
రేషన్‌లో తీపి లేనట్టే?
నిరుపేదలకు చక్కెర దొరకడం గగనమవుతుందా?.. చౌకదుకాణాల ద్వారా పంపిణీ నిలిపివేయనున్నారా..?
►చక్కెరపై సబ్సిడీని ఉపసంహరించుకున్న కేంద్రం
►రేషన్‌ద్వారా పంపిణీ లేనట్టే !
►వచ్చే నెల నుంచే అమలు
►అంత్యోదయ కార్డులకు మినహాయింపు
నిరుపేదలకు చక్కెర దొరకడం గగనమవుతుందా?.. చౌకదుకాణాల ద్వారా పంపిణీ నిలిపివేయనున్నారా..? వచ్చే నెల నుంచి బహిరంగ మార్కెట్లోనే కొనుగోలు చేయాలా..? వీటికి అవుననే సమాధానం వస్తోంది. కేంద్ర ప్రభుత్వం చక్కెరపై సబ్సిడీ ఎత్తివేసింది. ఆ భారాన్ని రాష్ట్రప్రభుత్వం భరిస్తేనే ఇకపై చౌకదుకాణాల ద్వారా చక్కెర అందే వీలుందని విశ్లేషకులు అంటున్నారు.
పుత్తూరు : అల్పాదాయ వర్గాల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాట మాడుతున్నాయి. ఇన్నాళ్లూ చౌకదుకాణా ల ద్వారా అందిస్తున్న చక్కెరకు మంగళం పాడేందుకు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చక్కెరపై ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేయగా ఆభారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది.
వచ్చే నెల నుంచి దొరకడం గగనమే
చౌకదుకాణాల ద్వారా చక్కెర పంపిణీ వచ్చే నెల నుంచి ఆపేయనున్నట్లు తెలు స్తోంది. ప్రభుత్వం ప్రతి రేషన్‌కార్డుకు నెలకు అరకిలో చక్కెర రూ.6.75కు అంది స్తోంది. ఫిబ్రవరిలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చక్కెరకు అందిస్తున్న సబ్సిడీని ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఒక కిలో చక్కెరపై కేంద్రం రూ.18.5 సబ్సిడీగా అందిస్తోంది. దీన్ని ఉపసంహరించుకోవడంతో ఇక నుంచి బహిరంగ మార్కెట్‌లోనే చక్కెర కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. కేంద్రం ఉపసంహరించుకున్న సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే తప్ప రేషన్ దుకాణాల్లో చక్కెర సరఫరాకు మార్గం లేనట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చేదుకానున్న చక్కెర
జిల్లాలో 10,02,412 తెల్ల రేషన్‌కార్డులు న్నాయి. ప్రతి నెలా ఒక్కొక్కరికీ చౌకదుకాణాల ద్వారా అరకిలో చక్కెర అందుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కారణంగా ఇక నుంచి వీరంతా బహిరంగ మార్కెట్లో చక్కెర కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కిలో చక్కెర రూ.42 నుంచి రూ.45 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ పెరగనుండడంతో చక్కెర ధరకు రెక్కలొచ్చే అవకాశం ఉందని ట్రేడర్లు అంటున్నారు.
అంత్యో‘దయ’
అంత్యోదయ అన్నయోజన కార్డులు ఉన్న నిరుపేద వర్గాలపై కేంద్ర ప్రభుత్వం కరుణ చూపింది. జిల్లాలో 27, 586 ఏఏవై కార్డులు ఉన్నాయి. వీటికి యథావిధిగా సబ్సిడీని అందించేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ఏఏవై కార్డుదారులకు నెలకు ఒక కిలో చక్కెర సబ్సిడీపై అందించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.