పాత బాణీ విడనాడాలి | Nepal Prime Minister KP Sharma Oli  Visits India | Sakshi
Sakshi News home page

పాత బాణీ విడనాడాలి

Apr 10 2018 12:22 AM | Updated on Aug 15 2018 2:37 PM

Nepal Prime Minister KP Sharma Oli  Visits India - Sakshi

నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్‌లో మూడురోజులు పర్యటించి వెళ్లారు. నాలుగేళ్లుగా ఇరు దేశాల సంబంధాలు ఒడిదుడుకుల్లో ఉన్న నేపథ్యంలో మాత్రమే కాదు... తన తొలి విదేశీ పర్యటనకు ఓలి మన దేశాన్ని ఎంచుకోవడంవల్ల కూడా దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో వ్యవసాయరంగంలో భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్యా ఉన్న రైల్వే లైన్లను విస్తరించుకోవడం, జలమార్గాలను ఏర్పాటు చేసుకోవడం, రక్షణ, భద్రతా రంగాల్లో సహకారం, వాణి జ్యాన్ని పెంపొందించుకోవడం వగైరా అంశాల్లో అవగాహన కుదిరింది. ఒకప్పుడు నేపాల్‌ మనకు అత్యంత సన్నిహిత దేశం. తన అవసరాలన్నిటికీ మనపైనే ఆధా రపడే దేశం. మన కనుసన్నల్లో నడిచే దేశం. ఆ దేశ రాజకీయాలను శాసించగలిగే స్థితిలో భారత్‌ ఉండేది. కానీ అక్కడ రాచరిక పాలన అంతమయ్యాక వరసబెట్టి జరుగుతున్న పరిణామాలు మనకు ఇబ్బందికరంగానే పరిణమిస్తూ వచ్చాయి. దాంతో సంబంధం లేకుండానే మన దేశం నేపాల్‌ను నిర్లక్ష్యం చేయడం అంత క్రితమే మొదలైంది. 

1997లో అప్పటి ప్రధాని ఇందర్‌కుమార్‌ గుజ్రాల్‌ తర్వాత  2014లో నరేంద్ర మోదీ వచ్చేవరకూ మన ప్రధాని ఎవరూ ఆ దేశం పర్యటించలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంతకన్నా ఆశ్చర్యకరమేమంటే... ఇండో-నేపాల్‌ జాయింట్‌ కమిషన్‌ 1987లో ఏర్పాటైనప్పుడు రెండేళ్లకోసారి ఆ కమిషన్‌ సమావేశం కావాలని నిర్ణయించగా 2014 వరకూ ఏ ప్రభుత్వమూ ఆ ఊసెత్తలేదు. ఇరు దేశాలూ ఎప్పటికప్పుడు సంప్రదించుకుని నిర్ణయాలు తీసుకోవడమే రివా జైంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఈ సంబంధాలు 2015లో మరింత దిగ జారాయి. అప్పట్లో తెరై ప్రాంతంలోని తారూ, మాధేసి వంటి మైనారిటీ జాతులు రాజ్యాంగంలో తమ రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోలేదన్న ఆగ్రహంతో రహ దార్లను దిగ్బంధించాయి. దాంతో మన దేశం నుంచి అక్కడకు వెళ్లాల్సిన వంట గ్యాస్, నిత్యావసరాలు రోజుల తరబడి నిలిచిపోయాయి. అంతక్రితమే వచ్చిన భూకంపంతో సర్వం కోల్పోయిన నేపాల్‌ ఈ దిగ్బంధంతో ఊపిరాడని స్థితికి చేరుకుంది.

మాధేసీలకు మద్దతిస్తున్న మన దేశం ఈ దిగ్బంధనానికి పరోక్షంగా సహకరించిందని, కష్టకాలంలో తమను లొంగదీసుకునేందుకు ప్రయత్నించిందని నేపాలీ పౌరుల్లో అసంతృప్తి ఏర్పడింది. ఆ సమయంలో నేపాల్‌ రిపబ్లిక్‌ తొలి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన విద్యాదేవి భండారీ చైనాతో ఇంధన సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నారు.  మాధేసీల హక్కుల పరిరక్షణకు సంబం« దించిన సమస్యతోపాటు... తాము వద్దని అనధికారికంగా చెప్పినా రాజ్యాంగంలో నేపాల్‌ను లౌకిక, ప్రజాస్వామిక రిపబ్లిక్‌గా పేర్కొనడంపై కూడా మన దేశానికి అభ్యంతరం ఉందని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే నేపాల్‌ ఆంతరంగిక అంశాల విషయంలో ఎలాంటి అభ్యంతరాలున్నా అవి అత్యవసర సరఫరాలు నిలిచిపోయే స్థితికి వెళ్లకుండా చూసి ఉంటే అది మన ప్రయోజనాలకే తోడ్పడేది. భారత్‌ పెద్దన్న పాత్ర పోషిస్తున్నదని, తన అభిప్రాయాలు రుద్దే ప్రయత్నం చేస్తున్నదని అక్కడి పౌరుల్లో అభిప్రాయం ఏర్పడటం మంచిది కాదని గుర్తిస్తే బాగుండేది.

నేపాల్‌ జనాభా 2.9 కోట్లు. భౌగోళికంగా కూడా చిన్న దేశం. కానీ ఆ దేశంతో మనకు 1,850 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దుల్లో అరడజను ప్రాంతాల్లో రెండు దేశాల మధ్యా పేచీలున్నాయి. కాలా పానీ నదీ జలాల వివాదం ఉంది. ఇరు దేశాల మధ్యా రాకపోకలకు వీసా నిబంధన లేకపోవడం వల్ల మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం బెడద సమస్యలు ఏర్పడుతున్నాయి. సరిహద్దు భద్రతలో రెండు దేశాలమధ్యా సహకారం చాలా అవసరం. సఖ్యత ముఖ్యం. అయితే నేపాల్‌లో జరిగిన పరిణామాలన్నీ మన ప్రభుత్వానికి అసంతృప్తి కలిగి స్తూనే వచ్చాయి. మూడు నెలలక్రితం అక్కడ జరిగిన ఎన్నికల్లో ఓలి నాయ కత్వంలోని వామపక్ష సీపీఎన్‌(యుఎంఎల్‌)–సీపీఎన్‌(మావోయిస్టు) కూటమి ఘన విజయం సాధించింది. ఓలి, ఆయన నాయకత్వంలోని సీపీఎన్‌(యూఎంఎల్‌) చైనాతో సఖ్యంగా ఉండాలని ఆదినుంచీ వాదించేవారు. 2015నాటి దిగ్బంధం సమయంలో కూడా యూఎంఎల్‌ భారత వ్యతిరేక వైఖరి తీసుకుంది. అందువల్లే ఓలి రాకతో భారత్‌–నేపాల్‌ సంబంధాలు దెబ్బతినొచ్చునన్న ఊహాగానాలు వెలు వడ్డాయి. దీనికితోడు గత నెలలో ఓలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాకిస్తాన్‌ ప్రధాని అబ్బాసీ నేపాల్‌ పర్యటించారు. భారత్‌–పాక్‌ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో ఈ పర్యటన మంచి సంకే తాలు పంపదని అక్కడి మీడియా ఓలిని హెచ్చరించింది. లోగడ ఆయన ప్రధానిగా పనిచేసినప్పుడు చైనాతో బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్ ‌(బీఆర్‌ఐ) ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఓలిపై భారత వ్యతిరేకి అన్న ముద్ర ఉన్నప్పటికీ ఆయన గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తొలి విదేశీ పర్యటనకు మన దేశాన్నే ఎంచుకున్నారు. అంతేగాక భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకుపోవాలన్న కృత నిశ్చయంతో ఈ పర్యటన జరుపుతున్నానని చెప్పారు. కనుక గతాన్ని మరిచి నేపాల్‌తో పటిష్టమైన సంబంధాలు నెలకొల్పుకోవడానికి మన దేశం కూడా గట్టిగా ప్రయత్నించాలి. మూడు నెలలనాటి ఎన్నికల తర్వాత అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. నేపాల్‌ ఆంతరంగిక పరిస్థితులు బాగా మారాయని గుర్తించడంతో పాటు మన నిర్లక్ష్యం పర్యవసానంగా ఇప్పటికే అక్కడ చైనా ప్రభావం పెరిగిందన్న సంగతిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నేపాల్‌ ఆర్థికాభివృద్ధికి అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన ఈ తరుణంలో మన నుంచి అందే సహకారం చైనాతో పోలిస్తే మెరుగ్గా ఉన్నదన్న అభిప్రాయం కలిగించగలగాలి. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అన్నిటికీ మించి నేపాల్‌ ఒక సార్వభౌమాధికార దేశమని, దానితో ఆ విధంగానే వ్యవహరించాలని మన దౌత్య వ్యవహర్తలు గుర్తిస్తే మంచిది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement