విద్యారంగ అవస్థ!

condition of education sector - Sakshi

పథకాలు కావొచ్చు, విధానాలు కావొచ్చు... వాటిని అమలు చేసే ప్రభుత్వాలు ఫలితాలెలా ఉంటున్నాయో సరిచూసుకోవాలి. తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలి. ఆ పథకాలు, విధానాలపై నిపుణులేమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వారి సలహాలు, సూచనల్లో సహేతుకమైనవి స్వీకరించి అమలు చేయాలి. మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యమైనప్పుడు ఇవన్నీ వాటంతటవే అమల్లోకి వస్తాయి. కానీ అత్యంత కీలకమైన విద్యా రంగం గురించి ఏటా స్వచ్ఛంద సంస్థ ప్రథమ్‌ వెలువరిస్తున్న వార్షిక విద్యా స్థితి(అసర్‌) నివేదికలపై మన పాలకులు అలాంటి దృష్టి పెట్టిన దాఖలాలు లేవు.

2005 నుంచి ప్రతియేటా వెలు వడుతున్న ఈ నివేదికలు ప్రభుత్వాల్లో కాస్తయినా కదలికలు తీసుకురాలేకపోతు న్నాయని తాజాగా వెలువడిన నివేదిక చూస్తే తెలుస్తుంది. 5–16 ఏళ్ల మధ్య వయ సున్న పిల్లలపై దృష్టి సారిస్తూ వారి విద్యా స్థితిగతులను వెల్లడిస్తూ వస్తున్న ప్రథమ్‌ ఈసారి 14 నుంచి 18 ఏళ్లలోపు వయసున్న పిల్లలను ఎంపిక చేసుకుంది. 24 రాష్ట్రా ల్లోని 28 జిల్లాల్లో గ్రామీణ ప్రాంత బడుల్లో అధ్యయనం చేసింది. మన బడులన్నీ ఎప్పటిలానే పిల్లలకు కనీస పరిజ్ఞానాన్ని అందించలేకపోతున్నాయని ఆ అధ్యయనంలో రుజువైంది.

అధికార గణాంకాల ప్రకారం 2004–05లో ప్రాథమిక విద్యారంగంలో కోటి 10 లక్షలమంది పిల్లలుంటే 2014–15 నాటికి అది 2 కోట్ల 20 లక్షలు దాటింది. అంటే రెట్టింపయింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా ఆ పిల్లలు వివిధ నైపుణ్యాల్లో ఎంతో వెనకబడి ఉన్నారని తాజా నివేదిక చెబుతోంది. 14–18 ఏళ్ల మధ్యనున్న పిల్లల్లో 14 శాతం మంది మన దేశ భౌగోళిక పటాన్ని గుర్తుపట్టలేకపోయారు. దేశ రాజధాని ఢిల్లీ అన్న సంగతి 36 శాతం మందికి తెలియదు. 25 శాతం మంది తమ మాతృభాషలో ఉన్న పాఠాన్ని కూడా వేగంగా చదవలేకపోతున్నారు. పాఠశాలల్లో చేరికల వరకూ చూస్తే 14 ఏళ్ల వయసులో బాల బాలికల నిష్పత్తి ఇంచుమించు సమానంగానే ఉంది.

కానీ 18 ఏళ్ల వయసు వచ్చే సరికి వ్యత్యాసం బాగా పెరుగుతోంది. ఆడపిల్లలు అధిక సంఖ్యలో చదువు మాను కుంటున్నారు. మగపిల్లల్లో చదువు మానుకుంటున్నవారి సంఖ్య 28 శాతం ఉంటే... ఆడపిల్లల్లో అది 32 శాతం. దేశ జనాభాలో 10 శాతంమంది 14–18 ఏళ్ల మధ్యనున్నవారే. ఈ వయసు పిల్లల్లో బాలికల కంటే బాలురే ప్రతిభను కనబరుస్తున్నారు. వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు బాలికలు బాగా వెనకబడి ఉన్నట్టు తేలింది. కంప్యూటర్ల వంటివి బాలికల కంటే బాలురకే ఎక్కువ అందుబాటులో ఉంటున్నాయని నివేదిక తెలిపింది. 

మరికొన్నేళ్లలో ఎక్కడో ఒకచోట ఉపాధి పొందాల్సిన ఈ వయసు పిల్లల్లో చదువు సంధ్యలు సరిగా లేకపోవడం, బాలికల్లో చాలామంది చదువు నుంచి తప్పుకోవడం, చదువుతున్న బాలికలకు సైతం బాలురకు ఉన్న సదుపాయాలు లభించకపోవడం గమనిస్తే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. భవిష్యత్తు భారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించాల్సిన తరమొకటి వివక్షల విషవలయంలో చిక్కుకున్నదని...అరకొర పరిజ్ఞానమే దానికి అందుబాటులో ఉన్నదని తెలుసుకున్నప్పుడు గుండె చెరువవుతుంది. దీన్ని చక్కదిద్దకపోతే సంభవించే పరిణామాలు ప్రమాదకరంగా ఉంటాయి. నేరాలు పెరుగుతాయి. అశాంతి రగులు తుంది. ఆ తర్వాతి తరాలు సైతం కనీస మౌలిక సదుపాయాలకు దూరమవుతాయి.

ఇతర రంగాలతో పోలిస్తే విద్యారంగం అత్యంత కీలకమైనది. నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా అన్నట్టు ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తిమం తమైన ఆయుధం విద్య. అది అందరికీ సమానంగా అందుబాటులో ఉన్నప్పుడే ఏ దేశమైనా బహుముఖ రంగాల్లో రాణిస్తుంది. వయసు పెరగడం, తరగతి మారడం తప్ప అదనంగా నేర్చుకుంటున్నదేదీ లేనప్పుడు... ఆ పిల్లలకు తగినంతమంది గురువులు అందుబాటులో లేనప్పుడు, ఉన్నా మెరుగైన విద్యను వారికి అందిం చలేకపోతున్నప్పుడు... కనీస సదుపాయాలు వారికి లభించనప్పుడు ఎందుకూ కొరగాని తరం అవతరిస్తుంది. మన దేశం అంతరాలకూ, వివక్షలకూ పుట్టిల్లు. సామాజికంగా, ఆర్థికంగా ఉన్న వ్యత్యాసాలకు తోడు చిన్ననాటినుంచే ఆడ, మగ మధ్య వివక్ష చూపే ధోరణి కూడా అధికం. ఇదంతా చిన్న వయసు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వారికి సరైన, ప్రామాణికమైన విద్య అందకుండా చేస్తున్నది.

ప్రథమ్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో 60 గ్రామాలను ఎంపిక చేసుకుంది. తెలంగాణలో నిజామాబాద్‌ జిల్లాలోని 60 గ్రామాలు తీసుకుంది. రెండుచోట్లా దాదాపు 950 కుటుంబాల చొప్పున ఎంపిక చేసుకుని 1,000 మందికి పైగా యువతను ప్రశ్నించింది. శ్రీకాకుళంలో అక్షరాస్యత శాతం 67.4 ఉంటే, నిజామాబాద్‌లో అది 66.5 శాతం. రెండుచోట్లా మిగిలిన అంశాల్లో మెరుగైన పరిస్థితులే ఉన్నా వృత్తి విద్యా కోర్సుల్లోనూ, నైపుణ్య శిక్షణలోనూ రెండు జిల్లాలూ వెనకబడే ఉన్నాయి. డిజిటల్‌ రంగానికొస్తే ఈ రెండుచోట్లా ఇంటర్నెట్‌ వాడకంలో యువత వెనకబడి ఉంటే బాలికల్లో ఆ వెనకబాటుతనం మరీ ఎక్కువగా ఉంది.

బాలికల్లో అత్యధికులకు కంప్యూటర్‌లు అందుబాటులో లేవు. ఒకపక్క ప్రభుత్వాలన్నీ రానున్న యుగం డిజిటల్‌ యుగమని ఊదరగొడుతుంటే ఉపాధికి చేరువలో ఉన్న యువత డిజిటల్‌ నిరక్షరాస్యులుగా మిగిలిపోవడం ఆశ్చర్య మనిపిస్తుంది. అటు వృత్తి విద్యా కోర్సులు, నైపుణ్య శిక్షణ... ఇటు కంప్యూటర్‌లు, ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంచేందుకు రెండు ప్రభుత్వాలూ చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రపంచంలో యువ జనాభా అధికంగా ఉన్నది భారత్‌లోనే. అయితే ఆ యువత తగినంత పరిజ్ఞానంతో, నైపుణ్యాలతో ఎదుగుతూ అవకాశాలను అందుకుంటేనే వారి కుటుంబాలు, ఆ కుటుంబాలతోపాటు రాష్ట్రం, దేశం ఎదు గుతాయి. వారి అవసరాలను ప్రభుత్వాలు గుర్తించి సకాలంలో సమకూర్చిననాడే అది సాధ్యపడుతుంది. లేనట్టయితే ఆ యువత పెను భారమవుతుంది. ప్రమా దకరంగా పరిణమిస్తుంది. పాలకులు దీన్ని గమనించుకోవాలి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top