వసతిగృహాన్ని పరిశీలించి వస్తున్న బుడ్డా శేషారెడ్డి
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోవడానికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 4వ తేదీ బుధవారం శ్రీశైలానికి వస్తున్నారు.
- లింగాలగట్టు, డ్యాం సందర్శన
·- సున్నిపెంటలో రోడ్‌షో
- శ్రీశైలంలో రాత్రిబస
·- 5న స్వామిఅమ్మవార్ల దర్శనం
శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోవడానికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 4వ తేదీ బుధవారం శ్రీశైలానికి వస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుడ్డా శేషారెడ్డి.. సోమవారం శ్రీశైలం చేరుకుని ఈఓ నారాయణ భరత్‌గుప్తతో వసతి ఏర్పాట్లపై చర్చించారు. అలాగే క్షేత్ర పరిధిలో జననేత బస చేసే వసతిగృహాన్ని పరిశీలించిన తరువాత రాయలసీమలో ఉన్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ..ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జులకే కేటాయించాల్సిన వసతిగదులపై కసరత్తు చేశారు. శ్రీశైల నియోజకవర్గంలో రైతు భరోసా యాత్ర..ఈ నెల 5 నుంచి ఆత్మకూరులో ప్రారంభమవుతుందని బుడ్డా తెలిపారు. అంతకు ముందుగా జననేత.. 4వ తేదీ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా లింగాలగట్టుకు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి డ్యాం సందర్శన చేసిన తరువాత సున్నిపెంటకు చేరుకుని సాయంత్రం వరకు రోడ్‌షోలో పాల్గొంటారని పేర్కొన్నారు. అదేరోజు రాత్రికి శ్రీశైలంలో బస చేస్తారని చెప్పారు. స్వామిఅమ్మవార్లను 5వ తేదీ ఉదయం దర్శించుకున్నాక శ్రీశైలం నుంచి బయలుదేరి దోర్నాల మీదుగా ఆత్మకూరుకు చేరుకుంటారన్నారు. అక్కడ బహిరంగ సభను నిర్వహిస్తారని బుడ్డా శేషారెడ్డి తెలిపారు.