‘శిఖరాగ్ర’ సన్నాహం

Modi and Jinping Will Meeting On Friday In Chennai - Sakshi

ఆసియాలోనే కాదు... ప్రపంచంలోనే రెండు కీలక దేశాలుగా, ఇరుగుపొరుగు దేశాలుగా ఉన్న భారత్‌–చైనా అధినేతల మధ్య శుక్రవారం నుంచి రెండు రోజులపాటు ‘అనధికార శిఖరాగ్ర సమావేశం’ జరగబోతోంది. ‘అనధికారం’ అంటే అలాంటి శిఖరాగ్ర సమావేశాల్లో ఎలాంటి ఒప్పందాలూ, ఉమ్మడి ప్రకటనలూ ఉండబోవని అర్ధం. సాధారణంగా రెండు దేశాలు శిఖరాగ్ర సమావేశం జరుపుకుంటున్నాయంటే ఆ దేశాల మధ్య మెరుగైన దౌత్య సంబంధాలున్నాయని, వాటిని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి అవి ప్రయత్నిస్తున్నాయని అనుకుంటారు. నిజమే, భారత్‌–చైనాల మధ్య ఘర్షణలు లేవు. ద్వైపాక్షిక సంబంధాల్లో కూడా చెప్పుకోదగ్గ ఒడిదుడుకులు, అపశ్రుతులు లేవు. మన దేశంలోని చైనా రాయబారి భాషలో చెప్పాలంటే ‘రెండు దేశాల మధ్యా ఒక్క తూటా కూడా పేలలేదు’. అయినా స్నేహ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటు న్నాయనడానికి ఇటీవలి పరిణామాలే తార్కాణం. ఆగస్టు 5న జమ్మూ–కశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ, దానికున్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నాక ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ వైఖరిని చైనా బాహాటంగా సమర్థించింది. కశ్మీర్‌పై రెండు దేశాల మధ్యా ఉన్న వివాదం పరిష్కారమయ్యేంత వరకూ ఏకపక్షంగా కశ్మీర్‌ ప్రతిపత్తిని మార్చకూడదని చైనా అభిప్రాయపడింది. ఆఖరికి మరో 48 గంటల్లో శిఖరాగ్ర సమావేశం మొదలు కాబోతున్నదని తెలిసినా ‘కశ్మీర్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామ’ంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో సమావేశం సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఇరుదేశాలూ శాంతియుతంగా కశ్మీర్‌ సమస్యను పరిష్కరించుకోవాలని హితవుచెప్పారు. ప్రస్తుత పరిస్థితిలోని తప్పొప్పులేమిటో తమకు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయని కూడా ప్రవచించారు. ఇప్పుడు మహాబలిపురంలో ప్రధాని నరేంద్రమోదీతో షీ జిన్‌పింగ్‌ జరపబోయే అనధికార శిఖరాగ్ర సమావేశం తీరుతెన్నులెలా ఉండబోతున్నాయో ఈ వ్యాఖ్యలనుబట్టే అర్ధం చేసుకోవచ్చు. పాకి స్తాన్‌తో మన సంబంధాలు అత్యంత అధమ స్థాయిలో ఉన్నాయని, ఇరుదేశాల మధ్యా వైరం బాగా ముదిరిందని చైనాకు తెలుసు. కనుక మనతో మరింత మెరుగైన సంబంధాలు ఏర్పరుచుకోవాలని చైనా భావించి ఉంటే ఇమ్రాన్‌ పర్యటన తేదీని ముందుకు జరిపేది. ఎందుకంటే, ఆ పర్యటనలో కశ్మీర్‌ సమస్యను ఇమ్రాన్‌ బాహాటంగా ప్రస్తావిస్తారని, ఆ విషయంలో తాము కూడా మాట్లాడ వలసి వస్తుందని చైనాకు తెలియనిదేమీ కాదు. ఇలాంటి పరిస్థితిని కల్పించడం ద్వారా భారత్‌ను అసంతృప్తికి గురిచేయడం శిఖరాగ్ర సమావేశం ముందు మర్యాద కాదని ఏ దేశమైనా అను కుంటుంది. కానీ చైనా అనుకోలేదంటే దానిద్వారా అదొక సందేశం ఇవ్వదల్చుకున్నదని అర్థం. వాస్తవానికి మన విదేశాంగమంత్రి జైశంకర్‌ ఆగస్టు 11న చైనా వెళ్లారు. కశ్మీర్‌ విషయంలో మన వైఖరి గురించి చెప్పారు. అయినా చైనా మాత్రం యధావిధిగా ఐక్యరాజ్యసమితిలో, భద్రతా మండలిలో పాక్‌ అనుకూల వైఖరే తీసుకుంది.

చైనా, పాకిస్తాన్‌ల మధ్య గల సంబంధాలు ఎటువంటివో మన దేశానికి తెలుసు. అన్ని సమయాల్లోనూ అది పాకిస్తాన్‌కు అండగా నిలుస్తోంది. దాంతో మనకు పేచీ ఉండాల్సిన పని లేదు. అయితే కశ్మీర్‌ విషయంలో చైనా మాట్లాడినప్పుడు జవాబివ్వడం మన దేశం బాధ్యత. అందుకే ఇమ్రాన్‌ పర్యటనలో జిన్‌పింగ్‌ చేసిన వ్యాఖ్యలపై మన విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్‌కుమార్‌ గట్టిగానే స్పందించారు. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని గుర్తుచేశారు. ‘మా ఆంతరంగిక వ్యవహారాల గురించి ఇతర దేశాలు వ్యాఖ్యానించడం సరికాద’న్నారు. ఆ సంగతలా ఉంచి కశ్మీర్‌ విషయంలో ఇంత ‘ప్రజాస్వామికంగా’ ఆలోచిస్తున్న చైనా తమ భూభాగంలోని వీగర్‌లోనూ, ఇతరచోట్లా ముస్లింలపై అమలు చేస్తున్న అణచివేత గురించి అమెరికా మాట్లాడితే మాత్రం అభ్యంతరం చెబుతోంది. లక్షలాదిమంది ముస్లింలను నిర్బంధ శిబిరాల్లో ఉంచి మానవహక్కుల్ని మంటగలుపుతున్నారంటూ బుధవారం అమెరికా ఆరోపించి, అందుకు నిరసనగా కొందరు చైనా ఉన్నతాధికారుల వీసాలను రద్దు చేస్తే...అది మా ఆంతరంగిక వ్యవహారమని చైనా జవాబిచ్చింది. ఒకేరోజు కశ్మీర్‌ విషయంలో ఒకలా...వీగర్‌ విషయంలో మరొకలా మాట్లాడవలసి రావడం పరువు చేటని చైనా గ్రహించకపోవడం విచిత్రం. కశ్మీర్‌ విషయంలో మన దేశం తీసుకున్న నిర్ణయాలతో చైనా సైతం ఇరకాటంలో పడింది. ఎందుకంటే లద్దాఖ్‌కు తూర్పునున్న ఆక్సాయ్‌చిన్‌ ప్రాంతంలో చాలా భాగం చైనా అధీనంలో ఉంది. ఇప్పటికే సరిహద్దు తగాదాలున్న భారత్‌–చైనాల మధ్య తాజా నిర్ణయం మరింత చిచ్చు రేపుతుందని చైనా భావిస్తోంది.

నిరుడు ఏప్రిల్‌లో చైనాలోని వుహాన్‌లో ‘అనధికార శిఖరాగ్ర సమావేశం’ జరిగేనాటికి కూడా భారత్‌–చైనాల మధ్య సంబంధాలు ఏమంత బాగా లేవు. అప్పట్లో డోక్లాంలో ఇరు దేశాల సైనికుల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్తతలు అందుకు కారణం. అప్పుడు కూడా ఒప్పందాలూ, ఉమ్మడి ప్రకటన లేవు. అయినప్పటికీ డోక్లాం తరహా పరిస్థితులు తలెత్తకుండా ఇకపై తరచు పరస్పరం సమాచార మార్పిడి చేసుకోవాలని తమ తమ సైనిక దళాలకు అధినేతలిద్దరూ మార్గనిర్దేశం చేశారు. ఈసారి కూడా అటువంటి చర్యలేమైనా తీసుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కశ్మీర్‌ అంశాన్ని జిన్‌పింగ్‌ నేరుగా లేవనెత్తితే మన వైఖరేమిటో సవివరంగా తేటతెల్లం చేయాలని మోదీ సంకల్పించినట్టు చెబుతున్నారు. దాంతోపాటు ఉగ్రవాదులకు అందుతున్న నిధులను కట్టడి చేయడం గురించి వీరిద్దరూ చర్చిస్తారంటున్నారు. రెండు దేశాల అధినేతల మధ్య తరచు సమావేశాలు జరగడం ఎంత ముఖ్యమో, వాటికి ముందు ఒకరకమైన అనుకూల వాతావరణం ఏర్పర్చటం, కనీసం యధాతథస్థితి కొనసాగేలా చూడటం అవసరం. చైనా ఈ సంగతి గుర్తిస్తే బాగుండేది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top