మద్యం షాపులకు దేవుడి పేర్లు? | gods names for wine shops | Sakshi
Sakshi News home page

మద్యం షాపులకు దేవుడి పేర్లు?

Jun 27 2015 12:01 AM | Updated on Sep 3 2017 4:25 AM

మద్యం షాపులకు దేవుడి పేర్లు?

మద్యం షాపులకు దేవుడి పేర్లు?

నూతన మద్యం పాలసీ. కాదు. మద్యం నూతన పాలసీ. ఇక్కడ మద్యం నూతనం కాదు, పాలసీ మాత్రమే నూతనం. అసలామాటకొస్తే నూతన మద్యానికి గిరాకీ ఉండదు

అక్షర తూణీరం
 
నూతన మద్యం పాలసీ. కాదు. మద్యం నూతన పాలసీ. ఇక్కడ మద్యం నూతనం కాదు, పాలసీ మాత్రమే నూతనం. అసలామాటకొస్తే నూతన మద్యానికి గిరాకీ ఉండదు. మాగిన మద్యానికే పరువుప్రతిష్టలు ఎక్కువ. పాలసీ సారాంశం ఏమిటంటే, అదనంగా మూడువేల కోట్లు మద్యం మీద పిండాలని, దేవుళ్ల పేర్లు మద్యం షాపులకు పెట్టరాదని సూచించారు.

ఇదేమీ నిలవదు. దేవుడు ఒక నమ్మకం, ఒక విశ్వాసం. దాని మీద ఆంక్షలా? లిక్కర్ పాట దక్కిన వాళ్లు తిరుపతి, శ్రీశైలం వెళ్లి మొక్కులు చెల్లించి వస్తుంటారు. దేవుడికి మొక్కులుగా సీసాలు చెల్లించకపోవచ్చు. అయినా తప్పులేదు. కంపెనీల వారు తమ కార్లనీ, బైకుల్నీ స్వామికి సమర్పించడం లేదా? మాంసం దుకాణానికి అభిమానంగా గాంధీ పేరు పెట్టుకొనేవారు, భక్తిగా కనకదుర్గ పేరు పెట్టుకొనేవారుంటారు. నేనిక్కడ ధర్మవ్యాధుడి కథ గుర్తు చేస్తున్నాను. అసలిది కోర్టుకు వెళితే నిలవదు. దేవుడి దయవల్ల షాపు తనకు దక్కిందనీ, దేవుడి దయవల్లే అమ్మకాలు బాగున్నాయనీ సదరు భక్త యజమాని విశ్వసిస్తాడు. వ్యక్తిగత విశ్వాసాలకు, నమ్మకాలకు నిషేధాజ్ఞలు జారీ చేసే హక్కు ఏ రాజ్యాంగానికీ ఉండదు.

అసలు దేవుడున్నాడా, లేడా అనే అంశం మీద ఏ సందర్భంలోనైనా, ఏ న్యాయస్థానమైనా  తీర్పు ఇచ్చిందా? అసలెవరైనా ఈ ధర్మ సంకటం మీద కనీసం పిల్ అయినా వేశారా? వెయ్యాలి. నాస్తికులూ, హేతువాదులూ అయినా వెయ్యొచ్చు. తటస్థులూ, పిడివాదులూ అయినా పడేయచ్చు. ఆస్తికుల్ని, దేవాదాయ శాఖని ప్రతిపక్షుల్ని చెయ్యాలి. స్వామీజీలూ, పీఠాధిపతులూ తమని పార్టీలుగా చేర్చాలని ముందుకు వస్తారు. ఇక ఆ క్షీరసాగర మథనంలో ఏమేమి వస్తాయో పైవాడికెరుక. అసలొక తీర్పు, తీర్మానం చేతిలో ఉంటే ఆ తర్వాత ఎవరిష్టం వారిది. దాన్ని ఆమోదిస్తామా, అమలు చేస్తామా అనేది ‘సెక్షన్ -8’ లాగా వారిష్టం వారిది.

బీరకాయలు తెమ్మంటే, బీరుకాయలు తెచ్చారేంటని భార్య నిగ్గదీస్తే ‘‘నాకట్టా వినిపించింది. శ్రేష్టంగా కనిపించింది.’’ అని భర్త గోముగా జవాబు. కొత్త పాలసీలో మెగా మాల్స్‌లో బీరు అమ్మకాలకు షట్టర్లు ఎత్తారు. పాలకులాగే టెట్రాప్యాక్‌లను పరిచయం చేస్తున్నారు. సెల్‌ఫోన్‌లో సింగిల్ బటన్ మీద మద్యం డెలివరీ సదుపాయం ఉండొచ్చు. ప్రసార మాధ్యమాల్లో బ్రాందీలు, విస్కీలు ప్రచారం చేయరాదని నిబంధన ఉంది. మనవాళ్లు దేశ ముదుర్లు కదా! అందుకనే అదే బ్రాండ్ మీద సోడాని తయారుచేసి, దాన్ని ప్రచారం చేస్తూ అసలుదాన్ని గుర్తు చేసి నోరూరిస్తారు.

అవి ద్రవాలైతే, సోడాలు ఉపద్రవాలు. ప్రముఖ నటులు చిత్తూరు. వి నాగయ్య అడపా తడపా గొంతు తడుపుకునేవారు. ‘‘పుచ్చుకునేది నీళ్లతో పుచ్చుకోండి, సోడాతో వద్దండీ!’’ అని ఒక శ్రేయోభిలాషి సలహా ఇచ్చాడు. అందుకు నాగయ్య , ‘‘వద్దులే బాబూ! ఇప్పుడు సోడా చూసినపుడే నాలిక పీకుతోంది. అప్పుడు నీళ్లు చూసినపుడల్లా పీకుతుంది. అది మరీ ప్రమాదం’’ అన్నారట. నేచెప్పొచ్చేదేమంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. మద్యశాఖ ఉత్సాహంగా ఉంది. పుష్కరాలు వస్తున్నాయి కదా! పెద్దల్ని తలుచుకోవడం కాబట్టి, దుఃఖావేశం ఉంటుందిట. మర్చిపోవడానికి మోతాదు పెంచుకుంటారని పై శాఖ అంచనా వేస్తోంది. శుభం.


 
 - శ్రీరమణ
(రచయత ప్రముఖ కథకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement