ఠారెత్తిస్తున్న ట్రంప్‌

Donald Trump Questions Commitment To Defend NATO - Sakshi

డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక ఊహకందనివన్నీ చోటు చేసుకుని ప్రపంచ దేశాలతో పాటు అమెరికా పౌరులను కూడా దిగ్భ్రాంతపరుస్తున్నాయి. రెండో ప్రపంచయుద్ధానంతరం ఆవి ర్భవించి, ఆనాటి నుంచీ తనతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న నాటో కూటమి దేశాలతో అమెరికా పేచీకి దిగడం ఊహించని విషయం. అలాగే ఎప్పుడూ ప్రపంచ ఆధిపత్యం కోసం పోటీప డుతూ పరస్పర వైషమ్యాలతో పొద్దుపుచ్చే అమెరికా, రష్యాలు సన్నిహితం కావటం కూడా ఎవరి అంచనాకూ అందనిది. మొన్న యూరప్‌ దేశాలను సందర్శించినప్పుడు, హెల్సింకీలో రష్యా అధ్య క్షుడు పుతిన్‌తో శిఖరాగ్ర సమావేశం జరిపినప్పుడు ట్రంప్‌ ఊహాతీతంగానే వ్యవహరించారు.

స్వదేశంలో, సొంత ప్రభుత్వంలో ట్రంప్‌ గురించి ఎవరేమనుకుంటున్నారన్న సంగతలా ఉంచితే... ప్రపంచంలో కూటములు ఉండకూడదని, అగ్రరాజ్యాలు కలహించుకోరాదని ఆశించేవారికి ఇలాగే జరగాలన్న ఆశ ఉంటుంది. అధ్యక్ష స్థానంలో ట్రంప్‌ కాకుండా వేరే ఎవరైనా ఉండి ఈ మాదిరి పనులు చేసి ఉంటే అలాంటి ఆశకు బదులు ప్రపంచశాంతి కనుచూపు మేరలో సాధ్యమేనన్న దృఢ మైన నమ్మకం ప్రపంచ ప్రజానీకంలో ఏర్పడేది. కానీ దేనిపైనా నిలకడలేకుండా, ఇష్టానుసారం మాట్లాడే ట్రంప్‌పై ఎవరికీ విశ్వాసం లేదు. కనుకనే ఆయన చర్యల్ని ఎప్పటికప్పుడు విస్తుబోయి చూస్తున్నారు తప్ప విశ్వసించడం లేదు. బ్రస్సెల్స్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో ఆయన జర్మనీని తీవ్రంగా దుయ్యబట్టారు. అది రష్యా చెప్పుచేతల్లో పనిచేస్తున్నదని విమర్శించారు. నాటో లోని దేశాలన్నీ సైనిక వ్యయంలో తమ వంతు వాటాను పెంచాలని హెచ్చరించారు.

యూరప్‌ యూనియన్‌(ఈయూ) అమెరికాకు శత్రువే తప్ప మిత్రుడు కాదని ప్రకటించారు. ఆ తర్వాత బ్రిటన్‌ వెళ్లి ‘మీరు ఈయూతో చర్చించొద్దు... దానిపై వ్యాజ్యం తీసుకురండ’ని ఆ దేశ ప్రధాని థెరిస్సా మే కు సలహా ఇచ్చారు. రష్యా విషయంలో జర్మనీని అంతగా దుయ్యబట్టిన ట్రంపే హెల్సింకీ వెళ్లాక మాత్రం పుతిన్‌ను తెగ మెచ్చుకున్నారు. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్ని కల్లో రష్యా జోక్యం చేసుకుందని అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థలు, ప్రత్యేక దర్యాప్తు బృందం నాయకుడు మ్యూలర్‌ నిర్ధారించగా, ఆ విషయంలో రష్యాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధ మని పుతిన్‌ సమక్షంలోనే ఆయన ప్రకటించారు. అంతేకాదు  పుతిన్‌ ఆ ఆరోపణలన్నీ అబద్ధమని చెప్పారని కూడా తెలిపారు. అది ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టించిందంటే... అమెరికా ఇంటెలి జెన్స్‌ అధికారులే తమ అధ్యక్షుడి ప్రకటనను ఖండించారు. తన అధికారులే తనపై ఇలా తిరగబడతారని ఊహించని ట్రంప్‌ తెల్లారేసరికల్లా స్వరం మార్చారు.

ఘనమైన అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థలపై తనకు విశ్వాసమున్నదని, వారిచ్చిన నివేదికను తాను ఆమోదిస్తున్నానని ప్రకటించారు. పోనీ దానికైనా పూర్తిగా కట్టుబడి ఉండలేదు. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం తన వ్యతిరేకులు అల్లుతున్న కట్టుకథ అని బుధవారం మళ్లీ మాటమార్చారు. ‘తోచినట్టు మాట్లాడటం– ఇష్టాను సారం చేయటం’ అనే ఏకసూత్ర కార్యక్రమాన్నే ఆయన కొనసాగించదల్చుకున్నట్టు ఇవన్నీ చూస్తే బోధపడుతుంది. ఈ క్రమంలో ఎవరేమనుకున్నా ఆయనకు లెక్కలేదు. వెనకబడిన దేశాల అధినేత లంటే అమెరికా ప్రజలకు చిన్నచూపు ఉండేది. ఆ దేశాలను బనానా రిపబ్లిక్‌లని హేళన చేసేవారు. కానీ ట్రంప్‌ తీరుతెన్నులు చూశాక వారికి నోట మాట రావడం లేదు.

 అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థలు ఏం చెప్పినా... తన విదేశాంగ శాఖ అధికారులు ఎలాంటి సల హాలిచ్చినా ట్రంప్‌ ఏమాత్రం ఖాతరు చేయకుండా తాను సొంతంగా ఏర్పర్చుకున్న అభిప్రాయా లనే ఎక్కడికక్కడ చెబుతున్నారు. ఆ అభిప్రాయాలు కూడా నిలకడైనవి కాదు. సాధారణంగా ఏ దేశాధినేత అయినా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు విదేశాంగ శాఖలోని సీనియర్‌ అధికారులు ఎంతో కసరత్తు చేస్తారు. పర్యటించబోయే దేశంతో ఏకీభవించే అంశాలేమిటో, విభేదిస్తున్న అంశా లేమిటో... ఏ విషయంలో దృఢంగా వ్యవహరించాలో, ఎక్కడ తగ్గాలో చెబుతారు. అధినేతతో సమావేశమైనప్పుడు చెప్పాల్సిన అంశాలేమిటో వివరిస్తారు. డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనకు వెళ్లే ముందు కూడా ఇవన్నీ జరిగే ఉంటాయి. కానీ వీటన్నిటినీ ఆయన బుట్టదాఖలా చేసి తన ఇష్టాను సారం వ్యవహరించారని ట్రంప్‌ పర్యటనను ఆసాంతం గమనిస్తే అర్ధమవుతుంది. ఈయూను శత్రువుగా అభివర్ణించటం, బ్రిటన్‌ బ్రెగ్జిట్‌ విధానాన్ని తీవ్రంగా విమర్శించి అది అమెరికా–బ్రిటన్‌ వాణిజ్య ఒప్పందాన్ని దెబ్బతీస్తుందని అనటం... తీరా ఆ దేశం వెళ్లాక ‘నేనలా అనలేద’ని ఖండిం చటం... పుతిన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడుతున్నప్పుడే తమ ఇంటెలిజెన్స్‌ సంస్థలు రష్యాపై ఇచ్చిన నివేదికతో ఏకీభవించటం లేదని చెప్పటం–ఇవన్నీ దాని పర్యవసానాలే.

అంతర్జాతీయ వేదికపై తమ దేశం ఇలా తెల్లమొగం వేసే రోజొకటి వస్తుందని, క్షణక్షణానికీ మాట మార్చే వ్యక్తి ఒకరు అధ్యక్ష పీఠంపై కూర్చుంటారని దాని నిర్మాతలు అనుకుని ఉండరు. దశాబ్దాల తరబడి నిర్మించుకున్న వారధుల్ని ట్రంప్‌ వరసబెట్టి కూల్చేస్తుంటే ఈయూ దేశాల అధినేతలు తెల్లబోయి చూస్తున్నారు. శాలిస్‌బరీలో విష రసాయన ప్రయోగం జరిగిన ఉదంతంలో రష్యా ప్రమేయం ఉన్నదని ఆరోపించి, అందుకు ప్రతీకారంగా దాని దౌత్యవేత్తలను బ్రిటన్, ఇతర ఈయూ దేశాలు బహిష్కరించగా... వారితో ట్రంప్‌ చేతులు కలిపి తాను సైతం 60మంది రష్యన్‌ దౌత్యవేత్తలను వెలివేశారు. ఇటీవలే ఆ ఉదంతంలో ఒక మహిళ చనిపోయింది. కానీ హెల్సింకీలో ఆ ఉదంతంపై ట్రంప్‌ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అందుకే అమెరికాను మినహాయించుకుని  ప్రస్తుతానికి తమ మధ్య బంధాన్ని దృఢపరుచుకోవాలని ఈయూ దేశాలు నిర్ణయించాయి. అందుకు తగ్గట్టే అడుగులేస్తున్నాయి. మన దేశం కూడా విదేశాంగ విధానంలో, ఆర్థిక విధానాల్లో స్వీయ ప్రయోజనాలే గీటురాయిగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top