అరికాళ్లకింద మంటలు చల్లారవా!

Me To Fight Against Casting Couch - Sakshi

రెండో మాట

ఇప్పుడు ‘నేను సైతం’అని మహిళాలోకమే (మీ– టూ) ఉద్యమాన్ని నిర్మించి ముందుకు సాగవలసి వస్తోంది. ఇది హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు విస్తరించడం ఆహ్వానించదగిన పరిణామం. బాలీవుడ్‌ నుంచి రాధికా ఆప్టే, మరొక ఉషా జాధవ్‌ బీబీసీ డాక్యుమెంటరీలో తాము ఎదుర్కొంటున్న బాధను బాహాటంగానే చెప్పారు. స్వాతంత్య్ర భానూదయ వేళలోనే గాంధీజీ ఒక సందేశాన్ని ఇచ్చారు. ‘స్వతంత్ర భారతంలో అర్థరాత్రి పూట స్త్రీలు నిర్భయంగా నడిచి పోగల స్వేచ్ఛావర్తనులు కావాలి’అని అన్నారాయన.

‘అందముంటే మొగవాడిని భరించేందుకు, బలముంటే మొగవాడికి చాకిరీ చేసేందుకు, చదువుకుంటే మొగవాడికి పద్దులు రాసేందుకు, సంగీతమొస్తే మగవాణ్ణి సంతోషపెట్టేందుకు – ఇంత అన్యాయం లోకమెట్లా భరిస్తుందో, ఆచారమనే బురదలో కుళ్లిపోయి నశించాయి మనవాళ్ల హృదయాలు... ప్రేమలేక, సంతోషం లేక, జీవితంలో ఇంటరెస్టు లేక, తను బాధపడ్డా కరుణించేవారు లేక, ఇంక విధిలేక బండచాకిరితో తన శక్తినీ, ద్వేషంతో తన ప్రేమనీ, తిట్లతో తన ఆనందాన్నీ సార్థకం చేసుకోవాలని స్త్రీ ప్రయత్నించడం మనకు సిగ్గుచేటు కాదా?’
– చలం (శేషమ్మ కథలులో ‘భార్య’నుంచి)

‘స్త్రీల కన్నీటిగాథలకు కారణాలు నాకు తెలుసు. వారి తరఫున వకాల్తా పట్టడానికే నిర్ణయించుకున్నాను. నాది ప్రజల ఉద్యమం. దానిని ఎవరిని సంతోషపెట్టడానికైనా వదులుకోను. స్త్రీలు మేలుకోవాలి, ఎదిరించాలి, తిరగబడాలి. మానవత్వం స్త్రీలోనే అధికం. స్త్రీ శరీరసౌఖ్యం పొందడం గొప్పకాదు. ఆమె మేధాశక్తిని గ్రహించి రసానుభూతిని పొందడం గొప్ప.’
మహాకవి గురజాడ (‘లేఖలు’నుంచి)

కనిపించే లోకం గురించి మనం ఎన్నో మాట్లాడుకుంటాం. మన కనుసన్నలలోనే కళ్లుకప్పి కోకొల్లలుగా జరిగే ఉదంతాలను గురించి మాత్రం పట్టనట్టే తప్పుకుంటూ ఉంటాం. ఆ అజ్ఞాత చీకటిగుయ్యారాలలో, పెట్టుబడిదారీ వ్యవస్థ రుద్దిన అసమ సమాజపు దోపిడీ చట్రంలో కుంగి కునారిల్లుతున్న స్త్రీల గాథలను ఏవగించుకుంటున్నాం. అంతేతప్ప ఒక సమష్టి శక్తిగా మానవ సమూహం పిడికిలి ఎత్తడానికి సిద్ధపడడం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తున్నది. అయినా ఇప్పటికీ ఆర్థిక అసమానతల నుంచి, దోపిడీ పద్ధతుల నుంచి, అత్యాచారాల నుంచి, వేధింపుల నుంచి బలహీనులను ఎందుకు విముక్తం చేయలేకపోతున్నాం? ప్రసార మాధ్యమాలు విస్తరించాయి కాబట్టి నేడు సమాజంలో జరుగుతున్న కొన్ని వికృతులు బయటపడుతున్నాయి. అవి విస్తరించని కాలంలో స్త్రీల మీద, బడుగుల మీద ఎన్ని రకాల అకృత్యాలు, అత్యాచారాలు జరిగాయో ఈ తరంవారికి తెలియదు. వందేళ్ల నాటి సామాజిక దృశ్యాన్ని గమనిస్తే ఇది అర్థమవుతుంది.

బాల్య వివాహాలను అరికట్టడానికీ, విధవా పునర్‌ వివాహాలు జరిపించడానికీ ఆనాడు తెలుగునాట ఒక యుద్ధమే చేయవలసి వచ్చింది. వీరేశలింగం జీవితమే అందుకు ఉదాహరణ. ఇక సంఘాన్ని, భాషను, సంస్కృతిని సంస్కరించడానికి గురజాడ, గిడుగు, చిలకమర్తి వంటివారు ఎంతో మూల్యం చెల్లించవలసి వచ్చింది. తరువాతి కాలాలలో జాషువ, త్రిపురనేని వంటివారు ఇలాంటి సమరానికి తలపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్నకొద్దీ పనిచేసే చోట్ల స్త్రీలపై వేధింపులు కూడా పెరిగిపోతున్నాయి. సమ సమాజం, ఆర్థిక సమానత్వాన్ని లక్ష్యంగా చాటుకున్న రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నేతలు కూడా ఈ దుస్థితిని నిరోధించడం మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.

కారణం– రాజకీయ పార్టీలలో, పాలనా యంత్రాంగంలో, ఆఖరికి మంత్రుల స్థాయిలోను తప్పుడు మార్గం పట్టినవాళ్లు, అదే మార్గంలో వెళుతున్నవారు ఉన్నారు. ఇటీవల చలనచిత్ర రంగంలో చోటు చేసుకున్న పరిణామాలు స్త్రీలు ఎంతటి దురవస్థను ఎదుర్కొంటున్నారో చెప్పకనే చెప్పాయి. ఈ నేపథ్యంలోనే ఒక మహిళా మాజీ ఎంపీ పార్లమెంటులో కూడా స్త్రీలకు వేధింపులు ఉన్నాయని (24–4–18) ప్రకటించారు. ‘నూరు దోషాలలోని ఒక సుగుణం’దోపిడీ పద్ధతుల మీద ఆధారపడిన పెట్టుబడిదారీ సమాజ నైజం. ‘నూరు సుగుణాలలోని ఒక దోషం’ప్రగతిశీల సామ్యవాద ప్రజాస్వామ్య వ్యవస్థల స్వభావం. మన కుల వ్యవస్థ చట్రంలో అంటరానితనం వర్గ పోరాటానికి ప్రతిబింబమని అన్నారు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌. అంతేకాదు, ‘దోపిడీపై ఆధారపడి కొనసాగుతున్న స్వతంత్ర భారతంలోని ప్రజా బాహుళ్యం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే ప్రజలను దోచుకునే పెట్టుబడి వర్గాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఐక్య సంఘటన అనివార్యం.

అందుకు మరణభీతి ఉండరాదు’అని కూడా అంబేడ్కర్‌ (పంథార్‌పూర్, మహారాష్ట్రలో, 1954లో మహిళలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో) అన్నారు. ‘వివక్ష లేని సామూహిక సమాజం నుంచి, కలివిడిగా నివసించగల సామాజిక చట్రం నుంచి కుల వ్యవస్థ హిందువులను దూరం చేసింది. సమైక్య జీవన చైతన్య భావన నుంచి వేరు చేసింది. సామాజిక సద్వర్తనలో సమాజ సభ్యులందరు పాలు పంచుకునే సమష్టి కార్యాచరణ అవసరం. భావోద్రేకాలను సమష్టిగా పంచుకోవడం అనేది కుల వ్యవస్థను కూలగొట్టడంతోనే సాధ్యం’అన్నది ఆయన అభిప్రాయం. ఆడపిల్లలు భర్తలకు దీటుగా నిలబడాలని, భర్తను స్నేహితునిగా, సమాన హోదాలోనే భావించాలి గాని, అతడికి బానిసై పడి ఉండకూడదని కూడా చెప్పారాయన. నేటి పెక్కు సామాజిక, ఆర్థిక సమస్యలకు పరిష్కారం హిందూ కోడ్‌ బిల్లు అని అంబేడ్కర్‌ ఆనాడు చాటారు. 

కనుకనే సుప్రసిద్ధ కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఒక కథలో స్త్రీల దుస్థితిని ప్రతిబింబింపచేస్తూ ఆ పాత్ర చేతనే, ‘దొడ్లో గేదె ఉంది, ఇంట్లో నేనున్నాను ఇంటిల్లిపాదికీ’అని గద్గగ స్వరంతో పలికించారు. ఇవాళ్టి చలనచిత్ర పరిశ్రమలో పొట్టపోసుకోవడానికి వచ్చిన ఒక కళాకారిణి వ్యథాభరితంగా గొంతెత్తితే కానీ అక్కడి ఎందరో ‘భద్ర పురుషుల’నిజజీవితాల గురించి వెల్లడయ్యే అవకాశమే రాలేదు. ఎవరు ఎన్ని మంటలు పెట్టినా సంసారాన్ని నెట్టుకొచ్చిన రుక్కమ్మ గాథ శ్రీపాద రాసిన ‘అరికాళ్ల కింద మంటలు’చదివితేనే అందరికీ తెలుస్తుంది. ప్రఖ్యాత కథకురాలు అబ్బూరి ఛాయాదేవి ఒక కథలో సృష్టించిన పాత్ర వనజ. పదోన్నత పత్రాలు తీసుకోవడానికి ఉత్సాహంగా వెళితే, ఆ పత్రాలను అందించే క్రమంలో వనజ చేతి వేళ్లను పట్టుకున్నాడు ఆమె పై అధికారి. దాంతో ఆ పత్రాలు అందుకోకుండానే, ‘యూ క్రూక్‌’అనుకుని వెనుదిరిగింది.

అందరి మేలు కోరుకున్న గురజాడ ‘దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్లారా? మీపేరేమిటి?’అని (మీపేరేమిటి? కథలో) ప్రశ్నించాడు. స్త్రీని బానిసగా చూసే ‘మెటిల్డా’భర్త (మెటిల్డా కథలో) ధోరణి, సరళ అనే యువతి పట్ల ప్రొఫెసర్‌ రంగనాథయ్యర్‌ (సంస్కర్త హృదయం కథలో) వ్యవహరించిన తీరులతో మహాకవి చాలా కోణాలను ప్రతిబింబింప చేశారు. వివాహం కాకుండా సంతానాన్ని కనకూడదా? అని ప్రశ్నించే యోధులను, నీకు శాశ్వతమైన భార్య ఇష్టం లేదని చాటే మృగాళ్లను కొడవటిగంటి ఉతికి ఆరేసింది ఎందుకు? దారి తప్పిన సమకాలీనుల ధోరణులు రేపటి తరాలకు పాఠాలుగా ఉండాలనే కదా!  అందుకేనేమో ఇప్పుడు ‘నేను సైతం’అని మహిళాలోకమే (మీ– టూ) ఉద్యమాన్ని నిర్మించి ముందుకు సాగవలసి వస్తోంది. ఇది హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు విస్తరించడం ఆహ్వానించదగిన పరిణామం.

బాలీవుడ్‌ నుంచి రాధికా ఆప్టే, మరొక ఉషా జాధవ్‌ బీబీసీ డాక్యుమెంటరీలో తాము ఎదుర్కొంటున్న బాధను బాహాటంగానే చెప్పారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారి నుంచి లైంగిక వేధింపులు సర్వసాధారణమని చెప్పారు. స్వాతంత్య్ర భానూదయ వేళలోనే గాంధీజీ ఒక సందేశాన్ని ఇచ్చారు. ‘స్వతంత్ర భారతంలో అర్థరాత్రి పూట కూడా స్త్రీలు నిర్భయంగా నడిచి పోగల స్వేచ్ఛావర్తనులు కావాలి’అని అన్నారాయన. కానీ నిర్భయ చట్టం వచ్చినట్టే ఉన్నా ఆచరణలో యువతులు, మహిళలు పగటి పూట కూడా బిక్కుబిక్కుమంటూ సంచారించాల్సిన పరిస్థితి ఉంది. 
కుల వివక్షే కాదు, వర్ణ వ్యత్యాసం కూడా దేశంలో జడలు విప్పుకుంటున్నదా అన్న అనుమానం కూడా కలుగుతున్నది. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవకుమార్‌ దేవ్‌ (బీజేపీ) ప్రకటనే ఇందుకు నిదర్శనం. ‘తెల్లగా ఉన్న ఐశ్వర్యారాయ్‌కు ప్రపంచ సుందరి బిరుదు ఇవ్వడం సబబే. కానీ చామనఛాయలో ఉన్న డయానా హెడెన్‌కు ఏం చూసి ప్రపంచ సుందరి టైటిల్‌ ఇచ్చారో అర్థం కావడం లేదని అనడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

‘భారత వనితనైన నేను నా శరీరం చామన ఛాయలో ఉన్నందుకు గర్వపడుతున్నాను. కానీ ఈ చర్మ వివక్ష కారణంగా నేను న్యూనతా భావానికి గురవుతూనే ఉన్నాను.’అని ఆమె నిరసన ప్రకటించక తప్పలేదు. నిజానికి పసిపిల్లలకు పాలివ్వకుండా తల్లులను నిరోధించే భర్తలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇది సిగ్గుపడవలసిన విషయం కాదా! దోపిడీ వ్యవస్థకు దేవిడిమన్నా చెప్పవలసిన సమయం రాలేదా? ‘వర్గ, వర్ణ వ్యవస్థలో మహిళలు కూడా దళిత బహుజనులే’అన్నారు అంబేడ్కర్‌. అందుకే మార్క్స్, ఏంగెల్స్‌ ‘ధనిక వర్గ సమాజంలో భర్త బూర్జువా ప్రతినిధికాగా, భార్య శ్రామికవర్గ ప్రతినిధి’అని పేర్కొన్నారు. నాగరిక సమాజంలో కూడా దారిద్య్రం ఉంటుందా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ‘ఆ దారిద్య్రం కొలదిమంది చేతులలో అపారమైన సంపద ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోయి ఉండడమే కారణం’అని చెప్పారు.

అది ఎందుకంటే, ‘ఎప్పుడైతే అతి సంపద అందుబాటులో ఉండదో మగవాడికి తన జీవిత భాగస్వామి పైన దాష్టీకం చెలాయించే అవకాశం దొరకదు. స్త్రీ పైన పురుషుడి పెత్తనానికి రక్షణగా నిలిచేది ధనస్వామ్య చట్టాలే. ధనస్వామ్య రద్దుతోనే బహు భార్యత్వాలు, బహు భర్తృత్వ వ్యవస్థలు రద్దు కాక తప్పదు’అన్నారు మార్క్స్‌. అంతవరకు వర్గ సమాజంలో స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుందో ‘స్త్రీస్త్రీ’ అనే శ్రీశ్రీ కవితలో చూద్దాం!‘కథానాయిక ఆహా ఆడుద్ది గరళ ద్రోణి/ తన ఆవేదనలో మన జనయిత్రి/ కథానాయిక శేషమ్మ మాతృత్వ వంచిత కథానాయిక మిస్‌ బేబీ స్క్రీన్‌ మీద గ్లిసరిన్‌/ బాష్పాలు – తెరవెనుక ఖరీదైన ప్రేమ/ కథానాయిక వాసనకి సంపెంగవనం అదిరా నీ/ నీ కథానాయిక సంగీతపు సౌందర్యం, సౌందర్యపు/ సంక్షోభం సౌందర్యపు సంక్షేమం మరిచిపోయిన చుక్కల/ మీదకి ఎగిరిపోయే రెక్కల చేప/ కథానాయిక కోపం వస్తే ‘నా మొగుడు’అని తిడుతుంది/ స్త్రీస్త్రీ నివేదిక అంతం!!’ స్త్రీ అనంత బాధలకు వ్యంగ్యార్థంలో అందించిన అశ్రు తర్పణం. 

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top