ఏదీ మాఫీ | Where is loan waiver | Sakshi
Sakshi News home page

ఏదీ మాఫీ

May 31 2017 4:43 AM | Updated on Jun 4 2019 5:04 PM

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా మారింది జిల్లాలో పంట రుణమాఫీ పొందిన రైతుల పరిస్థితి.

సాక్షి, నిజామాబాద్‌ : దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా మారింది జిల్లాలో పంట రుణమాఫీ పొందిన రైతుల పరిస్థితి. ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేసినా అవి ఇంకా రైతుల ఖాతాల్లో జమ కావడం లేదు. ఈ మొత్తాన్ని రైతులకు అందించాల్సిన బ్యాంకర్లు తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం విడతల వారీగా మాఫీ నిధులను విడుదల చేసిన విషయం విదితమే. ఇందులో జిల్లాలోని 3.78 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.390.50 కోట్లను ప్రభుత్వం ఏప్రిల్‌ 15న విడుదల చేసింది.

ఈ మొత్తాన్ని వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయం అధికారులు ట్రెజరీ ద్వారా ఆయా బ్యాంకులకు విడుదల చేశారు. జిల్లాలో కూడా రైతుల ఖాతాల్లో వేయడంలో అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఈ సొమ్మును జమ చేసేందుకు వ్యవసాయశాఖ ఇచ్చిన గడవు ముగిసి పక్షం రోజులు గడుస్తున్నప్పటికీ బ్యాంకర్లు సగం మొత్తాన్ని కూడా రైతుల ఖాతాల్లో జమచేసిన దాఖలాల్లేవు. రుణమాఫీలో భాగంగా జిల్లాకు మొదటి విడతలో రూ.393.44 కోట్లు, రెండో విడతలో రూ.393 కోట్లు, మూడో విడతలో రూ.392.64 కోట్లు విడుదల చేసిన విషయం విధితమే.
 
రెన్యూవల్‌ చేసుకుంటేనే..
సర్కారు రైతులకు మాఫీ చేసిన సొమ్మును రైతులకు ఇచ్చేందుకు కొందరు బ్యాంకర్లు తిరకాసు పెడుతున్నారు. రైతులు తమ పంట రుణాలను రెన్యూవల్‌ చేసుకుంటేనే ప్రభుత్వం విడుదల చేసిన ఈ మాఫీ మొత్తాన్ని లోన్‌ ఖాతాల్లో వేస్తామని కొర్రి పెడుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు విడుదల చేసిన ఈ మొత్తాన్ని లోన్‌ ఖాతాల్లో కాకుండా, రైతుల పొదుపు (సేవింగ్‌) ఖాతాల్లో జమ చేస్తే ఆ మొత్తాన్ని రైతులు తమ అవసరాలకు వాడుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజను ప్రారంభమవుతోంది. ఈ తరుణంలో రైతులకు సాగు పెట్టుబడుల కోసం పెద్ద మొత్తంలో ఆర్థిక అవసరాలు ఉంటాయి.
 
పట్టించుకోని వ్యవసాయశాఖ
సర్కారు ఇచ్చిన మాఫీ సొమ్ము రైతులకు అందించడంలో చొరువ చూపాల్సిన వ్యవసాయశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వచ్చిన నిధులను బ్యాంకు కంట్రోలర్‌ ఖాతాల్లో జమ చేసి చేతులు దులుపుకున్న వ్యవసాయశాఖ జిల్లా ఉన్నతాధికారులు ఆ మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేశారా.? లేదా...? అనే అంశాన్ని ఇప్పటి వరకు పర్యవేక్షించిన దాఖాల్లాలేవు. వచ్చిన నిధుల్లో ఎంత జమ చేశారు. ఇంకా జమ చేయాల్సిన మొత్తం ఎంత? వంటి వివరాలేవీ వ్యవసాయశాఖ  వద్ద  లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement