ట్రంప్‌ వింత పోకడ

Donald Trump refuses to certify Iran nuclear deal - Sakshi

అమెరికా అధ్యక్ష పీఠం అధిష్టించిన నాటినుంచీ ఇరాన్‌ అణు ఒప్పందాన్ని రద్దు చేయాలని తహతహలాడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ ఆ దిశగా తొలి అడుగేశారు. రెండేళ్ల క్రితం అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలో కుదిరిన ఆ ఒప్పందాన్ని తాజాగా ధ్రువీకరించేందుకు నిరాకరించారు. ఇది నేరుగా ఆ ఒప్పందంనుంచి వైదొలగే చర్య కాకపోయినా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడానికి, తిరిగి అని శ్చితి ఏర్పడటానికి దారితీస్తుంది. ఒప్పందాన్ని సవరించి అందులో కొత్త డిమాండ్లు చేర్చాలన్నది ట్రంప్‌ ప్రధాన వాదన. ఒప్పందంలో ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణి కార్య క్రమాన్ని చేర్చాలని, సిరియా, ఇరాక్‌లలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డుల ఉనికి గురించి కూడా తేల్చాలని ఆయన పట్టుబడుతున్నారు. క్షిపణి కార్యక్రమం తమ ఆత్మరక్షణ కోసం ఉద్దేశించిందే తప్ప ఎవరిపైనా దాడి చేయడానికి కాదని ఇరాన్‌ అంటున్నది.

అలాగే 1979 నాటి ఇస్లామిక్‌ విప్లవంలో కీలక పాత్ర పోషించిన రివల్యూషనరీ గార్డు వ్యవస్థను పటిష్టం చేసుకోవడం తమ హక్కని చెబుతోంది. ఇరాన్‌ తీసుకుంటున్న ఈ చర్యలు రెండూ పశ్చిమాసియాలో దాని ప్రాబల్యాన్ని పెంచుతాయని, తమకు ముప్పు తీసుకొస్తాయని సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ ఆందోళనపడుతున్నాయి. ఆ రెండు దేశాల ప్రయోజనాలనూ పరిరక్షించడమే ధ్యేయంగా అమెరికా తాజా చర్యకు పూనుకుంది. నిజానికి ఒప్పందం కుదిరిననాడే రిపబ్లికన్‌ పార్టీ దాన్ని దుయ్యబట్టింది. తమ పార్టీ అధికారంలోకొచ్చాక ఒప్పం దాన్ని రద్దు చేస్తామని ట్రంప్‌ ఎన్నికల ప్రచార సభల్లో పదే పదే చెప్పారు. వచ్చిన వెంటనే ఆ దిశగా చర్యలు మొదలెట్టాలని భావించినా విదేశాంగ శాఖ ఉన్నతా ధికారులు అందుకు అభ్యంతరం తెలిపారు. ఒప్పందాన్ని ఇరాన్‌ తు చ తప్పకుండా పాటిస్తున్నప్పుడు ఇలా చేయడం అసాధ్యమని వివరించారు. అందుకే ఇరాన్‌కు ఆగ్రహం కలిగించి, దానంతటదే ఒప్పందంనుంచి వైదొలగేలా చేయాలని ట్రంప్‌ ఎత్తుగడలేశారు.

అది కూడా సాధ్యపడకపోవడంతో ఎప్పటికప్పుడు ఒప్పందాన్ని అయిష్టంగానే ధ్రువీకరిస్తున్నారు. ఇప్పుడిక ధ్రువీకరణకు నిరాకరించారు. అయితే ఇది అమెరికాకు ఇరాన్‌తో మాత్రమే కాదు... ఆ ఒప్పందంలో భాగంగా ఉన్న బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీలతో కూడా సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇకపై ఏ ఒప్పందంలోనూ అమెరికాతో కలిసి నడవరాదని ఆ దేశాలు నిర్ణయిస్తే అంతర్జాతీయంగా అమెరికా ఏకాకి అవుతుంది. దాని ప్రతిష్టను దెబ్బతీస్తుంది. కొత్త పార్టీ అధికారంలోకొచ్చినప్పుడల్లా పాత ఒప్పందాలను తిరగదోడే సంస్కృతి మొదలైతే ఏ దేశాన్నీ మరో దేశం విశ్వసించే స్థితి ఉండదు. ఇప్పటికే బ్రిటన్‌ విదే శాంగమంత్రి బోరిస్‌ జాన్సన్‌ అమెరికా వైదొలగినా ఒప్పందం కొనసాగుతుందని చెబుతున్నారు.

కొన్నాళ్లక్రితం తానే తూర్పారబట్టిన ఒప్పందాన్ని... అధికారంలోకొచ్చిన వెంటనే వెనువెంటనే రద్దు చేస్తానని చెప్పిన ఒప్పందాన్ని నిర్ణీత వ్యవధిలో ఎప్పటికప్పుడు ధ్రువీకరించాల్సి రావడంతో ట్రంప్‌కు తలకొట్టేసినట్టవుతోంది. అలాగని దాన్నుంచి పూర్తిగా తప్పుకుంటే పర్యవసానాలెలా ఉంటాయో తెలియదు. ఇప్పటికే ఉత్తర కొరియా కొరకరాని కొయ్యగా మారింది. ఎన్నివిధాల బెదిరిం చాలని చూసినా, దూషిస్తున్నా ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ లొంగిరావడం లేదు సరి గదా... ఒకటికి పది మాటలు అంటిస్తున్నారు. క్షిపణి పరీక్షలు జరుపుతూ ఆ ప్రాంతంలో అమెరికా మిత్ర దేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌లను బెంబేలెత్తి స్తున్నారు. ఆ విషయంలో  ప్రపంచ దేశాలను సంప్రదించడం, వివిధ మార్గాల్లో పరిష్కారానికి ప్రయత్నించడంలాంటివి చేయాల్సిన తరుణంలో సమస్యలేని చోట నిప్పెట్టాలని చూసే  ధోరణి తగదని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి.

అమెరికా నాయకత్వంలో ఆ దేశాలన్నీ ఇరాన్‌తో చర్చల్లో పాల్గొన్నాయి. తమతోపాటు అమె రికా కూడా సంతృప్తి చెందాకే ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒప్పందంలోని అంశాలన్నిటికీ కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చి ఇరాన్‌ దానిపై సంతకం చేసింది.  ఆమాటకు అది కట్టుబడి ఉన్నంతకాలమూ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్న దేశాలు ఆంక్షల్ని సడలించాల్సిందే. ఒప్పందంలో అమెరికా ధ్రువీకరణ భాగం కాదు. ఈ ఒప్పందానికి కొనసాగింపుగా అమెరికా రూపొందించుకున్న ఇరాన్‌ అణు ఒప్పంద సమీక్షా చట్టంలోని అంశమది. ఆ చట్టం ప్రకారం ప్రతి 90 రోజులకూ అమెరికా అధ్యక్షుడు అణు ఒప్పందాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ట్రంప్‌ తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా అమెరికన్‌ కాంగ్రెస్‌ 60 రోజుల్లో ఇరా న్‌పై ఆంక్షలకు సిద్ధపడొచ్చు. ఒప్పందాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లదే అక్కడ పైచేయి గనుక అదేమంత కష్టం కాకపోవచ్చు. అయితే వర్తమాన పరిస్థితుల్లో రిపబ్లికన్లు అందుకు సిద్ధపడతారా అన్నదే ప్రశ్న.

ఇంతకాలమూ అమెరికా చెప్పినట్టల్లా వ్యవహరిస్తున్న పాశ్చాత్య దేశాలు ఈ తాజా పరిణామాన్ని గట్టిగా వ్యతిరేకిస్తుండటం ఒక అనుకూలాంశం. ఈ విష యంలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు ఒకే స్వరం వినిపిస్తున్నాయి. అణు ఒప్పందం ఏ ఒక్క దేశానిదో కాదని... దాన్ని కొనసాగించాలా లేదా అన్నది ఎవరో ఒకరే నిర్ణ యించడం కుదరదని ఆ దేశాలు చెబుతున్నాయి. రష్యా, చైనాలు సైతం సహజంగా ఇరాన్‌ పక్షం ఉంటాయి. ఇరాన్‌ మత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ కూడా భాగస్వామ్య దేశాలు ఒప్పందాన్ని గౌరవించినంతకాలమూ ఇరాన్‌ కూడా దానికి కట్టుబడి ఉంటుందని చెప్పడం మినహా  ఒప్పందాన్ని అమెరికా కాలదన్నితే తమ వ్యూహమేమిటన్నది బయటపెట్టలేదు. ఒప్పందం కుదిరి, అది సక్రమంగా అమ లవుతున్నప్పుడు కొత్త అభ్యంతరాలు లేవనెత్తడం, కొత్త షరతులు విధించాలనుకో వడం అమెరికా ప్రతిష్టనే దిగజారుస్తుంది. తన మిత్ర దేశాలకు లబ్ధి చేకూర్చడం కోసం ఇరాన్‌ను నిరాయుధం చేయాలనుకోవడం, సహచర పాశ్చాత్య దేశాల అభ్యంతరాలను సైతం బేఖాతరు చేయడం అమెరికా ప్రతిష్టకు హాని కలిగిస్తాయి. దాని విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. ఆ దుస్థితిని నివారించగలిగినవారు, కూర్చున్న కొమ్మను నరుక్కునే ఇలాంటి పోకడలను అరికట్టగలిగినవారు అమెరికా పౌరులే. వారందుకు సిద్ధపడాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top