మార్పుల పేరిట కార్మిక చట్టాల నిర్వీర్యం | Sakshi
Sakshi News home page

మార్పుల పేరిట కార్మిక చట్టాల నిర్వీర్యం

Published Sat, Aug 6 2016 8:05 PM

weaken labour laws due to changes

ఏయూక్యాంపస్‌: కార్మిక చట్టాల్లో మార్పుల పేరిట చట్టాలను నిర్వీర్యం చేస్తూ పరిశ్రమలను చట్టపరిధిలోనికి రానీయకుండా చేస్తున్నారని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ అఖిల భారత కన్వీనర్‌ డాక్టర్‌ కె.హేమలత ఆరోపించారు. ఏయూ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరంలో  శనివారం నిర్వహించిన శ్రామిక మహిళా సమన్వయ కమిటీ (సీఐటీయూ) ఎనిమిదవ రాష్ట్ర సదస్సులో మాట్లాడారు. కార్మికులను బానిసలుగా మారుస్తూ, యజమానులకు లాభాలు పెంచే దిశగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. సామాజిక, భద్రత, సరైన వేతనాలు లేకుండా కార్మికులు జీవనం సాగిస్తున్నా, వారి సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయన్నారు. శ్రామిక మహిళలల్లో 96 శాతం మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నా, వీరికి ఎలాంటిæ చట్టాలూ వర్తించడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం యాజమాన్యాలకు సేవ చేస్తోందని ఆక్షేపించారు. కేంద్ర కార్మిక శాఖమంత్రి ప్రసూతి సెలవును 26 వారాలకు పెంచాలని ప్రకటించడం ఆహ్వానించదగినదన్నారు. అదే సమయంలో చిన్న ఫ్యాక్టరీల చట్ట సవరణ వల్ల 40 మంది కంటే తక్కువ కార్మికులనున్న పరిశ్రమలకు ఈ చట్టం వర్తించదన్నారు. ఈ నిర్ణయం వల్ల 70 శాతం పరిశ్రమలు ఏ చట్టమూ వర్తించకుండా లాభ పడతాయన్నారు.
మహిళలు నిత్యం తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని, వాటిని ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నాయని ఆరోపించారు. బ్రాండెక్స్, అంగన్‌వాడీ, ఆశ, మున్సిపల్‌ పోరాటాలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలని పేర్కొన్నారు.  సెప్టెంబర్‌ 2న జరిగే సమ్మె, ఆగస్టు 9న జరిపే జైల్‌ భరో కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ ప్రత్యేక ఆర్థిక మండళ్లు(ఎస్‌ఈజెడ్‌) ఆధునిక జైళ్లుగా నిలుస్తున్నాయన్నారు. 24 గంటలు దుకాణాలు తెరవవచ్చనే వెసులుబాటు మహిళల రక్షణను ప్రశ్నార్ధకంగా మారుస్తుందన్నారు. శ్రామిక మహిళల §lష్టికోణంలో చట్టాలు, పని పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందన్నారు. వివక్షత వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ నాయకురాలు పి.రోజా పతావిష్కరణ చేశారు.  రెండు రోజుల సదస్సులో ఎం.కామేశ్వరి, కె.స్వరూపారాణి, బేబిరాణి, రాష్ట్ర కన్వీనర్‌ కె.ధనలక్ష్మి, సీఐటీయూ నగర, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎం.జగ్గునాయుడు, ఎస్‌.రమేష్‌లు పాల్గొన్నారు. 13 జిల్లాల నుంచి 220 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

Advertisement
Advertisement