత్రులు వచ్చే సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు తాము సిద్ధమని చెప్పలేదు. అంతా గడిచాక ఇప్పుడు తాము కోరుకుంటున్న బిల్లులు సభామోదం పొందా లనో, మరే కారణమో... మొత్తానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు రాజీనామా చేశాకే ఎన్‌డీఏ సర్కారు అవిశ్వాస తీర్మానంపై చర్చకు అంగీకరించింది. తెలుగుదేశం, బీజేపీల మధ్య ఈ విషయంలో లోపాయికారీ అవగాహన ఉన్నదన్న అనుమా నానికి మరో ఉదంతం కూడా తావిచ్చింది. మంగళవారం పార్లమెంటు భవన్‌లో జరిగిన అఖిల పక్ష సమావేశానికి ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుకకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రతినిధిగా ఆహ్వానం పంపటం ఈ కుమ్మక్కు రాజకీయానికి ఆనవాలు.

ఆమె నిరుడు అక్టోబర్‌లోనే తెలుగుదేశం పంచన చేరారు. ఆమెపై అనర్హత వేటు వేయాలని అప్పట్లోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ స్పీకర్‌ను కోరింది. అంతకు మూడేళ్లముందు ఫిరాయించిన ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల విషయంలో తాత్సారం చేస్తూ వస్తున్న సుమిత్రా మహాజన్‌ రేణుకపై చర్య సంగతినీ పక్కనబెట్టారు. తమ రాజీనామాలు ఆమోదించాలని మరోసారి కోరడానికి కలిసినప్పుడు సైతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఈ విషయమై అడిగారు. ఆ తర్వాతనైనా ఆ వ్యవహారాన్ని తేల్చడానికి ఆమెకు వచ్చిన అడ్డంకేమిటో తెలియదు. ఈ నెల 10న వివిధ పార్టీలకు ఆమె లేఖరాస్తూ... ‘మన పార్లమెంటు, మన ప్రజాస్వామ్యం సజావుగా, ఆదర్శవంతంగా సాగాలంటే ఏం చేయాలనేదానిపై ఆత్మవిమర్శ చేసు కోండి’ అని హితోక్తులు పలికారు. నైతికతకు నీళ్లొదిలి, నిస్సిగ్గుగా ఫిరాయించిన ఎంపీలపై నిబం ధనల ప్రకారం అనర్హత వేటు వేయడంలో తాత్సారం చేయడం ఏ ఆదర్శానికి దోహదపడుతుందో ముందుగా ఆమె ఆత్మవిమర్శ చేసుకోవాలి.

అఖిలపక్ష సమావేశంలో రేణుక నామఫలకం ఉండ టంపై అభ్యంతరం చెప్పిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్రమంత్రి అనంత కుమార్‌ ఇచ్చిన జవాబు మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమెకు సంబంధించిన అనర్హత పిటిషన్‌ స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నదని అనంతకుమార్‌ సంజాయిషీ ఇచ్చారు. అంటే... ఆయనకు పిటిషన్‌ వచ్చిందని తెలుసు. అది పెండింగ్‌లో ఉన్నదనీ తెలుసు. అయినా పార్లమెంటరీ వ్యవహా రాల మంత్రిగా తాను చేయాల్సింది చేయరు. అఖిలపక్షానికి మాత్రం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రతినిధిగా ఆమెను ఆహ్వానిస్తారు! ఏమి తర్కం!! హస్తినలో గుడ్డి దర్బార్‌ కొనసాగుతున్నదనడానికి ఇంతకు మించిన నిదర్శనం ఉంటుందా?

ప్రత్యేక హోదాకు టీడీపీ, బీజేపీలు రెండూ గండికొట్టి ప్రత్యేక ప్యాకేజీని తెరపైకి తెచ్చాయి. అదే అతి విశిష్టమైనదని బుకాయిస్తూ వచ్చాయి. కానీ నాలుగేళ్లుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విడవకుండా పోరాడిన పర్యవసానంగా ప్రజానీకంలో హోదా అంశం బలంగా నాటుకుపోయింది. ఈ సంగతి పసిగట్టి చివరకు గత్యంతరం లేక టీడీపీ బాణీ మార్చింది. ఈ బాణీలోనూ కుమ్మక్కు రాజకీయాలు ఉండొచ్చునని ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్నాయి. అయితే గత సమావేశాల సమయంలో సభ లోపలా, వెలుపలా నాటకాలాడిన టీడీపీ ఎంపీలు ఈసారైనా వాటికి స్వస్తి పలికి కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలి. అంతకన్నా ముందు గతంలో ప్యాకేజీని ఒప్పుకుని తప్పు చేసినందుకు లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇన్నేళ్లుగా మోకాలడ్డినందుకు తెలుగుదేశం ప్రత్యేక హోదా సాధించి పాప పరిహారం చేసుకోవాలని ఆ పార్టీ గుర్తించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top