సాహసబాలికలకు అభినందనలు

జ్యోతి, కవిత


వెల్దుర్తి: మండల కేంద్రమైన వెల్దుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదవ  తరగతి చదువుతున్న కవిత, జ్యోతిలు ఆదివారం అర్దరాత్రి  ఆఫ్రికా దేశం టాంజానియాలోని కిలిమంజారో పర్వత శిఖరంపై తెలంగాణ కీర్తిని నిలబెట్టి  జాతీయ జెండాను ఎగురవేసి నందుకు సాహస బాలికలకు  సర్వత్రా అభినందన వెల్లువలు  రేకెత్తుతున్నాయి.


జిల్లా నుండి గురుకుల పాఠశాలకు చెందిన బాలికలు కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ కృషి ఫలితంగా విజయం సాధించారని కొనియాడారు. ముఖ్యంగా జ్యోతి, కవితల సాహసంతో మండలానికి, గురుకుల పాఠశాలకు , బాలికల గ్రామాలైన దామరంచ, మానెపల్లి గ్రామాలకు కీర్తి ప్రతిష్టలు  పెరిగాయని పలువురు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆబాలికలతో  సన్నిహితంగా ఉన్న తోటి బాలికలు , పాఠశాల టీచర్లు , తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


నేను ఓడి.. మిత్రురాళ్లు గెలిచి..

నా మిత్రురాళ్లు జ్యోతి, కవితలతో నేను రన్నింగ్‌లో గెలిచి భువనగిరి కొండల్లో శిక్షణలో ఓడి పోయా. అయినా వారు పర్వతారోహణ  చేసినందుకు గర్వంగా ఉంది. నేనే సాహసం చేసినట్లుగా బావిస్తున్నా. వారి సాహసం మాపాఠశాలకు, మామిత్రురాల్లకు ఇదో సంతోషం. -  మమత. క్లాస్‌మేట్.


మాకు గర్వంగా ఉంది

మాజ్యోతి, కవితలు పర్వత శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగురవేసినందుకు సంతోషంగా ఉంది. ముందు ముందు ఇలాంటి సాహసాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని  కోరుకుంటున్నా. మా క్లాస్‌మేట్‌లు ఈసాహసం చేసినందుకు గర్వంగా ఉంది. - మహేశ్వరి. క్లాస్‌మేట్‌
ఎంతో పేరు వచ్చింది

మాది మధ్య తరగతి కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఉన్న ముగ్గురు కూతుళ్లను చదివిస్తున్నాం. మా రెండో కూతురు జ్యోతి ఇంత సాహసం చేయడం మాకు పేరు తెచ్చి పెట్టింది. అందరూ మమ్ము‍లను మెచ్చుకుంటున్నారు. ముందు ముందు ​మంచి ప్రయోజకురాలు కావాలన్నదే మా కోరిక. - జ్యోతి తల్లిదండ్రులు మైసమ్మ, రాజులు దామరంచ.


ఉన్నత స్థానంలో నిలవాలి

కవిత  పుట్టిన ఏడాదికి తల్లిదండ్రులు నాగమణి, రాజయ్యలు నాచేతిలో పెట్టి పట్నంకు వలస పోయారు. పెంచి పెద్ద చేసి చదివిస్తున్నా. ఇంత సాహసం చేయడంతో  ఆమె తలిదండ్రులు, మా గ్రామస్తులు మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. ఉన్నతమైన స్థానంలో నిలవాలన్నదే మా కోరిక. - కవిత పెద్దమ్మ రాజమణి. మానెపల్లి.


మా పాఠశాలకు కీర్తి పెరిగింది

మాబాలికలు ఇంత సాహసం చేయడంతో మాపాఠశాలకు  పేరు ప్రతిష్టలు, కీర్తి పెరిగింది. మాతోటి టీచర్లకు కూడా పేరు వచ్చింది. ముందు ముందు మాబాలికలు ఇలాంటి సాహసాలు చేసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నదే మాఆకాంక్ష. - జ్యోత్స్న పాఠశాల ఎస్‌ఓ వెల్దుర్తి.


ఘనంగా సన్మానిస్తాం..

గురుకుల పాఠశాల బాలికలు కవిత, జ్యోతిల సాహసంతో  మండలానికి  గుర్తింపు వచ్చింది.  వారు రాగానే ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ రాజమణిముర ళీయాదవ్‌ల చేతుల మీదుగా వారిని ఘనంగా సన్మానిస్తాం. - సునిత ఎంపిపి వెల్దుర్తి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top