మహాకుట్ర.. బందిఖానాలో గురువు

fraud in sripada srivallabha maha prasthanam in pithapuram - Sakshi

మహాసంస్థానం ఆస్తులపై కన్ను 

మోసంతో గురువు రామస్వామితో వీలునామా

ఎమ్మెల్యే సమక్షంలో ఈఓ దారబాబు వెల్లడి

పిఠాపురం టౌన్‌: శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో చోటు చేసుకున్న అనేక అక్రమాలు, మోసాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. సంస్థానం ఆవరణలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే వర్మ సమక్షంలో ఆలయ ఈఓ చందక దారబాబు పలు వివరాలను వెల్లడించారు. సంస్థానానికి చెందిన కారులోని డాష్‌ బోర్డులో దొరికిన కొన్ని డాక్యుమెంట్లను ఆయన బయట పెట్టారు. వీటి ప్రకారం సంస్థానం ఆస్తులన్నింటిని దస్తావేజు నెం.11.2017 ప్రకారం ట్రస్టు చైర్మన్‌గా వ్యవహరించిన రెడ్డెం శేషారావు(బాబులు)పేరున రాయించుకున్నారన్నారు. పిఠాపురం సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయంలో ఈ మేరకు రిజిష్టర్‌ అయినట్టు తెలిపారు. అంతేకాకుండా సవరణ డాక్యుమెంటు నం.125.2017 ప్రకారం రెడ్డెం బాబులు, చక్కా దత్త చలపతిరావు, చక్కా చలపతిరావు, గ్రంధి సూర్యనారాయణమూర్తి ఏకమై పాత కమిటీ చేసిన అవినీతిని విచారించేందుకు వారు వాడుకున్న డబ్బులు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సర్వ హక్కులు పొందడమే కాకుండా సేవా ట్రస్టులన్నింటి మీద తమకు మాత్రమే అధికారం ఉండే విధంగా సవరణ డాక్యుమెంటులో పొందుపరిచినట్టు తెలిపారు. 

గురువును మోసం చేసి వేలిముద్రల సేకరణ
గురువు రామస్వామిని మోసం చేసి ఆయన్ని నిద్రమత్తులో ఉంచి డాక్యుమెంటు వివరాలు తెలియజేయకుండా ఆయన వేలిముద్రలు తీసుకుని సంస్థానానికి దేశంలో ఉన్న మొత్తం ఆస్తిని తనకు చెందే విధంగా బాబులు సబ్‌రిజిష్ట్రార్‌ను బెదిరించి సంస్థానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత సవరణ వీలునామా రాయించుకున్నారని ఈ విషయాన్ని సబ్‌రిజిష్ట్రార్‌ స్వయంగా వివరించారని ఆలయ ఈఓ చందక దారబాబు తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పుడు గురువు రామస్వామికి తెలియచేయగా డాక్యుమెంట్లలో ఉన్న విషయాలు తనకు తెలియవని చెప్పారని ఈఓ తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు వెంటనే తాను మండల మెజిస్ట్రేట్‌ తహసీల్దార్, పోలీసు అధికారులు, సబ్‌ రిజిస్ట్రార్, ప్రభుత్వ డాక్టర్‌ను పిలిపించి వారి సమక్షంలో సంస్థానం ఆస్తుల మొత్తం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో ఉండే విధంగా గురువు రామస్వామి వీలునామా రాశారని తెలిపారు. 

అంతేకాకుండా రెడ్డెం బాబులు చైర్మన్‌గా ఉన్న ట్రస్ట్‌ 2017 ఏప్రిల్‌ ఒకటి నుంచి రెన్యువల్‌ కాలేదని అందువల్ల ఆ కమిటీకి చట్ట బద్ధత లేదన్నారు. ఈ కమిటీ నిర్వహించిన రూ.9 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఏవిధమైన అధికారిక చట్టబద్ధత లేదని అందువల్ల చట్టరిత్యా నేరం కిందకు వస్తుందన్నారు. కొంతమొత్తం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసినప్పటికీ మిగిలిన లావాదేవీలకు ఏవిధమైన బిల్లులు, పద్దులు అందుబాటులో లేవన్నారు. ఇదిలా ఉండగా గురువు రామస్వామి కొన్ని సంవత్సరాలుగా సంతకం చేయలేని స్థితిలో ఉండగా ఆయన పేరున రూ.50 వేలు, రూ.90 వేలు చెక్కులు ఫోర్జరీ సంతకంతో డ్రా చేశారన్నారు. 1998 నుంచి ఉన్న సంస్థానం కమిటీలు స్వలాభాపేక్షతో విధులు నిర్వహించారని, భక్తుల సౌకర్యార్థం, ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమాత్రం చేయలేదన్నారు. దాంతో మొత్తం కమిటీల యొక్క లావాదేవీలన్నింటిని క్షుణ్ణంగా విచారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈఓ చందక దారబాబు తెలిపారు. 

బందిఖానాలో గురువు
తొమ్మిది నెలల నుంచి గురువు రామస్వామిని బందిఖానాలో ఉంచి భక్తులెవ్వరినీ కలవనీయకుండా చేశారని ఈఓ చందక దారబాబు  తెలిపారు. ప్రస్తుతం ఆయన వీల్‌చైర్‌లో ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్నారని ఆయన కోరిక మేరకు సంస్థానంలో సంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమాలు జరగాలని, విద్యా, వైద్య మహిళాభివృద్ధికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కృషి చేయాలని తెలిపారు. ఆయన మరణానంతరం సంస్థానంలోనే మహానిర్యాణం(సమాధి)చేసి దత్త సంప్రదాయం ప్రకారం పూజాది క్రతువులు నిర్వహించాలని వీలునామాలో రాసినట్టు తెలిపారు. వీటిని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు తెలియజేస్తామన్నారు. ఎమ్మెల్యే వర్మ, పలువురు పట్టణ ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. 

 

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top