
అంతర్రాష్ట్ర వంతెన మీదుగా ప్రవహిస్తున్న వరద నీరు
రెండు రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు
రెంజల్ (బోధన్): తెలంగాణ–మహారాష్ట్రల మధ్య రాకపోకలను రెండు రాష్ట్రాల అధికారులు నిలిపివేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెనపైనుంచి అడుగున్నర ఎత్తులో గోదావరి వరద నీరు ప్రవహించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ధర్మాబాద్ పోలీసులు, రెవెన్యూ అధికారులు వంతెనకు మహారాష్ట్ర భాగంలో చెక్‌పోస్టును ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు.
కందకుర్తి వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రెంజల్ తహసీల్దార్ శ్రావణ్‌కుమార్‌లు అక్కడికి చేరుకున్నారు. వరద పెరగడంతో గ్రామ శివారులో బారికేడ్లను పెట్టి రాకపోకలను నియంత్రించారు. స్థానికులు, రైతులు అటువైపు వెళ్లకుండా కందకుర్తి చెక్‌పోస్టు వద్ద పోలీసులను ఏర్పాటు చేశారు.
ఈ నెలలో వంతెన పైనుంచి గోదావరి ప్రవహించడం ఇది రెండోసారి. మంజీరా నది కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తుంది. దీంతో రెండు నదుల నుంచి వరద నీరు పోటెత్తుతోంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరో రెండు రోజుల వరకు వరద తగ్గే అవకాశం లేదని గ్రామాల్లో దండోరా వేయించారు.
ఆశ్రమంలో చిక్కుకున్న వారి తరలింపు
కందకుర్తి పుష్కర క్షేత్రంలోని సీతారాం త్యాగి మహారాజ్ ఆశ్రమం చుట్టూ వరద నీరు చేరడంతో ఆశ్రమంలో త్యాగి మహారాజ్, మరో నలుగురు చిక్కుకుపోయారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు స్థానికుల సహకారంతో ట్రాక్టర్‌లో వారిని సురక్షితంగా గ్రామంలోని శ్రీరామాలయానికి చేర్చారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
పది గేట్లు ఎత్తి సాగర్‌కు నీటివిడుదల
దోమలపెంట: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు స్పిల్‌వే, విద్యుదుత్పత్తి, సుంకేసుల, హంద్రీ నుంచి మొత్తం 2,68,831 క్యూసెక్కుల నీటి ప్రవాహాలు శ్రీశైలం జలాశయం వస్తున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను ఒక్కొక్కటి 14 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 3,45,730 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ అదనంగా 65,341 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.1 అడుగుల వద్ద 199.7354 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5,000, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,409, ఎంజీకేఎల్‌ఐకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 16.614 మిలియన్ యూనిట్లు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 15.114 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.