మాధ్యమాల మాయాజాలం

Sakshi Editorial On Social Media Data Leak

ప్రపంచవ్యాప్తంగా 220 కోట్లమంది క్రియాశీల వినియోగదారులతో వెలిగిపోతూ ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన ఫేస్‌బుక్‌పై మరోసారి నీలినీడలు కమ్ముకు న్నాయి. ఆ సామాజిక మాధ్యమంలో ఉన్న వినియోగదారుల వివరాలు, వారి  ఇష్టా యిష్టాలు సంతలో సరుకులా మారాయని... బ్రిటన్‌ కేంద్రంగా పనిచేస్తున్న కేంబ్రిడ్జ్‌ అనలిటికా (సీఏ) సంస్థ వాటిని ఎడాపెడా ఉపయోగించుకున్నదని, పలు దేశాల్లోని రాజకీయ పక్షాలకు ఎన్నికల్లో వాటి ఆధారంగానే వ్యూహాలు రూపొందించిందని తాజాగా బయటపడింది. అంతేకాదు... మన దేశంలోని పార్టీలు కూడా ఆ మాదిరి సేవలను పొందుతున్నాయని సీఏకు భారతీయ భాగస్వామిగా ఉన్న ఒవలెనొ బిజి నెస్‌ ఇంటెలిజెన్స్‌(ఓబీఐ) తన వెబ్‌సైట్లో ప్రకటించింది. ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(యూ) తమ క్లయింట్‌లుగా ఉన్నాయని తెలిపింది. మన దేశంలో ఫేస్‌బుక్‌ వినియోగదారులు అమెరికాతో పోల్చినా ఎక్కువే. ఇక్కడ 24 కోట్లకుపైగా క్రియాశీల వినియోగదారులున్నారు. కనుక ఎలాంటి అవాంఛనీయ పోకడలకు ఆస్కారమిచ్చినా వాటి పర్యవసానాలు ప్రమాదకరంగా మారతాయి.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి అత్యంత కీలకమైనవి. ఎన్నికల ద్వారా ఓటర్లు తమ అభీష్టాన్ని వ్యక్తం చేస్తారని, ఆ రకంగా తమ భవిష్యత్తును తామే ఉమ్మడిగా నిర్దే శించుకుంటారని అంటారు. ఈ ప్రక్రియను ఏమార్చడానికి, ఇందులో కుల మత ప్రమేయాలనూ, ధన ప్రభావాన్ని జొప్పించి లాభపడటానికి చాన్నాళ్లుగా ప్రయ త్నాలు సాగుతున్నాయి. కానీ ఆ ఓటర్లను వారి వారి వయసులరీత్యా, వారి అలవాట్లరీత్యా, వారి ఇష్టాయిష్టాలరీత్యా వర్గీకరించి సమాజంలో ఏ వర్గం ఏం కోరుకుంటున్నదో ఆనుపానులు తెలుసుకోవడంతోపాటు వారిని ప్రభావితం చేసేలా తప్పుడు సమాచారాన్ని వెదజల్లి ఓట్లు గుంజుకునే ప్రయత్నాలు ఈమధ్య కాలంలో ప్రారంభమయ్యాయి. కుల, మత, ధన ప్రభావాలైతే నేరుగా తెలిసిపోతాయి. అలాంటి తప్పుడు పనులపై చట్టం దృష్టి పడుతుంది. చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. దొరికితే అభాసుపాలవుతామన్న భయం పార్టీల్లో ఎంతో కొంతైనా ఉంటుంది. పైగా చాలామంది ఈ ప్రలోభాలకు దూరంగా ఉంటారు. తమ విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. కనుకనే మన ప్రజాస్వామ్య వ్యవస్థ కనీసం ఈ మాదిరిగా అయినా మిగిలింది. కానీ సామాజిక మాధ్యమాల ద్వారా మాయ చేసే వారికి ఈ బాదరబందీ ఉండదు. ఓటర్లు తప్పుడు సమాచారం ప్రభావంతో తమ ఇష్టాలను మలుచుకుంటారు. నిర్ణయాలు తీసుకుంటారు. కనీ సం తాము మాయలో పడ్డామని గ్రహించే ఎరుక కూడా వారికుండదు. అంతా తెలుసుకునేసరికి ఏమీ మిగ లదు. అమెరికా పౌరులు అనుభవపూర్వకంగా ఆ సంగతి ఇప్పుడిప్పుడు గ్రహిస్తు న్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో సీఏ సంస్థ డోనాల్డ్‌ ట్రంప్‌ కోసం ఎన్ని మాయలు చేసిందీ ఇప్పటికే కొంత బయటపడింది. ఆ విషయంలో అక్కడ దర్యాప్తు సాగు తోంది. అమెరికా ఎన్నికలు మాత్రమే కాదు... యూరప్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి బయటికి రావాలని బ్రిటన్‌ పౌరులు దృఢంగా నిర్ణయించుకునేలా చేసింది కూడా సీఏ సంస్థే. పలు యూరప్‌ దేశాల్లోనూ దీని లీలలు బయటపడుతున్నాయి. బ్రెగ్జిట్‌ వ్యవహారంలో సీఏ పాత్రపై బ్రిటన్‌ విచారణ చేయిస్తోంది. 

సామాజిక మాధ్యమాలవల్ల భావ వ్యక్తీకరణ విస్తృతి పెరిగింది. సామాన్యులు సైతం క్రియాశీలంగా వ్యవహరించేందుకు అవి వేదికలయ్యాయి. ఏ మూల ఏ అన్యాయం జరిగినా అది క్షణాల్లో సామాజిక మాధ్యమాలకెక్కుతోంది. ప్రభుత్వాల కది కంటగింపుగా మారింది. ఏదో ఒక చర్య తీసుకున్నట్టు కనిపించడానికి అవి తాపత్రయపడుతున్నాయి. అయితే ఇదే సమయంలో సీఏ లాంటి సంస్థలు సైతం తమ దొంగ వ్యవహారాలను చడీచప్పుడు లేకుండా కానిచ్చేందుకు ఆ మాధ్యమా లను దుర్వినియోగం చేస్తున్నాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను భ్రష్టు పట్టిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఒక పార్టీకి ‘సమ్మతి’ని లేదా ‘అసమ్మతి’ని సృష్టిస్తున్నాయి. ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు తమలో చేరేవారికి కొన్ని ప్రశ్నలేసి జవాబులు రాబట్టి, వారి నుంచి కొన్ని అంశాలపై ఆమోదం తీసుకుని వినియోగ దారులుగా చేర్చుకుంటాయి. ఇలా ఆమోదం ఇవ్వడం ద్వారా తామేం చేస్తు న్నామో, అది దేనికి దారితీస్తుందో వినియోగదారులు గ్రహించలేక పోతున్నారు. ఆ మాధ్యమాల చేతుల్లో తెలియకుండానే మర మనుషులుగా మారుతున్నారు. సామా జిక మాధ్యమాలు రూపొందించే ఉపకరణాలు, అవి సేకరించే డేటా పౌరులపైనా, వారి ద్వారా మొత్తంగా ప్రజాస్వామ్యంపైనా ఎంతటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. డేటా చౌర్యాన్ని నిరోధించడానికి, విని యోగదారుల వ్యక్తిగత విషయాలు బయటకు పోకుండా ఉండటానికి రకరకాల ఫిల్టర్‌లను అందుబాటులోకి తెచ్చామని ఫేస్‌బుక్‌ చెబుతున్నా వాటిని నిరర్ధకం చేసే ఉపకరణాలు కూడా ఆ వెంటనే తయారవుతున్నాయి. 

సీఏ సంస్థ సీఈఓ అలెగ్జాండర్‌ నిక్స్‌ ఒక స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికిపోవడంతో ఇదంతా బట్టబయలైంది. ఆ సంగతలా ఉంచి ప్రజాస్వామ్యాన్ని ‘కరి మింగిన వెల గపండు’ మాదిరిగా మార్చే ఇలాంటి అనైతిక సంస్థల ప్రాపకాన్ని పొందడానికి ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు వెంపర్లాడాయన్న వార్తలు దిగ్భ్రాం తికలిగిస్తాయి. ఈ పార్టీల నేతలు ఎవరికి వారు  సచ్చీలురమని చెప్పుకోవడంతో పాటు ఎదుటివారిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో నిజానిజాలేమిటో రాగలరోజుల్లో నిర్ధారణవుతుంది. మన వినియోగదారుల వివరాలు దుర్వినియోగ మైతే కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెబుతు న్నారు. మంచిదే. ఓటర్లను స్వీయ ఆలోచనల్లేని వ్యక్తులుగా, మరమనుషులుగా మార్చి పబ్బం గడుపుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా, ఒక ప్రైవేటు సంస్థ ప్రయత్నించినా ఆ చర్య ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేయడమే అవుతుంది. ఈ మాధ్యమాల మాయలో తాము పడకుండా ఉంటే, జాగ్రత్తగా వ్యవహరిస్తే అది తమకూ, ప్రజాస్వామ్యానికి కూడా క్షేమదాయకమని మన పాలకులు, ప్రధాన రాజకీయ పక్షాలు తెలుసుకోవాలి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top