వైఎస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీ రేపే | YSRCPP district plenary turning | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీ రేపే

Jul 1 2017 2:56 AM | Updated on Sep 17 2018 7:53 PM

వైఎస్సార్‌సీపీ  జిల్లా ప్లీనరీ రేపే - Sakshi

వైఎస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీ రేపే

వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్లీనరీ సమావేశాలు జరిగాయని,

పోర్టు కళావాణి ఆడిటోరియం వేదిక
భూకుంభకోణాల కేసు నీరుగార్చేందుకే సిట్‌
పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌


డాబాగార్డెన్స్‌( విశాఖ దక్షిణ) :
వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్లీనరీ సమావేశాలు జరిగాయని, ఈ నెల 2న జిల్లా ప్లీనరీ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. విశాఖలో జరిగిన భారీ భూకుంభకోణంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు చెప్పారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా ‘సేవ్‌ విశాఖ’ పేరిట ఉద్యమం చేపడుతున్నట్టు తెలిపారు. జగదాంబ జంక్షన్‌ సమీపంలోని పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో అమర్‌నాథ్‌ మాట్లాడారు. ఏయూ కాన్వోకేషన్‌ హాల్లో ఈ ప్లీనరీ ఏర్పాటు చేయాలని ముందుగా నిర్ణయించామని, అందుకు సంబంధించి రిజిస్ట్రార్‌కు లేఖ కూడా రాశామన్నారు.

రిజిస్ట్రార్‌ స్పందిస్తూ మంత్రి గంటా శ్రీనివాసరావుతో మాట్లాడి చెబుతామని చెప్పడం చూస్తుంటే అధికార పార్టీకో న్యాయం, ప్రతిపక్ష పార్టీకో న్యాయంగా ఉందని అర్థమవుతోందన్నారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం వేదికగా టీడీపీ మహానాడు నిర్వహిస్తే రిజిస్ట్రార్‌ వారికి అనుమతించారన్నారు. అదే ప్రతిపక్ష పార్టీ ప్లీనరీ నిర్వహించడానికి ఒక్కరోజు.. అది కూడా ఆదివారం అనుమతి ఇవ్వమని కోరితే మంత్రిని అడిగి చెబుతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ విషయంలో రిజిస్ట్రార్‌ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వండని అడిగితే రిజిస్ట్రార్‌ స్పందించకపోవడం శోచనీయమన్నారు.

ఒక్కొక్కరిని ఒక్కో విధంగా చూడడం రిజిస్ట్రార్‌కు తగదన్నారు. ఈ నేపథ్యంలో పోర్టు కళావాణి ఆడిటోరియంలో జూలై 2న ప్లీనరీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, వంగవీటి రాధా, పార్థసారధి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో పాటు పలువురు ప్రముఖులు, 15 నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు పాల్గొంటున్నట్టు తెలిపారు.

సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, తిప్పల నాగిరెడ్డి, పార్టీ ప్రచార కమిటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, నగర మహిళ విభాగం అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుల్లి చంద్రశేఖర్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సురేష్‌కుమార్, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు మహ్మద్‌ షరీఫ్, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, నగర అధికార ప్రతినిధి మేరుగుమాల శ్రీదేవి, మహిళ విభాగం నగర కార్యదర్శి శ్రీదేవివర్మ, ప్రచార కమిటీ నగర అధ్యక్షుడు బర్కత్‌ ఆలీ, నగర నిర్వహక కార్యదర్శి కొల్లి నూకిరెడ్డి, నగర మహిళ నాయకులు  మళ్ల ధనలత, రాధా తదితరులు పాల్గొన్నారు.

సిట్‌ వల్ల ఉపయోగం లేదని ఆనాడే చెప్పాం
జిల్లా వ్యాప్తంగా జరిగిన భూకుంభకోణంపై సీబీఐచే విచారణ చేపట్టాలని వైఎస్సార్‌ సీపీ ప్రారంభం నుంచి డిమాండ్‌ చేస్తూనే ఉందని అమర్‌నాథ్‌ అన్నారు. దొరికిపోతామన్న భయంతో ముఖ్యమంత్రి, భూకుంభకోణ సూత్రధారుడు చంద్రబాబు వెనుకడుగు వేసి ‘సిట్‌’ వేశారన్నారు. సిట్‌ వల్ల న్యాయం జరగదని వైఎస్సార్‌సీపీ ముందుగానే తెలిపిందన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న డీజీపీ, జాయింట్‌ కలెక్టర్, ఆర్డీవోలతో సిట్‌ వేసి, కేసును నీర్చుగార్చేప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  ఐదువేల ఎకరాల్లో ట్యాంపరింగ్‌ జరిగిందని స్వయంగా కలెక్టరే తెలిపిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు.

చంద్రబాబు, మంత్రి లోకేష్‌ నుంచి ఫోన్లు రావడంతో ఆ కలెక్టరే కేవలం 250 ఎకరాల్లోనే ట్యాంపరింగ్‌ జరిగిందని, అదీ కూడా మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లోనేనని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సిట్‌ దర్యాప్తులో డీజీపీయే విశాఖలో గజం కూడా ఆక్రమణకు గురికాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అలాంటి వ్యక్తులతో దర్యాప్తు చేపడితే విశాఖ ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సంబంధించి ఆరోపణలు వస్తే వైఎస్‌ రాజశేఖరరెడ్డి సచీలత నిరూపించుకున్నారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తెరగాలని సూచించారు. విశాఖపట్నం ఇమేజ్‌ను చంద్రబాబు ప్రభుత్వమే డేమేజ్‌ చేసిందని, పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.

గాజువాకలో ఐదెకరాల అసైన్డ్‌ భూమి(ఎల్‌పీ నంబరు 32/2016)లో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి అత్యంత సాన్నిహితంగా ఉంటున్న కరణంరెడ్డి నరసింగరావు తన భార్య కరణంరెడ్డి జ్యోతి పేరిట లేఅవుట్‌ వేసి గజం 15 వేలు చొప్పున రూ.18 కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. కలెక్టర్‌పై నమ్మకం లేనప్పటికీ ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. భూ కుంభకోణానికి సంబంధించి అధికార పార్టీకి చెందిన వారు దోషులుగా నిలబడే సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే భూకుంభకోణంపై సీబీఐచే విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. విశాఖ మన్యంలో త్వరలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి∙పర్యటించున్నారని అమర్‌నాథ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement