ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..

ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని.. - Sakshi


యువతి బలవన్మరణం

మృతదేహంతో నిందితుడి ఇంటి ఎదుట బంధువుల ఆందోళన

పర్వతగిరి గ్రామ శివారు సోమ్లాతండాలో విషాదం

పోలీసుల చొరవతో సద్దుమణిగిన వివాదం

ప్రియుడితో పాటు తల్లిదండ్రులపై కేసు నమోదు




మహబూబాబాద్‌ రూరల్‌ : ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్‌ మండలంలోని పర్వతగిరి గ్రామశివారు సోమ్లాతండాలో మంగళవారం జరిగింది.  స్థానికులు, రూరల్‌ ఎస్సై పత్తిపాక జితేందర్‌ కథనం ప్రకారం... సోమ్లాతండాకు చెందిన బానోత్‌ లాలు, పద్మ దంపతుల కుమార్తె లలిత(19) ఇంటర్‌ వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటోంది. ఇదేతండాకు చెందిన బాదావత్‌ మంగ్యా, లక్ష్మీ దంపతుల కుమారుడు శరత్‌ 10వ తరగతి వరకు చదువుకుని ఖాళీగా ఉంటున్నాడు. లలిత, శరత్‌ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. లలిత తనను పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు కోరినా అతడు వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో లలిత తల్లిదండ్రులు తండా పెద్దమనుషులను ఆశ్రయించి లలితకు న్యాయం చేయాలని కోరారు. పెద్దమనుషులు బాదావత్‌ శరత్‌ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించే విధంగా చూశారు. అయినా వారు పెళ్లికి నిరాకరించారు. తన తండ్రి పెళ్లికి ఒప్పుకోవడం లేదు.



ఈ క్రమంలో లలిత సోమవారం శరత్‌ను మహబూబాబాద్‌లో కలిసింది. తనను పెళ్లి చేసుకోమని వేడుకుంది. అయినా అతడు వినలేదు. దీంతో లలిత రైలుపట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. ఆమె బంధువులు లలితను వారించి ఇంటికి తీసుకెళ్లారు. నాలుగేళ్లపాటు ఎంతో నమ్మకంతో ప్రేమించిన శరత్‌ పెళ్లికి నిరాకరించడంతో మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన మృతురాలి కుటుంబ సభ్యులు లలిత మృతదేహాన్ని తీసుకువెళ్లి ప్రియుడు బాదావత్‌ శరత్‌ ఇంటి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. లలిత మృతి చెందిన విషయం తెలుసుకున్న బాదావత్‌ శరత్, అతడి తల్లిద్రండులు మంగ్యా, లక్ష్మీ ఇంటికి తాళం వేసి పరారయ్యారు.



జెడ్పీటీసీ సభ్యుడు మూలగుండ్ల వెంకన్న, టీడీపీ జిల్లా కార్యదర్శి భూక్య సునీత, పర్వతగిరి సర్పంచ్‌ గుగులోత్‌ వీరన్న, ఎంపీటీసీ సభ్యురాలు బాణోత్‌ కళ్యాణిహరిబాబు సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలి కుటుంబ çసభ్యులను ఓదార్చారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్‌ రూరల్‌ ఎస్సై పత్తిపాక జితేందర్‌ అక్కడికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడి శాంతింపజేశారు. లలిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రియుడు బాదావత్‌ శరత్, తల్లిదండ్రులు మంగ్యా, లక్ష్మీపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు రూరల్‌ ఎస్సై తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top