గొగోయ్‌ నిర్ణయం సబబేనా?

Editorial: Ranjan Gogoi Nominated To Rajya Sabha - Sakshi

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నాలుగు నెలలక్రితం పదవీ విరమణ చేసిన జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ సోమవారం రాష్ట్రపతి నోటిఫికేషన్‌ వెలువడ్డాక నలు మూలలనుంచీ విమర్శలు మొదలయ్యాయి. జాతి నిర్మాణంలో శాసన, న్యాయవ్యవస్థలు రెండూ కలసికట్టుగా పనిచేయాలన్న తన దృఢ నిశ్చయానికి అనుగుణంగానే దీన్ని అంగీకరించానంటున్నారు జస్టిస్‌ గొగోయ్‌. పెద్దల సభలో ప్రమాణస్వీకారం చేశాక దీనిపై మరింత వివరణ ఇవ్వదల్చుకున్నట్టు ప్రకటించారు. న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన గురించి అందరికీ తెలిసింది చాలా తక్కువ. 

2018 జనవరిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఉండగా ఆయన పనితీరుపై బాహాటంగా విమర్శలు చేసిన నలుగురు సీనియర్‌ న్యాయమూర్తుల్లో జస్టిస్‌ గొగోయ్‌ ఒకరు కావడంవల్లా, జస్టిస్‌ మిశ్రా అనంతరం ఆయనే బాధ్యతలు చేపట్టవలసివుంది గనుక, ఇతరులకన్నా ఆయనపై అందరి దృష్టి పడింది. ఆ తర్వాత జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు, రామజన్మభూమి వివాదం తదితర కేసుల్లో తీర్పులు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనాలకు నేతృత్వం వహించడం వల్ల జస్టిస్‌ గొగోయ్‌ వార్తల్లో నిలిచారు. సుప్రీంకోర్టు మహిళా ఉద్యోగిని ఆయన లైంగికంగా వేధించారన్న ఆరోపణలు, ఆ విషయంలో బాధితురాలికి ఎదురైన సమస్యలు వగైరాల వల్లకూడా జస్టిస్‌ గొగోయ్‌ గురించి విస్తృతంగా చర్చ జరిగింది. 

ఇప్పుడు జస్టిస్‌ గొగోయ్‌కి పదవి ఇవ్వడంపై స్వరం పెంచి విమర్శిస్తున్నవారిలో కాంగ్రెస్‌ నేతలు అందరికన్నా ముందున్నారు. ఈ నిర్ణయం న్యాయవ్యవస్థ స్వతంత్రతపై అనుమానాలు రేకెత్తి స్తుందని... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికుండే గౌరవప్రపత్తులకు భంగం కలిగిస్తుందని ఆ విమర్శల సారాంశం. సహజంగానే బీజేపీ ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై అనుమానాలు రేకెత్తించడం మాటేమోగానీ, తన పాలనాకాలంలో ఇలాంటి పనులే చేసిన కాంగ్రెస్‌ విమర్శలకు దిగడం... ఇతరులకన్నా రెచ్చిపోయి మాట్లాడటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి అంశాల్లో విమర్శించే నైతికార్హత ఆ పార్టీకి ఎక్కడదన్న అనుమానం కలుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ మరణించిన స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేయడానికి, ప్రత్యేకించి ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై ఏం చేశాయో ఎవరూ మర్చిపోలేదు. 

జగన్‌మోహన్‌ రెడ్డిపై అక్రమార్జన ఆరోపణలు చేస్తూ ఆ పార్టీలు రెండూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ పార్టీలు కోరినట్టే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిసార్‌ అహ్మద్‌ కక్రూకు పదవీ విరమణానంతరం నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్‌ పదవి కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్‌ది. ఇంకా వెనక్కుపోతే జస్టిస్‌ బహరుల్‌ ఇస్లాం మొదలుకొని రంగనాథ్‌ మిశ్రా, ఫాతిమా బీవీ వంటివారెందరికో ఆ పార్టీ ఇదే మాదిరిగా పదవులిచ్చింది. అందరికన్నా జస్టిస్‌ బహరుల్‌ ఇస్లాం గురించి చెప్పుకోవాలి. ఆయన కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికై 1972లో ఆ పదవికి రాజీనామా చేసి గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి 1979లో రిటైరయ్యాక ఆ మరుసటి సంవత్సరమే ఆయన్ను మళ్లీ పిలిచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. 

1983లో ఆయనకు మరోసారి రాజకీయాలపై మోజు ఏర్పడి పదవిని వదులుకుని అసోం నుంచి లోక్‌సభకు కాంగ్రెస్‌ తరఫున పోటీచేశారు. అప్పట్లో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో ఆ ఎన్నిక వాయిదా పడింది. దాంతో కాంగ్రెస్‌ ఆయన్ను రాజ్యసభకు పంపింది. ఇందిరాగాంధీ తిరుగులేని అధికారం చలాయిస్తున్న కాలంలో ఇలా ఇష్టానుసారం అటునుంచి ఇటూ... ఇటునుంచి అటూ ఒక వ్యక్తిని మార్చుతూ పోయినప్పుడు న్యాయవ్యవస్థ ఉన్నత ప్రమాణాలు ఆ పార్టీకి పట్ట లేదు. అనంతరకాలంలో రంగనాథ్‌ మిశ్రా, ఫాతిమా బీవీ, కక్రూ వగైరాలకు పదవులిచ్చినప్పుడు కూడా అవి గుర్తుకు రాలేదు.

న్యాయవ్యవస్థలో ఉంటూ తమ నిర్ణయాల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసినవారు పదవీ విరమణ అనంతరం ప్రభుత్వాలిచ్చే రాజకీయ పదవులు చేపట్టడం సరికాదని వాదిస్తున్నవారు అనే  కులున్నారు. ఎవరిదాకానో ఎందుకు... బీజేపీ నాయకులు స్వర్గీయ అరుణ్‌ జైట్లీ, ప్రస్తుత కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వంటివారు న్యాయమూర్తులు రిటైరయ్యాక ప్రభుత్వాలిచ్చే పదవుల్ని అంగీక రించరాదని అభిప్రాయపడ్డారు. ఈ పదవుల్ని ఆశించి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాస్తు న్నారని జైట్లీ ఆరోపించారు కూడా. సీవీసీ పదవిలో పనిచేసి పదవీ విరమణ చేసినవారు మరే పదవి చేపట్టరాదన్న నిబంధన వుంది. దురదృష్టవశాత్తూ న్యాయమూర్తుల విషయంలో అటువంటిది లేదు. 

మన రాజ్యాంగ నిర్మాతలే దీన్ని ఊహించి తగిన నిబంధనలు పొందుపరిచివుంటే బాగుండేది. కానీ భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందని వారి ఊహకు అందకపోయి ఉండొచ్చు. పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులు కొన్నేళ్లపాటు ఏ పదవీ చేపట్టరాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ కేటీ థామస్, జస్టిస్‌ లోథాలు హితవు పలికారు. అయితే ఇలాంటి హితవచనాలు పట్టించుకునేవారెవరు? జస్టిస్‌ గొగోయ్‌ మాదిరే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ    మూర్తిగా రిటైరైన నాలుగు నెలలకే జస్టిస్‌ సదాశివం 2014లో కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇలా పదవులు చేపట్టడం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు మాయని మచ్చని సీజేగా పనిచేసినప్పుడు చెప్పిన జస్టిస్‌ గొగోయ్‌... ఇప్పటి తన నిర్ణయంపై ఏం చెబుతారో దేశమంతా ఎదురుచూస్తోంది.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top